అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోండి

పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి సహకరిస్తూ.. పక్షపాతంగా వ్యవహరిస్తోందని తెదేపా నాయకులు ఆరోపించారు. గుడివాడ ఘటనపై తాము వినతిపత్రం, ఫిర్యాదు చేసేందుకు ఏలూరులో డీఐజీని కలిసేందుకు వెళ్లగా

Published : 23 Jan 2022 03:54 IST

గుడివాడ ఘటనపై డీఐజీ, కృష్ణా కలెక్టర్‌లకు తెదేపా ఫిర్యాదు
ఈనాడు - అమరావతి, ఈనాడు

డిజిటల్‌ - ఏలూరు: పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి సహకరిస్తూ.. పక్షపాతంగా వ్యవహరిస్తోందని తెదేపా నాయకులు ఆరోపించారు. గుడివాడ ఘటనపై తాము వినతిపత్రం, ఫిర్యాదు చేసేందుకు ఏలూరులో డీఐజీని కలిసేందుకు వెళ్లగా ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లడం బాధాకరమని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విచారం వ్యక్తం చేశారు. గుడివాడ ఘటనపై డీఐజీకి వినతిపత్రం ఇవ్వాలని తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలు భావించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో అందించారు. అనంతరం కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం విజయవాడలో కృష్ణాజిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ను కలిసి వినతిపత్రం అందించారు.  

వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లిన తమపై దాడి చేయించారని, హత్యా ప్రయత్నం చేశారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని కలెక్టర్‌కు వివరించారు.

వైకాపా కార్యకర్తలకు సహకారం: వర్ల

పోలీసులు వైకాపా కార్యకర్తలకు సహకరించారని వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గుడివాడలో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. తమను గృహనిర్బంధం చేయాలని కోరినట్లు డీఐజీ చెప్పడం దారుణమన్నారు.

కొడాలి నాని సవాలును స్వీకరిస్తున్నాం

గుడివాడలో క్యాసినో జరిగిందని నిరూపించమని మంత్రి కొడాలి నాని చేసిన సవాలును తాము స్వీకరిస్తున్నామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. నిరూపిస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని, రాజీనామా చేస్తానన్న కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

ఇప్పటికైనా అనుమతించాలి

ఇప్పటికైనా తెదేపా నిజనిర్ధారణ కమిటీ గుడివాడలోని కె-కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలించేందుకు అనుమతించాలని తెదేపా నేతలు డిమాండు చేశారు. తాము పరిశీలించేందుకు అనువైన వాతావరణం కల్పించాలని డీఐజీ, కృష్ణా జిల్లా కలెక్టర్లకు  ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.

సీఎంకు చీమకుట్టినట్లయినా లేదు

గుడివాడలో క్యాసినో సంస్కృతిపై రాష్ట్రమంతా గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లయినా లేదని తెదేపా నేతలు మండిపడ్డారు.  మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కొల్లు రవీంద్ర, తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు శనివారం ఏలూరు రేంజి డీఐజీ మోహనరావును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని