పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి

పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండు చేశాయి. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల తగ్గింపు, సీసీఏ రద్దు, పింఛనుదారులకు అదనపు

Published : 19 Jan 2022 04:47 IST

హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదనపు పింఛను యథావిధిగా కొనసాగించాలి

ఉపాధ్యాయ సంఘాల డిమాండు

ఈనాడు, అమరావతి: పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండు చేశాయి. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల తగ్గింపు, సీసీఏ రద్దు, పింఛనుదారులకు అదనపు క్వాంటంలో మార్పును తీవ్రంగా వ్యతిరేకించాయి. అశుతోష్‌మిశ్ర నివేదికపై చర్చించాకే పీఆర్సీని అమలు చేయాలన్నాయి.

ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం: వైఎస్సార్‌ టీచర్స్‌ సమాఖ్య

పీఆర్సీ ఉత్తర్వులను ఉపసంహరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని వైఎస్సార్‌ టీచర్స్‌ సమాఖ్య ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌కుమార్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ‘హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల తగ్గింపును వ్యతిరేకిస్తున్నాం. పింఛనుదారుల అదనపు క్వాంటంను గతంలోలాగే కొనసాగించాలి’ అని కోరారు.

ఫిట్‌మెంట్‌ 27% ఇవ్వాలి: ఒంటేరు

ఫిట్‌మెంట్‌ 27% ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు. ‘హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను యథావిధిగా ఉంచాలి. పీఆర్సీని ఐదేళ్లకే అమలు చేయాలి’ అన్నారు.

వేతనాలు తగ్గుతున్నాయి: ఫోర్టో

ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏల్లో కోత విధించడంతో వేతనాలు తగ్గిపోతున్నాయని రిజిస్టర్డ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫోర్టో) ఛైర్మన్‌, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, సామల సింహాచలం అన్నారు. ‘ఇది రివర్స్‌ పీఆర్సీ. ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్‌ఆర్‌ఏ తగ్గించడం అన్యాయం. పీఆర్సీని పునఃసమీక్షించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’ అన్నారు.

ఈ పీఆర్సీ మాకొద్దు: అపస్‌

ఉద్యోగులు, పింఛనుదారులకు నష్టం కలిగించే పీఆర్సీ తమకొద్దని ఏపీ ఉపాధ్యాయ సంఘం (అపస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రావణ్‌కుమార్‌, బాలాజీ వెల్లడించారు. ‘పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి. పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు కొనసాగించాలి. సీసీఏ ఇవ్వాలి’ అని డిమాండు చేశారు.

అన్ని అలవెన్సుల్లోనూ కోతే: ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం

పీఆర్సీలో అన్ని అలవెన్సుల్లో కోత విధించడం సహేతుకం కాదని ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లెక్కల జమాల్‌రెడ్డి, గురువారెడ్డి వెల్లడించారు. ‘ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నాం. ఈ పీఆర్సీ మాకొద్దు. హెచ్‌ఆర్‌ఏ, అదనపు పింఛను, సీసీఏ యథాతథంగా ఉంచాలి’ అన్నారు. 

అశుతోష్‌ మిశ్ర నివేదికపై చర్చించాలి: డీటీఎఫ్‌

అశుతోష్‌ మిశ్ర నివేదికపై చర్చించాకే పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకోవాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరహరి, రమణయ్య వెల్లడించారు. ‘అధికారుల కమిటీ నివేదిక ఉద్యోగ, పింఛనుదారుల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. మధ్యంతర భృతికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఉండాలి. అన్ని భత్యాలనూ కొనసాగించాలి. పీఆర్సీ ఐదేళ్లకోసారి అమలుచేయాలి’ అని కోరారు.

ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటా: ఎమ్మెల్సీ కత్తి

పీఆర్సీ అమలు ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు. ‘పోరాడి సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏలో కోత, సీసీఏ రద్దు, ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తగ్గించడంతో ఉద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పింఛనుదారుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటాను’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని