బాబ్బాబూ.. టెండర్లు వేయండి!

పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరతంటూ నిత్యం గగ్గోలు పెడుతున్న పుర, నగరపాలక సంస్థలు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం రెండు విడతలుగా కేటాయించిన

Published : 25 Jan 2022 02:50 IST

15వ ఆర్థిక సంఘం పనుల కోసం గుత్తేదారులకు అధికారుల వినతి
రెండేళ్లవుతున్నా అత్యధిక ప్రాంతాల్లో మొదలవని పనులు
పాత బిల్లుల పెండింగే కారణం
పుర, నగరపాలికల ఖాతాల్లో మూలుగుతున్న రూ.1,264 కోట్లు
ఈనాడు - అమరావతి

పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరతంటూ నిత్యం గగ్గోలు పెడుతున్న పుర, నగరపాలక సంస్థలు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం రెండు విడతలుగా కేటాయించిన రూ.1,264 కోట్లు జమయి దాదాపు రెండేళ్లవుతున్నా ఇంకా ఖర్చు చేయలేదు. 2,3 సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు రావడం లేదని అధికారులు అంటున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తయిన పనులకు రూ.350 కోట్లకుపైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి. వీటిని చెల్లించాలని గుత్తేదారులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 15వ ఆర్థిక సంఘం పనులకు గుత్తేదారులు టెండర్లు వేయట్లేదు.

75% పనులకు టెండర్లు వేయలేదు
రాష్ట్రంలో పది లక్షలకు మించి జనాభా ఉన్న విశాఖపట్నం, విజయవాడ నగరపాలక సంస్థలకు 2020-21 సంవత్సరానికి రెండు విడతలుగా రూ.270 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. మిగిలిన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు మరో రూ.994 కోట్లను కేంద్రం అందించింది. వీటితో పట్టణాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు ప్రారంభించి ఈపాటికే పూర్తి చేయాలి. ప్రతిపాదిత పనుల్లో 75 శాతానికి గుత్తేదారులు టెండర్లు వేయలేదు. కొన్ని నగరపాలక సంస్థల్లో ఉన్నతాధికారులు గుత్తేదారులను బుజ్జిగించి టెండర్లు వేయించినా పనులు ప్రారంభం కాలేదు. విజయవాడ నగరంలో రూ.66 కోట్లతో 55 పనులు ప్రతిపాదించారు. వీటిలో గతేడాది వ్యవధిలో 12 పనులకు టెండర్లు ఖరారు చేశారు. మిగతా పనులకు మూడోసారి మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో రూ.7.50 కోట్ల పనుల్లో కొన్నింటికి మూడోసారి టెండర్లు పిలిచినా గుత్తేదారుల స్పందన లేదు.

ఆచరణకు నోచని మంత్రి ప్రకటనలు
సీఎఫ్‌ఎంఎస్‌తో సంబంధం లేకుండా పుర, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో చేయించిన పనులకు స్థానికంగా అధికారులు బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే అనేకసార్లు ప్రకటించారు. నిధుల వ్యయం నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఇతర ప్రభుత్వ శాఖల జోక్యం లేకుండా చూస్తామన్న ఆయన హామీలు ఆచరణకు నోచుకోలేదు. 14వ ఆర్థిక సంఘం నిధుల పనులకు సంబంధించిన బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో ఏడాదిన్నరగా పెండింగులో ఉన్నాయి. ఆ బిల్లుల చెల్లింపు మాటేమిటని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఒకరు వాపోయారు.

చివర్లో తడిసిమోపెడు
ఐదేళ్లపాటు వరుసగా కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులన్నీ కలిపి చివరి ఏడాదిలో వెచ్చించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఏ ఏడాదిలో విడుదలైన నిధులు అదే ఏడాది ముగిసేలోగా వెచ్చిస్తే ఇబ్బంది ఉండదు. లేదంటే చివరి ఏడాదిలో పనులు తడిసి మోపెడై ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ఇప్పటికీ దాదాపు రూ.వేయి కోట్లు ఖర్చు కాలేదు. 2022 మార్చిలోగా వీటిని వినియోగించుకోనట్లయితే కేంద్రం వెనక్కి తీసుకోనుంది. నిధులు సకాలంలో ఖర్చు చేయకపోవడం, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించనందున ఈ పరిస్థితి వచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చు విషయంలోనూ నిర్దుష్ట కార్యాచరణతో ముందుకెళ్లాల్సి ఉందని పురపాలక కమిషనర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని