కొత్త జీతాలతో కోతలు తప్పవు!’

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త వేతన సవరణతో అనేక మంది ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న డబ్బులను భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రూ.లక్షకు పైగా కోల్పోనున్న అధికారులూ ఉన్నారు. సూపరింటెండెంట్‌ కేడర్‌లోని ఉద్యోగుల్లో

Published : 23 Jan 2022 03:24 IST

బకాయిలను వెనక్కిచ్చెయ్యాల్సిందే
భవిష్యత్తులో వచ్చే డీఏల నుంచి మినహాయింపు
కొందరు రూ.లక్ష వరకు చెల్లించాలి
లబోదిబోమంటున్న ఉద్యోగులు
హెచ్‌ఆర్‌ఏ మారనివారికి కొంతలబ్ధి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త వేతన సవరణతో అనేక మంది ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న డబ్బులను భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రూ.లక్షకు పైగా కోల్పోనున్న అధికారులూ ఉన్నారు. సూపరింటెండెంట్‌ కేడర్‌లోని ఉద్యోగుల్లో రూ.70 వేలకుపైగా బకాయి పడిన వారున్నారు. ఉపాధ్యాయుల్లో చాలామంది రూ.80 వేలకు పైగా వెనక్కివ్వాల్సి వస్తుంది. వీరందరి నుంచి భవిష్యత్తులో ప్రకటించనున్న కరవు భత్యం (డీఏ) బకాయిల రూపంలో ఆ మొత్తాలను వసూలు చేసుకుంటామని సర్కారు పక్కాగా ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)లో పెద్దగా మార్పు లేని ఉద్యోగులు బకాయిల రూపంలో కొంత మొత్తం అదనంగా ప్రభుత్వం నుంచి పొందుతారు.

జీవోలో సుస్పష్టంగా వివరణ

ప్రభుత్వం 11వ వేతన సవరణ సంఘం అమలుకు సంబంధించి ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తదితర అంశాలతోపాటు విధివిధానాలు ఎలా ఉంటాయో పేర్కొంటూ జనవరి 17న ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నంబరు ఒకటిలో పక్కాగా అన్ని వివరాలనూ పొందుపరిచింది. 2019 జులై నుంచి మూలవేతనంపై 27% మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇచ్చిన ప్రభుత్వం తాజా జీవోల్లో 2020 ఏప్రిల్‌ నుంచి మానిటరీ ప్రయోజనం కల్పిస్తామని, 2022 జనవరి జీతంతో కలిపి నగదు రూపంలో కొత్త వేతనాలు చెల్లిస్తామంది. కొత్త పీఆర్సీలో ఫిట్మెంట్‌ను 23శాతానికి తగ్గించింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులన్నీ మార్చేసింది. సీసీఏ(సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు) పూర్తిగా తొలగించింది. అది కొన్నిచోట్ల మాత్రమే అమలులో ఉంటుంది. వీటి ప్రకారం... ఇప్పటికే అదనంగా తీసుకున్న ఐఆర్‌ మొత్తాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని డీఏ బకాయిల నుంచి మినహాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అలా మినహాయించిన తర్వాత ఉద్యోగులకు ఇంకా అదనంగా చెల్లించాల్సి ఉంటే వాటిని నాలుగు వాయిదాల్లో జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామంది. ఒకవేళ ఉద్యోగులే ప్రభుత్వానికి బకాయి ఉంటే... ఆ మొత్తాన్ని భవిష్యత్తులో ఇచ్చే డీఏ బకాయిల నుంచి మినహాయించుకుంటామని స్పష్టం చేసింది. ఈ నెల 17న ఇచ్చిన జీవో నంబరు ఒకటిలోని 10వ పేజీలో 12.4 పాయింటులో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లెక్క ఎలా కట్టాలో కూడా అదే జీవోలో పట్టిక రూపంలో ఆర్థికశాఖ అధికారులు విశదీకరించారు.

ఈ ఉదాహరణలు చూడండి...

* తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఒక ప్రభుత్వ శాఖలో సూపరింటెండెంట్‌ కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగి తాజా వేతన సవరణతో రూ.72,252 ప్రభుత్వానికి వెనక్కి చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తాన్ని ఇప్పటికిప్పుడే జీతంలో కోత పెట్టి తీసుకోరు. భవిష్యత్తులో ఇచ్చే డీఏల నుంచి మినహాయించుకుంటారు. ఈ బకాయిని తీర్చాకే కొత్త డీఏలు పొందుతారు. ఈ ఉద్యోగి 2020 ఏప్రిల్‌ నుంచి (మూల వేతనం రూ.43,680) 2021 డిసెంబరు వరకు 27% ఐఆర్‌, పాత హెచ్‌ఆర్‌ఏ, సీసీఏల ప్రకారం పొందిన జీతం రూ.18,24,237గా లెక్క తేలింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త పేస్కేళ్లలో జీతాలను లెక్క కట్టాల్సి ఉంది. అప్పుడు ఆయన కొత్త మూల వేతనం రూ.67,190 అవుతుంది. నాటి నుంచి ఆయన పొందిన మొత్తం వేతనం రూ.17,31,384గా తేల్చారు. దీనికి డీఏ బకాయిలు రూ.20,601 కలిపారు. అంటే... కొత్త వేతన స్కేళ్ల ప్రకారం రూ.17,51,985 పొందాల్సి ఉండగా ఇప్పటికే రూ.18,24,237 డ్రా చేశారు. దీంతో ఆయన రూ.72,252 వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు ఎనిమిది కి.మీ. దూరంలో ఇన్నాళ్లూ 20% ఇంటి అద్దె భత్యంతో జీతం తీసుకున్న ఒక ఉపాధ్యాయుడు (స్కూల్‌ అసిస్టెంటు) రూ.51,905 వెనక్కి చెల్లించాల్సి వస్తోంది. ఈయన ఇప్పటికే రూ.19,18,795 డ్రా చేశారని... కొత్త స్కేళ్ల ప్రకారం ఆయనకు నికరంగా రావాల్సింది (డీఏ బకాయిలతో కలిపి) రూ.18,66,890గా లెక్క తేలుతోంది.

* ఒక జిల్లాలోని ముఖ్య పట్టణంలో జలవనరుల శాఖలో ఎస్‌ఈగా పనిచేస్తున్న అధికారి రమారమి రూ.1.10 లక్షలు తిరిగి చెల్లించాల్సి వస్తోంది.

* కృష్ణా జిల్లా నూజివీడులో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న ఉద్యోగి రూ.6,078 వెనక్కి కట్టాల్సి వస్తోంది. ఈయన ఇంతకాలం 14.5% హెచ్‌ఆర్‌ఏ తీసుకున్నారు. ఇప్పుడది 8 శాతానికి తగ్గిపోయింది. కొత్త వేతనం ప్రకారం రూ.12,42,032 పొందాల్సి ఉండగా ఇప్పటికే రూ.12,48,110 డ్రా చేశారు.

* కర్నూలులో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు రూ.60 వేలకు పైగా వెనక్కి చెల్లించాల్సి వస్తోంది.

* విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇంతకాలం 14.5% హెచ్‌ఆర్‌ఏ ఉన్న పట్టణంలో పనిచేసిన రికార్డు అసిస్టెంట్‌... తాజా వేతన  సవరణతో రూ.27,264 ప్రభుత్వానికి బాకీ పడ్డారు.


కొందరికి బకాయిలు రానున్నాయ్‌

ప్రభుత్వ జీవోలోని రెండు కేటగిరీల ప్రకారం పాత, కొత్త జీతాలు ఎలా లెక్క కట్టాలో వివరించి చూపింది.

* గతంలో 12% హెచ్‌ఆర్‌ఏ ఉండి తాజా వేతనాల్లో 8 శాతానికి మారిన ఉద్యోగి ఒకరు (పాత మూలవేతనం రూ.51,230- కొత్త మూలవేతనం రూ.78,820) ఇప్పుడు రూ.16,569 పొందనున్నారు. ఈ మొత్తాన్ని జీపీఎఫ్‌లో జమ చేస్తారు.

* గతంలో హెచ్‌ఆర్‌ఏ 20 శాతంగా ఉండి ఇప్పుడు 16 శాతంగా ఉన్న నగరాల్లో (పాత మూలవేతనం రూ.25,840- కొత్త మూలవేతనం రూ.39,800) ఉన్న ఉద్యోగి రూ.26,658 అదనంగా అందుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని