కొవిడ్‌ టెస్టే ఒక పరీక్ష

రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పాజిటివిటీ రేటు 30 శాతానికి చేరువైంది. అయినా పరీక్షల సంఖ్య రోజుకు 45వేలు మించడం లేదు. కొవిడ్‌ రెండోదశలో రోజుకు లక్ష వరకు పరీక్షలు చేయగా..

Updated : 22 Jan 2022 06:04 IST

నమూనాల సేకరణకు పరిమితులు

బాధితులకు రోజుల తరబడి ఎదురుచూపులు 

ఈనాడు-అమరావతి, బృందం

రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పాజిటివిటీ రేటు 30 శాతానికి చేరువైంది. అయినా పరీక్షల సంఖ్య రోజుకు 45వేలు మించడం లేదు. కొవిడ్‌ రెండోదశలో రోజుకు లక్ష వరకు పరీక్షలు చేయగా.. ఇప్పుడు సగానికి తగ్గించేశారు. నిరీక్షణ భరించలేక పలు ప్రాంతాల్లో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తిరుపతి రుయా, మదనపల్లి ఆసుపత్రుల ఎదుట పలువురు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి నిరీక్షించినా పరీక్షలే చేయలేదని విజయవాడలోని పలు ప్రాంతాల నుంచి వచ్చినవారు మండిపడ్డారు. వేచిచూడలేక ప్రైవేటు పరీక్షా కేంద్రాలకు వెళ్తే అక్కడ ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారు.

నిరీక్షణ భరించలేక

చిత్తూరు జిల్లా తిరుపతిలోని రుయా ఆసుపత్రి కొవిడ్‌ పరీక్షా కేంద్రంలో శుక్రవారం ఉదయం తొలుత వచ్చిన 60 మందికే టోకెన్లు ఇచ్చి.. మిగిలినవారంతా శనివారం రావాలని పంపేశారు. టోకెన్లు ఇచ్చినవారిలోనూ కొందరి నుంచే శ్వాబ్‌ సేకరించారు. దీంతో మిగిలినవారు వైద్య, భద్రతాసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలిసిన కొవిడ్‌ పరీక్షా కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్‌ రోజారమణి వచ్చి బాధితులతో మాట్లాడి నమూనాలు సేకరించారు. రెండురోజుల నుంచి వస్తున్నా.. పరీక్ష చేయడంలేదని షామీర్‌ బాషా అనే ఉపాధ్యాయుడితో పాటు మరో 20మంది చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లాలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ పరీక్షలు చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కానీ.. శుక్రవారం విజయవాడలోని చాలా కేంద్రాల్లో అసలు పరీక్షలు నిర్వహించలేదు.

రెండ్రోజుల తర్వాత రండి

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన ఒక వ్యక్తి తన కుమారుడికి బాగా దగ్గు, జలుబు, జ్వరం ఉండటంతో పరీక్షలు చేయించేందుకు పోలవరం సీహెచ్‌సీకి వెళ్లగా రేపు రావాలని పంపేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో రోజుకు 5 పరీక్షలే చేస్తున్నారు. రెండ్రోజుల తర్వాతా కొవిడ్‌ లక్షణాలు తగ్గకపోతే పరీక్ష చేస్తామని విజయనగరం జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాజిటివిటీ రేటు 10 రోజుల్లో 7.5 నుంచి 37.5 శాతానికి చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ కేసుల తీవ్రత పెరుగుతోంది. గతంలో రోజుకు 4వేల పరీక్షలు చేస్తే.. ఇప్పుడు రోజుకు 2వేల నుంచి 2,500 వరకు పరీక్షలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని