తెలుగు జాతికే గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌

ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి తెలుగు జాతికే గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ విజయాలు సాధించవచ్చని నిరూపించారన్నారు. సినిమా రంగంలో

Published : 19 Jan 2022 03:14 IST

ఆయన సేవలు మరువలేనివి
తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి తెలుగు జాతికే గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ విజయాలు సాధించవచ్చని నిరూపించారన్నారు. సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా...రాజకీయ రంగంలో తిరుగులేని నేతగా ఆయన చేసిన సేవలు మరువలేనివని వెల్లడించారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఘననివాళి అర్పించారు.

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పోరాటం

‘ఈ ఏడాది మార్చి నాటికి తెదేపా ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తవుతుంది. 2023 మే 28న ఎన్టీఆర్‌ శతజయంతిని జరపనున్నాం. ఇవి రెండూ తెదేపాకే కాకుండా తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన రోజులుగా ఉండబోతున్నాయి. ఎన్టీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల అభివృద్ధికి పునరంకితమవుదాం. అధికారం ఉన్నా... లేకున్నా ప్రజల కోసం శ్రమించే పార్టీగా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేద్దాం. పాలకుల వైఫల్యాలతో రాష్ట్రం అథోగతి పాలవుతున్న తరుణంలో దూకుడుగా పోరాటం చేయాల్సి ఉంది.  ప్రజల పక్షాన తెదేపా ప్రయాణాన్ని కొనసాగిద్దాం...’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


ఎన్టీఆర్‌ అంటే ఒక వ్యక్తి కాదు... వ్యవస్థ

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఎన్టీఆర్‌ అంటే ఒక వ్యక్తి కాదని, ఆయనొక వ్యవస్థ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, అశోక్‌బాబు, జనార్దన్‌, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పిల్లి మాణిక్యరావు, సయ్యద్‌ రఫీ, తదితరులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ బ్లడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలను వాడవాడలా తెదేపా శ్రేణులు నిర్వహించాయి. అన్నదానాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. పలుచోట్ల పేదలకు వస్త్ర వితరణ చేశారు. 

* విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఎన్టీ రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలన్నారు. విశాఖ నగరంలోని బీచ్‌ రోడ్డులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పాలనలో పేదలకు ఉచితంగా గృహాలను నిర్మిస్తే లబ్ధిదారుల నుంచి నేటి పాలకులు ఓటీఎస్‌ పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని