కోర్టులు చెప్పే వరకు కదలరా?

కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన తాత్సార వైఖరిపై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం విరుచుకుపడింది. పదేపదే జారీ చేస్తున్న ఉత్తర్వులను పట్టించుకోరా? అని నిలదీసింది.

Updated : 20 Jan 2022 04:40 IST

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ఏపీ తాత్సారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
హాజరై క్షమాపణలు చెప్పిన సీఎస్‌ సమీర్‌శర్మ
ఇకపై ఇలాంటిది జరగదని న్యాయస్థానానికి హామీ

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన తాత్సార వైఖరిపై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం విరుచుకుపడింది. పదేపదే జారీ చేస్తున్న ఉత్తర్వులను పట్టించుకోరా? అని నిలదీసింది. కోర్టులు చెప్పేంతవరకూ స్పందించే గుణం లేదా, ఆ మాత్రం సున్నితత్వం (సెన్సిటివిటీ) లేకుండా పోయిందా అని మండిపడింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ రెండు రాష్ట్రాల సీఎస్‌లు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ, బిహార్‌ సీఎస్‌ అమిర్‌ సుభానీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మాసనం ముందు హాజరై క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

బుధవారం ఉదయం కేసు విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘కొవిడ్‌తో మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని పదేపదే ఉత్తర్వులు జారీచేసినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాత్సారం చేసింది. కొవిడ్‌తో 14,471 మంది మృతి చెందినట్లు రికార్డుల్లో నమోదైతే, పరిహారం కోసం 31 వేలకుపైగా దరఖాస్తులొచ్చినట్లు న్యాయవాది చెప్పారు. ఇప్పటివరకు 11వేల మందికే పరిహారం చెల్లించారు. అర్హులకు పరిహారం చెల్లించకపోవడం అంటే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమే. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యత వహించాలి. సీఎస్‌ రెండు గంటలకు హాజరై, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలి’’ అని జస్టిస్‌ ఎంఆర్‌ షా ఆదేశించారు. బిహార్‌ సీఎస్‌కూ ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో రెండురాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మధ్యాహ్నం 2 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బసంత్‌ సమగ్ర వివరాలను మరోసారి కోర్టుకు వివరించారు.

ఇప్పటివరకు 23,895 క్లెయిమ్‌లకు క్లియర్‌ చేశామనగా జస్టిస్‌ ఎంఆర్‌షా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉదయం 11,494 క్లెయిమ్‌లే చెల్లించినట్లు చెప్పి, ఇప్పుడు 23వేల పైచిలుకు లెక్కలు చెబుతున్నారేంటి? అని ప్రశ్నించారు. న్యాయవాది బదులిస్తూ కొంత అయోమయంతో అలా చెప్పామని, ఇంకా చెల్లించాల్సిన క్లెయిమ్‌లు 10,894 మాత్రమే ఉన్నాయన్నారు. కోర్టు ఆరాటంతోనే ఇన్ని దరఖాస్తులు వచ్చాయని, అర్హమైన అన్నింటినీ క్లియర్‌ చేయడానికి రెండు వారాల సమయం కావాలని కోరారు. దాంతో జస్టిస్‌ ఎంఆర్‌ షా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆరాటం కోర్టుకు తప్పితే మీకు లేదని వ్యాఖ్యానించగా న్యాయవాది స్పందిస్తూ... సీఎస్‌ ఇక్కడే ఉన్నారని, మీ ఆరాటాన్ని వారికి చెప్పి త్వరగా చర్యలు తీసుకొనేలా చేస్తామన్నారు. అందుకు జస్టిస్‌ ఎంఆర్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి విషయంలో కోర్టు చెప్పేంతవరకు ఎందుకు వేచిచూస్తున్నారు? పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఇప్పటివరకు మీ ముందుకు వచ్చిన క్లెయిమ్‌ల్లో రికార్డులపరంగా నమోదైన 14,471 కేసులను కలిపారా? లేదా? అని అడిగారు. వాటినీ కలిపామంటూనే సీఎస్‌ సమీర్‌శర్మ కూడా ఇక్కడే ఉన్నారని న్యాయవాది పేర్కొనగా... ఆయన తెరమీదికి  వచ్చి కోర్టుకు క్షమాపణలు తెలిపారు. జరిగిన దానికి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు. రికార్డులను తనిఖీచేస్తున్నామని కొన్నిచోట్ల పేర్లుంటే, మరికొన్నిచోట్ల వయసు మాత్రమే ఉందని, ఇంకొన్నింటిపై అడ్రస్‌ లేకపోవడంతో అన్నింటినీ తనిఖీ చేస్తున్నామని వివరించారు. దానిపై జస్టిస్‌ ఎంఆర్‌ షా తీవ్రంగా మండిపడ్డారు.

మీరు రికార్డులను అంత లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారన్నమాట అని అసహనంగా వ్యాఖ్యానించారు. కిందిస్థాయిలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని, ఇకపై ఏదైనా తప్పు జరిగితే కోర్టు ధిక్కరణ కింద శిక్ష ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉంటానని, మరో రెండు వారాల్లో అందరికీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ మరోసారి ఇలా హాజరయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవాలని సమీర్‌శర్మకు సూచించారు. సీఎస్‌ స్పందిస్తూ ‘‘ఇలా సుప్రీంకోర్టు ముందు హాజరుకావడం ఇదే తొలిసారి. చాలా అవమానకరంగా, టెరిబుల్‌గా ఉంది. మరోసారి ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటా’’ అని హామీ ఇవ్వడంతో ధర్మాసనం వాదనలను ముగించి తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

అనాథలైన పిల్లలను ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు పరిహారం కోసం 41,292 దరఖాస్తులు రాగా, అందులో 34,819 దరఖాస్తులకు పరిహారం పొందే అర్హత ఉన్నట్లు తేల్చారు.  వీటిలో 23,895కి పరిహారం అందింది. 10,984 మందికి చెల్లించాల్సి ఉంది.
అందులో 5,141 క్లెయిమ్‌లను క్లియర్‌ చేశారు. వాటికి మూడురోజుల్లోపు చెల్లించేయాల్సి ఉంది. ఇప్పటివరకు తిరస్కరించిన 6,473 క్లెయిమ్‌లను సంబంధిత ఫిర్యాదుల పరిష్కార కమిటీలు సొంతంగా సమీక్షించి, దరఖాస్తుల్లోని లోపాలను సరిదిద్దుకొనే అవకాశమివ్వాలి. బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన మేరకు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 10 వేల మందికి పైగా పిల్లలు అనాథలయ్యారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే పోర్టల్‌లో పేర్లు నమోదైన పిల్లలను చేరుకొని వారికి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాల్లో వాస్తవంగా నమోదైన మరణాలు, బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌లో నమోదైన వివరాలను అక్కడి ప్రభుత్వాలు స్థానిక లీగల్‌ సర్వీస్‌ అథారిటీకి అందించాలి. తల్లిదండ్రులు ఇద్దరినీ, ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లల     వివరాలన్నీ సమర్పించాలి’’ అని జస్టిస్‌ ఎంఆర్‌షా ఆదేశించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని