పటిష్ఠ విచారణకే ప్రత్యేక కోర్టులు

మహిళలు, పిల్లలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నమోదైన కేసుల పటిష్ఠ విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సి వస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర పేర్కొన్నారు.

Published : 22 Jan 2022 04:40 IST

హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర

ఈనాడు, అమరావతి: మహిళలు, పిల్లలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నమోదైన కేసుల పటిష్ఠ విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సి వస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర పేర్కొన్నారు. అమాయకులైన వారికి శిక్ష పడకుండా.. తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద నమోదైన నేరాల కేసులను విచారించేందుకు మచిలీపట్నంలో పోక్సో ప్రత్యేక న్యాయస్థానాన్ని, మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలను విచారించేందుకు కడపలో మహిళా కోర్టు (ఏడో అదనపు జిల్లా కోర్టు)ను శుక్రవారం వర్చువల్‌ విధానంలో ఏపీ హైకోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర మీట నొక్కి ప్రారంభోత్సవం చేశారు. చిన్నారులపై, మహిళలపై జరిగేవి అత్యంత హేయమైన నేరాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేసుల విచారణకు సహకరించి పెండెన్సీ తగ్గించేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు. జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో పోక్సో, మహిళ కోర్టులు అవసరం లేని రోజులు రావాలని ఆకాంక్షించారు. జస్టిస్‌ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ ఈ ప్రత్యేక కోర్టుల్లో విచారణకు వచ్చే కేసులు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేందుకు సహకరించాలని చెప్పారు. జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా మాట్లాడుతూ పోక్సో కోర్టు ఏర్పాటు ఉద్దేశాన్ని నెరవేర్చేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అలాగే కృష్ణా, కడప జిల్లాకు చెందిన జడ్జీలు, పలువురు న్యాయాధికారులు, అధికారులు స్థానికంగా హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని