పేదలకు ప్రభుత్వం షాక్‌!

అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న పేదలకు... ఆ స్థలాల్ని క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం మరో ఓటీఎస్‌లా మార్చేసింది. 75 చదరపు గజాల వరకే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం...

Updated : 21 Jan 2022 09:20 IST

ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రూ.లక్షల్లో రుసుము
రెండు నెలల్లోపు కట్టకపోతే చర్యలు తప్పవని నోటీసులు
తీవ్ర ఆందోళనలో పేదలు
మండిపడుతున్న వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు  

ఈనాడు, అమరావతి: అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న పేదలకు... ఆ స్థలాల్ని క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం మరో ఓటీఎస్‌లా మార్చేసింది. 75 చదరపు గజాల వరకే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఒక్క చ.గజం అదనంగా ఉన్నా... మొత్తం స్థలానికి నిర్దేశిత ధర కట్టాల్సిందేనని డిమాండ్‌ నోటీసులు పంపుతోంది. అది నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.లక్షల్లో ఉండటంతో... పేద ప్రజలు ఖంగుతింటున్నారు. నోటీసు అందాక రెండు నెలల్లోగా మొత్తం రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించడం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతానికి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికే ఈ నోటీసులు వస్తున్నాయి. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి వాటిని క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 23న జారీ చేసిన జీవో నెం.225లోని నిబంధనలు పేదలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోని వారి ఇళ్లను అక్కడి నుంచి తొలగిస్తామని ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో సర్వే చేసి, ఆక్రమణలకు సంబంధించిన తుది జాబితా సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించింది. ప్రభుత్వ తీరు పేదలకు ద్రోహం చేసేదిగా ఉందని, 100 చదరపు గజాల వరకు ఒక రూపాయికే క్రమబద్ధీకరిస్తామంటూ ఇదే ప్రభుత్వం 2019లో జీవో జారీ చేసిందని, ఇప్పుడు దాన్ని తుంగలోతొక్కి 75 చ.గజాల వరకే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామనడం పేదల్ని వంచించడమేనని వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
మొత్తం స్థలానికి డబ్బు కట్టమంటే ఎలా?

అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న వారికి గత ప్రభుత్వ హయాంలోనూ స్థలాల్ని క్రమబద్ధీకరించారు. అప్పట్లో స్థలాల ధర నిర్ణయించేందుకు ‘టెలిస్కోపిక్‌’ విధానం అమలు చేశారు. 2017 ఆగస్టు 24న జారీ చేసిన జీవో ప్రకారం... దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాలకు 100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించే వారు. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న (ఏపీఎల్‌) కుటుంబాలకు 1-100 గజాల వరకు ఆ ప్రాంతంలోని స్థలాలకు రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన మూల విలువలో 7.5 శాతం ధర నిర్ణయించారు. 101 నుంచి 250 చ.గజాల వరకు బీపీఎల్‌, ఏపీఎల్‌ కుటుంబాలు రెండింటికీ స్థలం మూల విలువలో 15 శాతం ధర నిర్ణయించారు. అయితే... ఒక బీపీఎల్‌ కుటుంబం 125 చ.గజాల్లో ఇల్లు కట్టుకుంటే గనుక వారికి 100 చ.గజాల వరకు ఉచితమే. మిగతా 25 చ.గజాలకు మాత్రమే మూల విలువలో 15 శాతం కట్టాల్సి ఉంటుంది. అదే ఒక ఏపీఎల్‌ కుటుంబం 125 చ.గజాల్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే 100 చ.గజాల వరకు 7.5 శాతం చొప్పున, మిగతా 25 చ.గజాలకు 15 శాతం చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. దీన్నే టెలిస్కోపిక్‌ విధానం అంటారు. అప్పట్లో 500 చ.గజాల వరకు స్థలాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.

 వైకాపా అధికారంలోకి వచ్చాక పాత నిబంధనలను సవరిస్తూ 2019 నవంబరు 6న ఒక జీవో నెం.463 జారీ చేసింది. గరిష్ఠంగా 300 చ.గజాల వరకే క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేసింది.  బీపీఎల్‌ కుటుంబాలకు 100 చ.గజాల వరకు ఒక రూపాయికే చేస్తామని చెప్పింది. 100-300 చ.గజాల వరకు అక్కడి మార్కెట్‌ విలువను బట్టి జిల్లా కలెక్టర్‌ నిర్ణయించిన ధర చెల్లించాలని తెలిపింది. ఏపీఎల్‌ కుటుంబాలకు 300 చ.గజాల వరకు ఎంత విస్తీర్ణమైనా... మార్కెట్‌ విలువలో జిల్లా కలెక్టర్‌ నిర్ణయించిన ధర చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

2019లో తాను రూపొందించిన నిబంధనలనే పక్కనపెట్టి... 2021 ఆగస్టు 23న ప్రభుత్వం జీవో నెం.225 జారీ చేసింది. 100 చ.గజాల వరకు ఒక రూపాయికే క్రమబద్ధీకరిస్తామన్న ప్రభుత్వం... దాన్ని ఇప్పుడు 75 చ.గజాలకు కుదించేసింది. పైగా టెలిస్కోపిక్‌ విధానం ఉండదని స్పష్టం చేసింది. 75 చ.గజాల వరకు ఉన్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరించి, డి-ఫాం పట్టా ఇస్తామని చెప్పింది. అది కూడా ఆరంచెల పరిశీలనలో అర్హులుగా తేలిన వారికే ఉచితం. ఆ పరిధిలో లేకపోయినా, 75 గజాలు దాటినా... మొత్తం స్థలానికి మూల విలువలో 75 శాతం చెల్లించాలని నిబంధన పెట్టింది. 150 గజాల్లోపు ఆక్రమించుకున్న వారు మూల విలువలో 75 శాతం, 150 నుంచి 300 గజాల వరకు నూరు శాతం చెల్లించాలని తెలిపింది.

పూరి గుడిసెలు ఉంటే క్రమబద్ధీకరించరు..!

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోలో ఇళ్లు ఉన్నా, తాటాకు గుడిసెలు ఉన్నా క్రమబద్ధీకరిస్తామని చెప్పింది. ఈ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలో... ఇటుకలతో కట్టిన గోడలపై ఆర్‌సీసీ లేదా ఆస్బెస్టాస్‌ పైకప్పు ఉన్న ఇళ్లనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కేవలం స్థలాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో వేసిన పూరి గుడిసెలను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది.


గజం 1.29 లక్షల రూపాయలన్న మాట..!

పేదలకు క్రమబద్ధీకరించే స్థలం కనీస పరిమితిని 100 చ.గజాల నుంచి 75 చ.గజాలకు కుదించడంతో పాటు, ధర లెక్కించేందుకు టెలిస్కోపిక్‌ విధానాన్ని అనుసరించకపోవడం వల్ల పేదలపై పెనుభారం పడుతోంది. ఉదాహరణకు విజయవాడ సమీపంలోని ముత్యాలంపాడులో ఒక వ్యక్తి 88 చ.గజాల స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించమని 2021 అక్టోబరు 20న దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని క్రమబద్ధీకరించాలంటే రూ.16.83 లక్షలు చెల్లించాలని, అది కూడా ఓకే విడతలో ప్రభుత్వానికి కట్టాలని విజయవాడ ఉత్తర మండలం తహసీల్దారు కార్యాలయం నుంచి డిమాండ్‌ నోటీసు వచ్చింది. ఈ నోటీసు అందిన రెండు నెలల్లోగా డబ్బు కట్టకపోతే అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే టెలిస్కోపిక్‌ విధానం అమల్లో ఉంటే... అదే ఇంటి యజమాని 13 చ.గజాలకు మాత్రమే ధర చెల్లిస్తే సరిపోయేది. అంటే ఇప్పుడు అతను 13 చ.గజాలు ఎక్కువ ఉన్నందుకు ఒక్కో చ.గజానికి రూ.1.29 లక్షల చొప్పున కట్టాల్సి వస్తోందన్న మాట. అంత ధర విజయవాడ నగరం నడిబొడ్డున కూడా ఉండదు. పోనీ ఆ 16.83 లక్షల మొత్తాన్ని 88 గజాలకు లెక్క వేసినా... గజం ధర రూ.19,125 పడుతోంది. ఒక్క గజం స్థలం కూడా కొనుక్కునే స్థోమత లేకే కదా అతను ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు అతన్ని చ.గజానికి రూ.19,125 చొప్పున ప్రభుత్వం కట్టమంటే... పెనుభారం వేసినట్టే కదా? అని పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

75 చ.గజాలు దాటిన వారు స్థలాల్ని క్రమబద్ధీకరించుకోవాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మరీ అసాధారణంగా ఉన్నాయని, పేదలు అంత మొత్తం ఎలా చెల్లించగలరని పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.


పేదల్ని హింసించి... డబ్బు గుంజడమేంటి?

‘‘నిలువనీడలేని పేదలు కొంత ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలే తప్ప, దాన్ని కూడా ఒక ఆదాయమార్గంగా చూడటం దారుణం. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన భారీ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకోవడమంటే... పేదలు తాము కట్టుకున్న ఇంటినే భారీ మొత్తం చెల్లించి ప్రభుత్వం నుంచి కొనుక్కున్నట్టవుతుంది. అసలే పేదలు... వారిని రూ.లక్షల్లో డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తెస్తారు. ఇది పేదల సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం కాదు. వారిని హింసించే ప్రభుత్వం. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే వేరే మార్గాలు చూసుకోవాలే తప్ప పేదలను ఇబ్బంది పెట్టడం తగదు. ప్రభుత్వం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని, 150 చ.గజాల వరకు పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం.’’

-బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని