ఉచిత హామీలు ఆందోళనకరమే!

ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలూ పోటీపడుతూ ఉచిత హామీలు ఇస్తున్నాయి. నిస్సందేహంగా ఇది తీవ్రమైన సమస్యే. అయితే, దీనిని నియంత్రించడం ఎలా? ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానాన్ని సృష్టిస్తోంది.

Published : 26 Jan 2022 03:05 IST

వాగ్దానాల బడ్జెట్‌ అసలు బడ్జెట్‌ను మించిపోతోంది

ఈ అంశంలో పార్టీలను నియంత్రించడం ఎలా?

కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలూ పోటీపడుతూ ఉచిత హామీలు ఇస్తున్నాయి. నిస్సందేహంగా ఇది తీవ్రమైన సమస్యే. అయితే, దీనిని నియంత్రించడం ఎలా? ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానాన్ని సృష్టిస్తోంది. ఈ అంశంలో న్యాయస్థానం పరిధి పరిమితమే. కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని గతంలోనే ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

దిల్లీ: ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలుచేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అటువంటి రాజకీయ పక్షాల ఎన్నికల గుర్తును నిలిపివేయాలని, ఆ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ధర్మాసనంలో జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీ సభ్యులుగా ఉన్నారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉచిత హామీల బడ్జెట్‌ సాధారణ బడ్జెట్ను మించిపోతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పు తర్వాత ఉచిత హామీల అంశంపై ఎన్నికల సంఘం ఒకే ఒక సమావేశం నిర్వహించిందని, మార్గదర్శకాలు రూపొందించినా వాటిలో పస లేదని పిటిషనర్‌ అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ తరఫు న్యాయవాది వికాస్‌ సింగ్‌ తెలిపారు. ‘అధికారాన్ని నిలుపుకొనేందుకు ఎన్నికల ముందు ప్రజాధనంతో అనుచిత ఉచిత హామీలను అమలుచేసేందుకు యత్నించే పార్టీల గుర్తింపును రద్దు చేయడం, లేదా ఎన్నికల గుర్తులను నిలిపివేయడం, అవసరమైతే ఈ రెండు చర్యలు కలిపి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘కొంత సమయం వేచి చూద్దాం. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తున్నాం’ అని తెలిపింది. ఎన్నికల్లో పోటీపడి హామీలిస్తున్న రాజకీయ పార్టీలను కూడా ఈ వ్యాజ్యంలో కక్షిదారులుగా చేర్చాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పార్టీలు నిర్హేతుక ఉచిత హామీలను ఇస్తున్నప్పుడు అఫిడవిట్‌లో కొన్ని పార్టీలు, కొన్ని రాష్ట్రాల పేర్లను మాత్రమే ప్రస్తావించడంపై అనుమానం వ్యక్తం చేసింది. అయితే, పిటిషనర్‌ లేవనెత్తాలనుకున్న విషయం తీవ్రమైనది కాబట్టి కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

పిటిషన్‌లో ఏముంది?

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ వేర్వేరు రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ భాజపా నేత, న్యాయవాది అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ...18ఏళ్ల వయసు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామంటే.. ప్రతి మహిళకు రూ.2వేలు ఇవ్వనున్నట్లు శిరోమణి అకాలీదళ్‌ వాగ్దానం చేసిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో గృహిణికి నెలకు రూ.2 వేలు, ఏడాదికి 8 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కళాశాలకు వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటీ, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.20 వేలు, 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత రూ.15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ కోసం ప్రత్యేకంగా.. 12వ తరగతి చదివే అమ్మాయిలకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు అందజేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీలు గుప్పించిందని వివరించారు. డబ్బు పంపిణీ, ఉచిత వాగ్దానాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని పిటిషనర్‌ ఆందోళనవ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచిత, నిర్హేతుక వాగ్దానాలు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన అని, మితిమీరిన ప్రభావానికి గురి చేయడమేనంటూ ప్రకటించాలని అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ కోరారు. ఒక్కో పౌరుడిపై సుమారు రూ.3 లక్షలు రుణ భారం ఉన్నరాష్ట్రాలూ ఉన్నాయని.. అయినప్పటికీ.. ఇంకా ఉచితాలను అందిస్తున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని