ఇప్పటికైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తారా?

‘ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా ప్రశ్నిస్తారా.. లేదా? పీఆర్‌సీపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చాక కూడా ఆందోళన చేయకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కార్యాచరణ ప్రకటించాలి’ అని సచివాలయ

Published : 19 Jan 2022 04:50 IST

సచివాలయంలో వెంకట్రామిరెడ్డి నిలదీత

ఈనాడు, అమరావతి: ‘ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా ప్రశ్నిస్తారా.. లేదా? పీఆర్‌సీపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చాక కూడా ఆందోళన చేయకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కార్యాచరణ ప్రకటించాలి’ అని సచివాలయ ఉద్యోగులు తమ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని నిలదీశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది భారీసంఖ్యలో సచివాలయంలోని మూడో బ్లాక్‌లోని సంఘ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని మీరు చెప్పటం వల్లనే నిరసనల్లో పాల్గొనలేదని, ఇప్పటికైనా నిరసన కార్యక్రమాలను ప్రకటిస్తారా.. లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందన్న సమాచారంతోనే ఇప్పటివరకు వేచి చూశామని వెంకట్రామిరెడ్డి వారికి చెప్పారు.

ఆందోళన చేస్తాం: వెంకట్రామిరెడ్డి

పీఆర్సీపై జీవోలను నిరసిస్తూ బుధవారం నుంచి ఆందోళన నిర్వహించనున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సంఘ కార్యాలయంలో ఉద్యోగుల సమన్వయ సమావేశం సుమారు రెండు గంటలు నిర్వహించారు. అనంతరం సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి వినతిపత్రం ఇవ్వాలని ప్రదర్శనగా వెళ్లారు. సీఎస్‌ లేకపోవటంతో ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పీఆర్సీసై ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలి. దీనివల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనిపై దశలవారీగా ఆందోళన నిర్వహిస్తాం. గత రెండు నెలలుగా పీఆర్‌సీపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఫిట్‌మెంట్‌ తక్కువైనా మిగిలిన విషయాల దృష్ట్యా అప్పట్లో అంగీకరించాం. హెచ్‌ఆర్‌ఏ తగ్గించటాన్ని అంగీకరించేది లేదు’ అన్నారు. 

ఉద్యోగ సంఘాలన్నింటితో కలిసి కార్యాచరణ

ఉద్యోగుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా పీఆర్సీపై ఇచ్చిన జీవోలను పునఃసమీక్షించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. సచివాలయంలో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ వల్ల ఉద్యోగుల జీతంలో 4-12 శాతం కోతపడే అవకాశం ఉంది. మధ్యంతర భృతిని రికవరీ చేస్తామనడం ఏంటి? అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారు. మరో రెండు నెలలు ఆలస్యమైనా ఉద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వం కసరత్తుచేయాలి. ప్రభుత్వతీరుపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని