Re-survey: వచ్చే ఏడాదిలోగా రీ-సర్వే పూర్తి

వచ్చే ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూముల రీ-సర్వేను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకునే

Updated : 19 Jan 2022 06:01 IST

భూ యజమానులకు భరోసా

అన్ని వివాదాలకూ పరిష్కారం

ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం ప్రారంభం

ఈనాడు, అమరావతి: వచ్చే ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూముల రీ-సర్వేను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని దశల వారీగా ప్రారంభిస్తామన్నారు. ‘సింగిల్‌విండో విధానంలో కూడా ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దీని వల్ల భూముల సమాచారాన్ని ఎప్పుడైనా, ఎక్కడ నుంచైనా పొందే అవకాశం లభిస్తుంది. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరి భూమి హద్దులను ఆధునిక పద్ధతుల్లో గుర్తించి, యూనిక్‌ ఐడీని క్రియేట్‌ చేస్తాం. సబ్‌ డివిజన్ల వారీగా వివరాలు క్రోడీకరించి, యజమానులకు పట్టాలు అందజేస్తాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.1,000 కోట్ల ఖర్చుతో 2020 డిసెంబరు 21న భూముల రీ సర్వేను ప్రారంభించాం. కార్స్‌, డ్రోన్స్‌ టెక్నాలజీని రీ-సర్వేకు ఉపయోగిస్తున్నాం...’ అని ఆయన పేర్కొన్నారు.

51 గ్రామాల భూ రికార్డులు ప్రజలకు అంకితం

వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంలో భాగంగా తొలిదశ కింద 51 గ్రామాల్లో పూర్తి చేసిన భూముల రీ-సర్వే రికార్డులను ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. ఇందులో 37 గ్రామాల్లో భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు భూ వివాదాలను నా దృష్టికి తెచ్చారు. రికార్డుల్లో ఉన్న భూమికి, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య తేడాలు ఉన్నాయి. ఒక సర్వే నెంబరులో అమ్మకాలు జరుగుతున్నా సబ్‌డివిజన్‌ జరిగి ఉండదు. పట్టాదారు పాస్‌బుక్‌ ఏర్పాటు వల్ల ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదు. రికార్డుల్లో తమ భూముల వివరాలు తారుమారయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా పెరుగుతున్నాయి. 80% నుంచి 90% సివిల్‌ కేసులు ఉన్నాయి. రీ-సర్వే ద్వారా ఇవన్నీ పరిష్కారమవుతాయి...’ అని వివరించారు.

3 వారాల్లోగా మిగిలిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు

ప్రస్తుతానికి 37 గ్రామాల్లోని సచివాలయాల్లోనే భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించినట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. మిగిలిన 14 గ్రామాల సచివాలయాల్లోనూ మరో మూడు వారాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభమవుతాయన్నారు. సబ్‌డివిజన్‌ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ‘గ్రామాల్లోనే ఆస్తుల లావాదేవీలు కనిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీని వల్ల యజమానులకు తెలియకుండా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇదోక పెద్ద సంస్కరణ. ప్రతి ఒక్క కమతాన్ని డిజిటల్‌గా నిర్ణయించి, క్యూఆర్‌ కోడ్‌తో ల్యాండ్‌ మ్యాప్‌ను ఇస్తున్నాం. భూముల హద్దులను గుర్తించి, అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా మార్కింగ్‌ చేస్తాం. ప్రతి ఒక్క కమతానికి నిర్దిష్టంగా ఒక ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ కూడా ఇస్తున్నాం. ఈ శాశ్వత భూ హక్కు పథకం అమలు వల్ల నకిలీ పత్రాలకు తావుండదు. ఆస్తులు అమ్ముకున్నా సబ్‌డివిజన్‌ వెంటనే చేసిన తర్వాతనే ఆ లావాదేవీలు ఆధారంగా మాత్రమే భూ రికార్డుల్లో మార్పులు జరుగుతాయి. గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్‌ లైన్‌ దరఖాస్తులను 15 రోజుల్లోనూ, పట్టా సబ్‌డివిజన్‌ దరఖాస్తులను 30 రోజుల్లోనూ పరిష్కరించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించాం...’ అని సీఎం జగన్‌ వివరించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ‘రీ-సర్వే’ జరిగిన గ్రామాల్లోని పలువురితో వర్చువల్‌ విధానంలో సీఎం జగన్‌ మాట్లాడారు.


సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా 37 సచివాలయాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 37 గ్రామ/వార్డు సచివాలయాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.  అలాగే సచివాలయాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులను సబ్‌-రిజిస్ట్రార్లుగా కూడా నియమిస్తున్నట్లు తెలిపింది. భూముల రీ-సర్వే ఇప్పటివరకు 51 గ్రామాల్లో పూర్తయింది. తొలివిడత కింద వీటిలో 37 గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను మంగళవారం నుంచి ప్రారంభించారు.ఓటీఎస్‌ రుణాన్ని చెల్లించేందుకు డ్వాక్రా సభ్యులతో అప్పు చేయిస్తున్నారు. రుణం చెల్లించేందుకు నగదు లేదంటున్న డ్వాక్రా సభ్యులకు బ్యాంకు లింకేజీ, పొదుపు నుంచి రుణం ఇప్పిస్తున్నారు. బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే 9% వడ్డీతో తిరిగి చెల్లించాలి. అదే పొదుపు ద్వారా అయితే రూపాయి వడ్డీ (12%) కట్టాలి. వాస్తవానికి డ్వాక్రా రుణాలను వారి జీవనోపాధికి వినియోగించుకోవాలి. కాని ప్రభుత్వం ఇలా అప్పులకు వినియోగించుకోవడం విమర్శల పాలవుతోంది. ఓటీఎస్‌ మొత్తాన్ని కట్టేందుకు పొదుపు ద్వారా రూ.10వేలు తీసుకుంటే ఆ రుణాన్ని 10 నెలల్లో నెలకు రూ.1,100 చెల్లించాలని విశాఖ జిల్లా నక్కపల్లిలో వెలుగు అధికారులు లబ్ధిదారులకు చెబుతున్నారు. అంటే 10 నెలల్లో అదనంగా రూ.1000 చెల్లించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని