‘భూ కొనుగోలు పథకం’ స్థలాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయ్‌?

‘భూమి కొనుగోలు పథకం’ కింద జీవనోపాధి కోసం 1983 నుంచి వివిధ ప్రభుత్వాలు ఎస్సీ మహిళల పేరిట ఇచ్చిన వ్యవసాయ భూములను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తనిఖీ

Published : 24 Jan 2022 03:36 IST

లబ్ధిదారులపై ఆరా

తనఖా రిజిస్ట్రేషన్‌ విడుదలకు చర్యలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘భూమి కొనుగోలు పథకం’ కింద జీవనోపాధి కోసం 1983 నుంచి వివిధ ప్రభుత్వాలు ఎస్సీ మహిళల పేరిట ఇచ్చిన వ్యవసాయ భూములను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తనిఖీ చేయిస్తోంది. నిబంధనల ప్రకారం ఈ భూముల క్రయవిక్రయాలకు వీల్లేదు. ప్రస్తుతం ఇవి ఎవరి అనుభవంలో ఉన్నాయి? అసలు లబ్ధిదారులు/ వారసులే సాగు చేసుకుంటున్నారా? లేదా? అని ఆరా తీస్తోంది. గతంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ ఉత్తర్వులను తెరమీదకు తెచ్చి అసలు, వడ్డీ కలిపి లక్ష రుణంగా ఉన్న వారి భూముల తనఖా రిజిస్ట్రేషన్‌ (మార్టిగేజ్‌)ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా భూముల ప్రస్తుత పరిస్థితిపై క్షేత్రస్థాయిలో విచారిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రూ.లక్షకుపైగా రుణం ఉన్న లబ్ధిదారులు, చేతులు మారిన భూముల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. తాజాగా ఆదివారం ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ హర్షవర్ధన్‌ ఒంగోలులో ప్రకాశం జిల్లా అధికారులతో ఇదే అంశంపై సమీక్షించారు. మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఛైర్మన్లు కొమ్మూరి కనకారావు, మధుసూదన్‌ హాజరయ్యారు. రూ.లక్షలోపు రుణం మాఫీ జీవోను జిల్లాలో 3,759 మంది లబ్ధిదారులకు వర్తింపజేయవచ్చని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ వారి దృష్టికి తెచ్చారు.

15 వేల ఎకరాలు గుర్తింపు

ఈ పథకం కింద ఎస్సీలకు సుమారు 15,500 ఎకరాలు ఇచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 688 ఎకరాలు, విజయనగరంలో 402, విశాఖపట్నం 187, తూర్పు గోదావరి 219, పశ్చిమగోదావరి 170, కృష్ణా 93, గుంటూరు 191, ప్రకాశం 3,502, నెల్లూరు 447, చిత్తూరు 1,016, కర్నూలు 2,439, కడప 2,103, అనంతపురం జిల్లాలో 4,493 ఎకరాల చొప్పున తనఖాలో ఉన్నట్లు లెక్కతేల్చారు. 20-30 ఏళ్ల క్రితం పల్లెల్లో ఉన్న కొన్ని భూములు ఇప్పుడు పట్టణాల పరిధిలోకి వచ్చాయి. వాటి విలువ కోట్లలోకి చేరింది. మార్టిగేజ్‌ నుంచి ఈ భూముల్ని విడుదల చేసే ముందు అవి ఎస్సీల ఆధీనంలోనే ఉన్నాయా? వాటి సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయా? లేదా? అని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు. నిషేధిత జాబితాలో లేనిపక్షంలో దస్త్రాల్లోకి చేర్చిన తర్వాతే     మార్టిగేజ్‌ నుంచి విడుదల చేయాలని ఆదేశాలు అందాయి. కొందరు ఈ భూములను ఇతరులకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇకపై లబ్ధిదారులకు ఇచ్చే హక్కు పత్రాల్లో ‘భూమిని అమ్మడానికి వీలు లేదు’ అనే స్టాంప్‌ను ముద్రించాలని తాజాగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని