రివర్స్‌ పీఆర్సీ.. ఉద్యోగులకు అవమానం

‘వైకాపా హయాంలో రాజధానిని ముక్కలు చేశారు. డీఏలు ముక్కలు చేసి ఇస్తున్నారు. పాఠశాలలనూ ముక్కలు చేస్తున్నారు. ఇంకా ఏమేం ముక్కలు చేస్తారో’నంటూ

Published : 24 Jan 2022 03:36 IST

యూటీఎఫ్‌ రాష్ట్ర మహాసభల్లో ఎమ్మెల్సీల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ‘వైకాపా హయాంలో రాజధానిని ముక్కలు చేశారు. డీఏలు ముక్కలు చేసి ఇస్తున్నారు. పాఠశాలలనూ ముక్కలు చేస్తున్నారు. ఇంకా ఏమేం ముక్కలు చేస్తారో’నంటూ ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న యూటీఎఫ్‌ 16వ రాష్ట్ర మహాసభల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ రద్దుపై పాదయాత్ర సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీ మూడేళ్లుగా అమలు చేయకపోగా, రివర్స్‌ పీఆర్‌సీ తెచ్చి ప్రభుత్వం ఉద్యోగులను అవమానిస్తోందని మండిపడ్డారు. సీపీఎస్‌పై ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సీపీఎస్‌, కొత్త పీఆర్‌సీ, డీఏల అంశాలపై శాసనమండలిలో చర్చకు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగుల భాషతీరుపై ఇటీవల ఓ మంత్రి మాట్లాడారని, ఆయనే మూడేళ్ల క్రితం తమ నాయకుడు జైలుకు వెళ్లేందుకు అర్హుడంటూ ప్రకటించారని గుర్తుచేశారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ప్రసంగిస్తూ పీఆర్‌సీ వల్ల రూ.10,147 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోందని, అంతలా జీతాలు పెంచితే ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్షల్లో ఎందుకు మినహాయించుకుంటున్నారని ప్రశ్నించారు. ఉద్యోగిగా పనిచేసిన తన నుంచే సుమారు రూ.2.5 లక్షలు మినహాయించినట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వంపై 13 లక్షల ఉద్యోగ కుటుంబాల అసంతృప్తి రాజకీయ పోరాటంగా మారకముందే మేల్కోవాలని హెచ్చరించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని