సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మితే నష్టమేంటి?

సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయ నిర్ణయంలో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. పన్ను ఎగవేతను నియంత్రించేందుకే ఈ విధానమని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్‌ (సవరణ) చట్టం (యాక్ట్‌ 12/2021), తదనంతరం జారీ చేసిన జీవోను

Published : 20 Jan 2022 04:32 IST

పన్ను ఎగవేత కట్టడికే ఈ విధానం: హైకోర్టు

ఈనాడు, అమరావతి: సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయ నిర్ణయంలో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. పన్ను ఎగవేతను నియంత్రించేందుకే ఈ విధానమని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్‌ (సవరణ) చట్టం (యాక్ట్‌ 12/2021), తదనంతరం జారీ చేసిన జీవోను సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఫిల్మ్‌ టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు నోటీసులిచ్చింది. విచారణను 4వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్‌ వేశాక తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశించింది. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు వీలుగా తెచ్చిన సవరణ చట్టాన్ని, టికెట్ల విక్రయ ప్లాట్‌ఫాం నిర్వహణను ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)కు అప్పగిస్తూ డిసెంబరు17న జారీ చేసిన జీవో 142ను సవాలు చేస్తూ ‘మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ తరఫున మంజీత్‌సింగ్‌, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు వీలుగా చట్టంలో సెక్షన్‌ 5(ఏ)ను కొత్తగా చేరుస్తూ సవరించారని, దాన్ని సవాలు చేస్తున్నామని థియేటర్‌ యాజమాన్యాల తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే టికెట్లు విక్రయిస్తే గుత్తాధిపత్యానికి దారితీస్తుందని వివరించారు. ఈ నిర్ణయం థియేటర్ల యాజమాన్యాల ప్రాథమిక హక్కులను హరించడమేనని అన్నారు. చాలామందికి ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవడం తెలియదని వివరించారు. సినిమా చూడాలనుకుంటున్నవారికి ఎలా బుక్‌ చేసుకోవడమే కాదు.. ఆన్‌లైన్‌లో ఎలా చూడాలో తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంట్లో ప్రాథమిక హక్కులను హరించడం ఏముంటుందని ప్రశ్నించింది. ప్రభుత్వం కౌంటర్‌ వేశాక విచారిస్తామంటూ 4వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని