అడుక్కునే వాళ్ల వద్దా అడుక్కుంటున్నారు..!

‘రోజంతా కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకునేవాడికి డబ్బు విలువ తెలుస్తుంది. ఒకేసారి రూ.10వేలు చెల్లించమని ఒత్తిడి తెస్తే పేదలు ఎలా కట్టగలరు? అడుక్కునేవాళ్ల వద్దా అడుక్కుంటున్నారు..’ అని

Updated : 21 Jan 2022 09:25 IST

ఓటీఎస్‌ కట్టాలని ఒత్తిడి తెచ్చిన సిబ్బందిపై వృద్ధ మహిళ ఆగ్రహం

రాజానగరం, సీతానగరం, న్యూస్‌టుడే: ‘రోజంతా కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకునేవాడికి డబ్బు విలువ తెలుస్తుంది. ఒకేసారి రూ.10వేలు చెల్లించమని ఒత్తిడి తెస్తే పేదలు ఎలా కట్టగలరు? అడుక్కునేవాళ్ల వద్దా అడుక్కుంటున్నారు..’ అని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడకు చెందిన వృద్ధురాలు మన్య సూర్యకాంతం సిబ్బందిపై మండిపడ్డారు. ఓటీఎస్‌లో భాగంగా రూ.10 వేలు కట్టించుకునేందుకు పంచాయతీ కార్యదర్శి శివ, వీఆర్వో నాగేశ్వరరావు, వాలంటీర్లు ఆమె ఇంటికి వెళ్లారు. డబ్బులు చెల్లించాలని వారు కోరగా వృద్ధురాలు ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘అమ్మఒడి, బాబుఒడి, అక్కఒడి అంటూ ప్రభుత్వం పేదల నోటికాడ కూడు తీసి వాళ్లకు డబ్బు ఇస్తోంద’ని మండిపడ్డారు. ‘15 ఏళ్ల కిందట కట్టుకున్న ఇంటికి ఇప్పుడు రూ.10 వేలు కట్టాలా? ఇలా డబ్బు ఇవ్వాలని అప్పుడు ఎవరూ చెప్పలేదు. ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతుంటే ఒకటికి పదిసార్లు తలుపు బాదేసి వీధిలోకి లాగడం మంచిది కాదు’ అని ఆమె వాపోయారు. ప్రభుత్వం రుణమిచ్చిందని, తిరిగి చెల్లించాలని, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అని సిబ్బంది అనడంతో.. ‘మీతోటే కాదు.. ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతా’ అని ఆమె సమాధానమిచ్చారు. ఇప్పటివరకు పది మంది డబ్బు కట్టారని, ఎప్పుడు కడతావో చెప్పని సిబ్బంది ప్రశ్నించగా.. ఆఖరున రండి.. అప్పుడు చూస్తానంటూ వృద్ధురాలు బదులిచ్చారు.


మూడు పూటలా వస్తాం

‘మీరు ఎలా కడతారో తెలియదు. మాకు 3రోజుల్లోగా డబ్బులు కట్టించుకునేలా లక్ష్యాలిచ్చారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా వస్తాం. కచ్చితంగా డబ్బు కట్టాల్సిందే’నని ఉద్యోగులు హుకుం జారీ చేస్తున్నారు. మీరు డబ్బులు కట్టకపోతే మాకు షోకాజ్‌లు, మెమోలు ఇస్తున్నారని వారు చెబుతున్నారు. రాజానగరం నియోజకవర్గంలో సిబ్బందికి వసూళ్ల లక్ష్యాలను నిర్దేశించారు. ఒక్కో మండలంలో కనీసం 200 మందికిపైగా లబ్ధిదారులనుంచి రూ.20లక్షల వరకు సొమ్ము సేకరించాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది అమ్మఒడి సొమ్ము వేయకపోవడంతో ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల పిల్లలకు ఫీజలు కట్టలేదని మిర్తిపాడుకు చెందిన గృహిణి నాగమణి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని