సీఎంను తిడితే.. హెచ్‌ఆర్‌ఏ వచ్చేస్తుందా?

ఉద్యోగులు తమ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప, ముఖ్యమంత్రిని బూతులు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో ఫలితం ఉండదని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వ్యాఖ్యానించారు.

Published : 22 Jan 2022 04:35 IST

మంత్రి పేర్ని నాని

ఈనాడు, అమరావతి: ఉద్యోగులు తమ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప, ముఖ్యమంత్రిని బూతులు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో ఫలితం ఉండదని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వ్యాఖ్యానించారు. తెదేపా, భాజపాలు ఉద్యోగుల్ని ఎంత రెచ్చగొట్టినా ముఖ్యమంత్రి జగన్‌కు, ఉద్యోగులకు మధ్య తగాదా పెట్టలేవని స్పష్టం చేశారు. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెప్పుడు మాటలువిని, ముఖ్యమంత్రి గురించి అసభ్యంగా మాట్లాడటం సరికాదు. ఇవేనా పిల్లలకు ఉపాధ్యాయులు నేర్పే పాఠాలు?’ అని ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో కేబినెట్‌ నిర్ణయాలను విలేకరులకు వెల్లడించాక.. వారు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మా ప్రభుత్వం సంప్రదింపులకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతుంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల వల్లే ముఖ్యమంత్రి మానసికంగా ఎంతో నలిగిపోతూ ఆ నిర్ణయం తీసుకున్నారు?’ అని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు తమ జీతాలు తగ్గించుకోకుండా తమ వేతనాల్లో కోత పెట్టారని ఉద్యోగులు అంటున్నారు కదా? అన్న ప్రశ్నకు ‘బాగోలేనప్పుడు జగన్‌ అందరి జోలికీ వస్తారు’ అని మంత్రి బదులిచ్చారు.

జగన్‌, చిరంజీవి కుశలప్రశ్నలు వేసుకున్నారంతే!

సినిమా టిక్కెట్ల వ్యవహారంపై కేబినెట్‌లో చర్చ జరిగిందా? సీఎంతో సమావేశం సానుకూలంగా జరిగిందని అప్పట్లో చిరంజీవి చెప్పారు కదా? అన్న ప్రశ్నకు ‘సినిమా టిక్కెట్ల వ్యవహారం కేబినెట్‌ వరకు ఎందుకు? చిరంజీవి ఏదో భోజనానికి వచ్చారు. వారిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సంప్రదింపులు సచివాలయంలోనో జరుగుతాయిగానీ, ఇంట్లోనా? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వమా’ అని బదులిచ్చారు.

తెదేపా నేతలేమైనా యోగులా?

గుడివాడలో తెదేపా నేతలపై దాడి గురించి ప్రస్తావించగా ‘వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ నిరసన చెప్పడానికి చంద్రబాబు ఇంటి దగ్గరున్న కరకట్ట మీదకు వెళ్తేనే కారు అద్దాలు పగలగొట్టి పంపించారు. ప్రైవేటు ఆస్తిలోకి వెళ్తే అద్దాలు పగులుతాయని వాళ్ల చర్యల ద్వారా నిరూపించిన తెదేపా నేతలు.. ఇప్పుడు గుడివాడలో వేరే వాళ్ల ప్రాపర్టీలోకి ఎలా వెళ్తారు? అక్కడ తప్పు జరిగిందనుకుంటే ఎస్పీకి ఫిర్యాదు చేయాలి. అయినా నిజనిర్ధారణ చేయడానికి వాళ్లేమైనా హిమాలయాల నుంచి వచ్చిన యోగులా?’ అని నాని వ్యాఖ్యానించారు. గుడివాడలో తప్పు జరిగి ఉంటే జగన్‌ ఎవర్నీ ఉపేక్షించరని తెలిపారు. పోలీసులపైనే ఎఫ్‌ఐఆర్‌ కట్టి జైల్లో వేయడం, సొంతఎమ్మెల్యే అయినా తప్పుచేస్తే కేసు పెట్టడం గతంలో ఏ ప్రభుత్వంలోనైనా చూశారా? అని ప్రశ్నించారు. జడ్జిని కూడా జైల్లో పెట్టారు కదా? అని ఒక విలేకరి అడగ్గా.. ‘తప్పు చేస్తే జడ్జినైనా లోపలేస్తారు. ఏం.. మిమ్మల్ని వేయరా? సినిమా యాక్టర్లను ఆపుతారా? పార్టీ పెట్టుకుంటే మాత్రం, పార్టీ అధ్యక్షుడు తప్పు చేస్తే ఆపుతారా?’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని