ఏకతాటిపైకి ఉద్యోగ సంఘాలు

పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదికగా ఉండగా... వీటితో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలు

Published : 21 Jan 2022 03:13 IST

పీఆర్సీ ఉత్తర్వులపై పోరాడాలని నిర్ణయం
సచివాలయంలో నాలుగు సంఘాల ప్రతినిధుల సమావేశం నేడు

ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదికగా ఉండగా... వీటితో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలు కలిశాయి. నాలుగు సంఘాల ప్రతినిధులు గురువారం విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. శుక్రవారం సచివాలయంలో సమావేశమై ఉద్యమ కార్యాచరణను నిర్ణయించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.


కలిసి పోరాడి ఒత్తిడి పెంచుతాం
-ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదికలో ఉద్యమంపై సంయుక్తంగా చర్చించాం. అన్ని సంఘాలు ఒకే తాటిపైకి రావాలనే నిర్ణయానికి వచ్చాం. కలిసి పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 21న సమ్మె నోటీసు ఇవ్వాలని ఏపీ ఐకాసలో నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగుల కోసం అందరం కలిసి పని చేయాలనే అభిప్రాయంతో నాలుగు సంఘాల నాయకులం ఒకే అంగీకారానికి వచ్చాం.


ప్రభుత్వ అనుమతి అవసరం లేదు
-ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

సచివాలయంలో శుక్రవారం నిర్వహించనున్న సమావేశానికి ప్రభుత్వం నుంచి అనుమతి అవసరం లేదు. డిమాండ్ల సాధనకు కోసమే పోరాడుతున్నాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఎప్పుడు ఇవ్వాలనే దానిపై సచివాలయంలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం.


ఇకపై అందరిదీ ఒకే డిమాండ్‌
-ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. ఉత్తర్వుల ప్రభావం ఉద్యోగులు, పింఛన్‌దారులపై జీతాలపై అయిదేళ్లపాటు ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు ఉవ్వెత్తున ఆందోళనకు దిగారు.


ఉమ్మడిగా ముందుకు వెళ్తాం
-సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

పీఆర్సీ అందరి సమస్య. అందుకే ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటివరకు సంఘాల సభ్యులు, సంఘ ప్రయోజనాల కోసం పనిచేశాం. పీఆర్సీతో ఉద్యోగులందరికీ నష్టం జరుగుతున్నందున ఒకే మాటగా మెరుగైన పీఆర్సీ సాధనకు పని చేయాలని నిర్ణయం తీసుకున్నాం.


‘సీఎంతో అయితేనే చర్చలకు వెళతాం’

‘పీఆర్సీ జీవోలపై నేరుగా ముఖ్యమంత్రితో అయితేనే చర్చలకు వెళతాం. అధికారులతో అంటే వెళ్లబోం. ఇప్పటివరకైతే చర్చలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ లేదు’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టంచేశారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణతో కలిసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. బయటికి వచ్చాక విలేకరులతో మాట్లాడుతూ...  ‘సీఎంఓలో ఎవరినీ కలవలేదు, మాకు సంబంధించిన ఫైల్‌ ఏదో ఉంటే దాని కోసం వెళ్లాం’ అని సూర్యనారాయణ చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పీఆర్సీపై పోరాడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని