ఎర్రమట్టి.. కొల్లగొట్టి!

నెల్లూరు జిల్లా కావలి, కోవూరు నియోజకవర్గాల్లో ఎర్రమట్టి మాఫియా మళ్లీ విజృంభించింది. ఇటీవలి వరకు ఈ ప్రాంతంలో కొండలు, గుట్టలను కరిగించిన మైనింగ్‌ వ్యాపారులు, తాజాగా రైతుల పొలాలపై పడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ భూముల్లోంచి మట్టి తరలించుకునేందుకు రైతులకు

Published : 25 Jan 2022 03:08 IST

అనుమతుల్లేకుండా రాత్రివేళ తవ్వకాలు, రవాణా
కోవూరు, కావలి నియోజకవర్గాల్లో మైనింగ్‌ దందా
అధికార పార్టీ నేతల అండతో అక్రమాలు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి, కోవూరు నియోజకవర్గాల్లో ఎర్రమట్టి మాఫియా మళ్లీ విజృంభించింది. ఇటీవలి వరకు ఈ ప్రాంతంలో కొండలు, గుట్టలను కరిగించిన మైనింగ్‌ వ్యాపారులు, తాజాగా రైతుల పొలాలపై పడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ భూముల్లోంచి మట్టి తరలించుకునేందుకు రైతులకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెప్పి ఏకంగా 15-20 అడుగుల లోతు తవ్వుతున్నారు. భూమి ఆకృతే దెబ్బతీస్తున్న మైనింగ్‌ మాఫియా ఆగడాలు తెలిసినా, అధికార పార్టీ అండ ఉందన్న కారణంగా అధికారులు చర్యలకు జంకుతున్నారు. కావలి నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధికి సన్నిహితుడైన వ్యక్తి మైనింగ్‌ దందా నిర్వహిస్తున్నారు. రుద్రకోట, బోగోలు, దగదర్తి, కావలి, అల్లూరు మండలాల్లో ఎక్కడ ఎర్రమట్టి కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. కోవూరు నియోజకవర్గంలోని నార్త్‌ ఆములూరు, బట్రకాగొల్లు, తలమంచి రెవెన్యూ, కొడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో మరో నాయకుడు తవ్వకాలు సాగిస్తున్నారు. గతంలో నిర్మాణ పనులు కాంట్రాక్టు తీసుకుని అక్కడి అవసరాలకు మట్టి తరలించేవారు. ప్రస్తుతం పొలాల్లోంచి తవ్వితీసిన మట్టిని టిప్పరు లోడు రూ.500-700 వరకు విక్రయిస్తున్నారు. దూరప్రాంతాల్లో ఇళ్ల లేఅవుట్లు, ఇతర నిర్మాణ పనులకు తరలిస్తున్నారు.

ప్రైవేటు సైన్యం పహారా
మైనింగ్‌ ప్రాంతం నుంచి టిప్పర్ల రాకపోకలకు వీలుగా ఏకంగా మట్టి రోడ్డు వేసుకున్నారు. జనసంచారం లేని రాత్రివేళల్లో భారీ యంత్రాలతో లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు. పొలాలన్నీ చెరువులను తలపిస్తూ ప్రమాదకరంగా మారాయి. ఈ అక్రమాలను ఎవరూ ప్రశ్నించకుండా, మీడియా దరిదాపుల్లోకి రాకుండా వ్యాపారుల మనుషులు రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. ఎవరు కొత్తగా వచ్చినా వారి ఫొటోలు తీసి క్వారీ నిర్వాహకులకు పంపిస్తున్నారు. నాలుగు పొక్లైయిన్లతో రోజుకు సుమారు 400 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నట్లు అంచనా. వ్యాపారులు నెలకు సుమారు రూ.60 లక్షల వరకు ఆర్జిస్తున్నారు.

గ్రావెల్‌ క్యూబిక్‌ మీటరుకు ప్రభుత్వానికి రూ.105.30 రాయల్టీ చెల్లించాల్సి ఉన్నా అనుమతులు లేని మైనింగ్‌ కావడంతో నయాపైసా రావడం లేదు. ఈ అక్రమాలపై మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు, రవాణా అధికారుల నిర్లిప్తత ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపై నెల్లూరు గనులశాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసరావును ‘ఈనాడు’ ప్రశ్నించగా, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. ‘పొలాల్లో మట్టి తోడాలన్నా నిబంధనల ప్రకారం రాయల్టీ చెల్లించాలి. పరిమితి వరకే తవ్వుకోవాలి. ఎక్కడైనా అక్రమంగా తవ్వుతున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని