ట్రస్టుపై నియంత్రణ కోసమే నోటీసులు

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్‌ ట్రస్టును దేవాదాయ చట్ట ప్రకారం రిజిస్టర్‌ చేసుకోవాలంటూ ఈ నెల.....

Updated : 22 Jan 2022 05:35 IST

హైకోర్టులో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టు వాదనలు

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్‌ ట్రస్టును దేవాదాయ చట్ట ప్రకారం రిజిస్టర్‌ చేసుకోవాలంటూ ఈ నెల 5న ఇచ్చిన తాఖీదును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కౌంటరు దాఖలు చేయాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, తదితరులను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

పాల ఉత్పత్తిదారుల ప్రయోజనం కోసం ఆ ట్రస్టు

ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్‌ ట్రస్టును దేవాదాయ చట్ట ప్రకారం నమోదు చేసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్‌ ఈ నెల 5న ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ మేనేజింగ్‌ ట్రస్టీ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, మరో ఇద్దరు ట్రస్టీలు వి.బుద్దయ్య చౌదరి, టి.రామలింగేశ్వరరావు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, వి.వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం ట్రస్టును ఏర్పాటు చేశారన్నారు. అది దేవాదాయ చట్ట ప్రకారం ‘ఛారిటబుల్‌ సంస్థ’ అనే నిర్వచనం కిందకు రాదన్నారు. అందువల్ల దేవాదాయ చట్టం కింద ట్రస్టును రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ట్రస్టుపై నియంత్రణ కోసం ప్రభుత్వం ఈ నోటీసు ఇచ్చిందన్నారు. రిజిస్టర్‌ చేసుకుంటే ఈవోను నియమించి ప్రభుత్వ నిర్వహణలోని ట్రస్టుగా మార్చాలని చూస్తోందన్నారు. 15 రోజుల్లో రిజిస్టర్‌ చేసుకోకపోతే తామే దేవాదాయ చట్టం కింద రిజిస్టర్‌ చేసినట్లు భావిస్తామని నోటీసులో పేర్కొన్నారన్నారు. ఆ నోటీసు ఆధారంగా ముందుకెళ్లకుండా ఆదేశించాలని కోరారు.

అది ఛారిటబుల్‌ సంస్థే: ఏజీ

ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ట్రస్టు నిర్వహించే కార్యక్రమాలు దేవాదాయ చట్టంలోని ఛారిటబుల్‌ సంస్థల నిర్వచనం కిందికే వస్తాయన్నారు. ట్రస్టు కోట్ల రూపాయల విరాళాలు సేకరిస్తూ, ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందుతోందన్నారు. ఛారిటబుల్‌ సంస్థగా నమోదు చేసుకోవడానికి నిరాకరిస్తే పిటిషనర్‌ దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే వ్యవహారాన్ని తేల్చాలంటే ప్రభుత్వం దాఖలు చేసే కౌంటరును పరిశీలించాలంటూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని