తెదేపా శ్రేణులపై లాఠీఛార్జి

గుంటూరు జిల్లా అమరావతిలో ఆదివారం అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత తలెత్తింది. ఈనెల 18న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా

Published : 24 Jan 2022 03:36 IST

వైకాపా నేతల సవాలుపై చర్చకు వెళుతుండగా నిలువరించిన పోలీసులు

పెదకూరపాడు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా అమరావతిలో ఆదివారం అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత తలెత్తింది. ఈనెల 18న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా పెదకూరపాడు మండలం గారపాడు, హుస్సేన్‌నగరం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయా సమావేశాల్లో ఆయన విమర్శించారు. ఈ ఆరోపణలపై వైకాపాకు చెందిన అమరావతి మండలాధ్యక్షుడు మేకల హనుమంతరావు స్పందించారు. తెదేపా హయాంలో ఇసుక, మట్టి, సహజ వనరులను దోచుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని.. దీనిపై లేమల్లెలో మైనింగ్‌ జరిగిన ప్రదేశంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు షేక్‌ జానీ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లేందుకు తెదేపా శ్రేణులు సిద్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అమరావతి పోలీసులు తెదేపా, వైకాపా నేతలు పలువురిని గృహనిర్బంధం చేశారు. మండలాధ్యక్షుడు హనుమంతరావు ఆధ్వర్యంలో లేమల్లె గ్రామానికి కొందరు వైకాపా కార్యకర్తలు వెళ్తున్నారన్న సమాచారం మేరకు తెదేపా శ్రేణులు కూడా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. తెదేపావారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతోపాటు లాఠీఛార్జి చేశారు. వారిని వాహనాల్లో ఎక్కించి అమరావతి పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుస్టేషన్‌ ముందు బైఠాయించిన తెదేపాకు చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు షేక్‌జానీ విలేకరులతో మాట్లాడారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అందుబాటులో ఇసుక ఉన్నా ట్రక్కు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆక్షేపించారు. ఇసుక, మట్టి మాఫియాపై చర్చకు ఆహ్వానించిన అధికార పార్టీ నాయకులు పోలీసులతో కుమ్మక్కై అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పోలీసులు అడుగడుగునా ఏకపక్షంగా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ఓప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీ చేసిన ఆరోపణలపై బదులిచ్చేందుకు బయలుదేరిన తమ పార్టీ మండల అధ్యక్షుడు మల్లాది విష్ణును గృహనిర్బంధం చేయడం, మైనారిటీ నాయకుడు షేక్‌ జానీతోపాటు శ్రేణులపై లాఠీఛార్జి దుర్మార్గమని ప్రకటనలో విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని