సీఎం సహకారంతోనే గుడివాడలో క్యాసినో

మంత్రి పదవిలో ఉన్న కొడాలి నాని బహిరంగంగా క్యాసినో, జూదం నిర్వహించి, అశ్లీలనృత్యాలు చేయిస్తే... సీఎం జగన్‌ ఆయనను ఎందుకు బర్తరఫ్‌ చేయడం లేదని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.

Published : 23 Jan 2022 03:54 IST

కొడాలి నానిపై సీఎం చర్యలు తీసుకోకపోవడమే నిదర్శనం
తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజం
ఆధారాలివిగో అంటూ ఫొటోలు, వీడియోల విడుదల

ఈనాడు, అమరావతి: మంత్రి పదవిలో ఉన్న కొడాలి నాని బహిరంగంగా క్యాసినో, జూదం నిర్వహించి, అశ్లీలనృత్యాలు చేయిస్తే... సీఎం జగన్‌ ఆయనను ఎందుకు బర్తరఫ్‌ చేయడం లేదని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మౌనం చూస్తుంటే ఆయన సహకారంతోనే ఇదంతా జరిగినట్లు అర్థమవుతోందని ధ్వజమెత్తారు.

‘ప్రభుత్వమద్దతు లేకుండా అలాంటి అరాచకాలు చేయలేరు. ముఖ్యమంత్రి, డీజీపీల సహకారం ఉంది కాబట్టే అవన్నీ జరుగుతున్నాయి. క్యాసినో నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటేనే వారి సహకారం ఉందని స్పష్టమవుతోంది’ అని ఆయన శనివారం తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రం ఇప్పటికే బిహార్‌ కంటే ఘోరంగా తయారైంది. ఇప్పుడు జూదాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు. ఇన్నాళ్లూ మూడు రాజధానులే అంటున్నారు.. ఇప్పుడు గుడివాడను జూద రాజధానిగా చేస్తూ, రాష్ట్రానికి నాలుగో రాజధాని కూడా తెచ్చారని కొందరు వైకాపా నాయకులే చెబుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పేకాట క్లబ్‌లు, గ్యాంబ్లింగ్‌ ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జగన్‌ చెప్పిన మాటల వీడియోను నరేంద్ర ప్రదర్శించారు. ‘అప్పుడేమో ముఖ్యమంత్రి చాలా అమాయకంగా నో క్లబ్స్‌, నో గ్యాంబ్లింగ్‌ అని చెప్పారు. ఇప్పుడు తన కేబినెట్‌ సహచరుడే క్యాసినో నిర్వహిస్తే చర్యలు తీసుకోవడం లేదు’ అని ధ్వజమెత్తారు.

నానీ... పెట్రోలు ఎప్పుడు పోసుకుంటారు?

గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన లేఅవుట్‌లో, ఆయనకు చెందిన కె-కన్వెన్షన్‌ సెంటర్‌ స్థలంలోనే మూడు రోజులపాటు బహిరంగంగా క్యాసినో, మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారనడానికి అన్ని ఆధారాలూ బయట పెడుతున్నామని... ఎప్పుడు పెట్రోలు పోసుకుని, ఆత్మహత్య చేసుకుంటారో, ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారో మంత్రే ముహూర్తం నిర్ణయించుకోవాలని నరేంద్ర సవాలు చేశారు. దీనిపై కొన్ని ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారు. గుడివాడలో మూడు రోజులపాటు క్యాసినో నిర్వహిస్తున్నట్టు ముంబయికి చెందిన  ఏసెస్‌ క్యాసినో తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రచారం చేసిందని, దాని నిర్వాహకుడు ప్రేమల్‌ టోపీవాలా తాను గుడివాడలో ఉన్నట్టు ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారని నరేంద్ర తెలిపారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై కులాల గురించి మాట్లాడారంటూ దేశద్రోహం కేసు పెట్టారని, మరి కులవిద్వేషాలు రెచ్చగొడుతున్న మంత్రి నానిపై ఎందుకు కేసు పెట్టరని ఆయన నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని