Padma Awards:విరిసిన తెలుగు పద్మాలు

వ్యవసాయశాస్త్ర పట్టభద్రుడు అమెరికా వెళ్లి మాలిక్యులార్‌ బయాలజీలో పరిశోధనలు చేస్తారని, స్వదేశానికి తిరిగి వచ్చి కరోనా మహమ్మారిని అదుపు చేసే టీకా ఆవిష్కరిస్తారని, భారత్‌ను అగ్రదేశాలతో సమాన స్థాయిలో నిలుపుతారని ఎవరూ ఊహించి

Updated : 26 Jan 2022 04:30 IST

టీకాల ఆవిష్కరణలో తోడూ నీడగా..

- డాక్టర్‌ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల ఘనత

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయశాస్త్ర పట్టభద్రుడు అమెరికా వెళ్లి మాలిక్యులార్‌ బయాలజీలో పరిశోధనలు చేస్తారని, స్వదేశానికి తిరిగి వచ్చి కరోనా మహమ్మారిని అదుపు చేసే టీకా ఆవిష్కరిస్తారని, భారత్‌ను అగ్రదేశాలతో సమాన స్థాయిలో నిలుపుతారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, అటువంటి అద్భుతాన్ని సుసాధ్యం చేసిన ఘనత భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లకు దక్కుతుంది. భార్య సుచిత్ర ఎల్లతో కలిసి పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా స్థాపించిన భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ టీకా ...ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో పాటు ఎన్నో దేశాల్లో గుర్తింపు సంపాదించింది. మనదేశం నుంచి వచ్చిన పూర్తి స్వదేశీ టీకా కూడా ఇదే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు టీకా ఆవిష్కరించిన ఫార్మా/బయోటెక్‌ కంపెనీలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. అటువంటి కొద్ది కంపెనీల్లో భారత్‌ బయోటెక్‌ ఒకటి కావటం మన దేశానికెంతో గర్వకారణం. ఎన్నో వ్యాధులకు భారత్‌ బయోటెక్‌ టీకాలు ఉత్పత్తి చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. 

డాక్టర్‌ కృష్ణ ఎల్ల.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌- మ్యాడిసన్‌ నుంచి మాలిక్యులార్‌ బయాలజీలో పీహెచ్‌డీ చేశారు. తర్వాత సౌత్‌ కరోలినా మెడికల్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ ఫ్యాకల్టీగా పనిచేశారు. మానవాళి ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు టీకాలు అభివృద్ధి చేయడమే పరిష్కారమనేది ఆయన గట్టి నమ్మకం. తనకు ఉన్న అర్హతలు, విజ్ఞానం, అనుభవంతో ఆయన అమెరికాలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంది. కానీ స్వదేశం మీద మక్కువతో కుటుంబంతో సహా వెనక్కి తిరిగి వచ్చారు. భార్య సుచిత్ర ఎల్లతో కలిసి 1996లో హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను స్థాపించారు. హెపటైటిస్‌ -బి టీకాతో మొదలు పెట్టి ఎన్నో వ్యాధులకు టీకాలు ఆవిష్కరించారు. అన్నింటికీ మించి కరోనా మహమ్మారికి ‘కొవాగ్జిన్‌’ టీకా రూపొందించే క్రమంలో ఆయన చూపిన చొరవ, ప్రభుత్వంతో కలిసి పనిచేసిన తీరు, ముఖ్యంగా ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ శాస్త్రవేత్తలతో కలిసి నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగిన విధానం.. టీకాను వేగంగా ఆవిష్కరించేందుకు దోహదపడ్డాయి. పశువుల టీకాలు ఉత్పత్తి చేసే సంస్థను కూడా కృష్ణ ఎల్ల స్థాపించారు. ఆహార ప్రాసెసింగ్‌ విభాగంలోకీ అడుగుపెట్టారు. ఇలా పలురకాల వ్యాపార కార్యకలాపాల్లో ఎంత తీరికలేకుండా ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన శాస్త్ర పరిశోధన, పరిశోధన సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొనడం, అనుభవాలను- ఆలోచనలను పంచుకోవడం మాత్రం మానలేదు. శాస్త్ర విజ్ఞానంలో మనదేశానికి తిరుగులేదని నిరూపించాలనే కలను సాకారం చేసేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు.

కార్యశీలి..సుచిత్ర ఎల్ల.. డాక్టర్‌ కృష్ణ ఎల్ల నిత్య పరిశోధకుడు అయితే, స్వదేశానికి తిరిగి వెళ్లి సొంతంగా కంపెనీ ప్రారంభించాలనే ఆలోచన చేసి, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఘనత ఆయన భార్య, భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లకు దక్కుతుంది. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన ఆమె, కంపెనీ వ్యవహారాలను చక్కబెట్టడంలో క్షణం తీరికలేకుండా ఉంటారు. ఉత్పత్తి నుంచి పరిపాలనా కార్యకలాపాలు, మార్కెటింగ్‌, విక్రయాల వరకూ.. అన్ని అంశాలను పర్యవేక్షిస్తారు. ఆలోచన, పరిశోధన డాక్టర్‌ కృష్ణ ఎల్లది అయితే, దాన్ని అమలు చేయడంలో సుచిత్ర ఎల్ల పాత్ర కీలకం. భార్యాభర్తలు ఉమ్మడిగా, పట్టుదలగా చేసిన కృషికి ప్రభుత్వ మద్దతు, ప్రభుత్వ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తల సహకారం తోడై  ‘కొవాగ్జిన్‌’ టీకా ఆవిష్కరణ సాధ్యమైందని చెప్పొచ్చు. ఆ టీకానే మనదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టింది.


అగ్రరాజ్యంలో తెలుగు తేజం

సత్య నాదెళ్ల - పద్మభూషణ్‌

ప్రపంచంలోనే అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో 1992లో చేరిన మన తెలుగు తేజం సత్యనాదెళ్ల 2014లో ఆ సంస్థ సీఈఓగా ఎంపికయ్యారు. సంస్థ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. బిల్‌ గేట్స్‌, స్టీవ్‌ బామర్‌ తర్వాత మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టే గొప్ప అవకాశం సత్య నాదెళ్లకే లభించింది. ఆ సంస్థ మార్కెట్‌ విలువను 2 లక్షల కోట్ల డాలర్లకు, తదుపరి 3 లక్షల కోట్ల డాలర్లకు చేర్చిన ఘనత సత్య నాదెళ్ల సొంతం. క్రికెట్‌ అంటే బాగా ఇష్టపడే సత్య నాదెళ్ల పూర్తిపేరు నాదెళ్ల సత్యనారాయణ చౌదరి. స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. గతంలో భారత ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగాను, ప్రణాళికా సంఘం సభ్యుడిగా, ఇతర హోదాల్లో పనిచేసి జాతీయస్థాయిలో పేరు గడించిన మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ కుమారుడే సత్య. ఈయన మాజీ ఐఏఎస్‌ అధికారి కేఆర్‌ వేణుగోపాల్‌ అల్లుడు కూడా.


అవధాన ఘనాపాటి.. గరికపాటి

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: అవధాన ప్రక్రియలో ప్రసిద్ధులైన గరికపాటి నరసింహారావును పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన పుట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం. వెంకటసూర్యనారాయణ, రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబరు 14న జన్మించిన నరసింహారావు ఎంఏ, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. భార్య శారదది తూర్పు గోదావరి జిల్లా. తెలుగు భాష, ఉచ్ఛారణ, వ్యాకరణం, సంప్రదాయ అంశాలపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. నేటి తరాన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహితీ ప్రసంగాలతో మురిపించిన ఆయన దేశవ్యాప్తంగా సత్కారాలు అందుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది ఆయన ప్రసంగాలకు శ్రోతలుగా మారారు. కాకినాడలో తొలుత స్నేహితులతో కలిసి కోనసీమ జూనియర్‌ కళాశాలను స్థాపించారు. తర్వాత సొంతంగా గరికపాటి జూనియర్‌ కళాశాల నెలకొల్పారు. చైతన్య కళాశాలలో తెలుగు, సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశారు. 275 అష్టావధానాలను అవలీలగా నిర్వహించిన గరికపాటి.. ఏలూరులో ద్విశతావధానంతో అలరించారు. 1996లో కాకినాడలో 21 రోజులపాటు సహస్రావధానం చేశారు. ఆయన జ్ఞాపకశక్తికి మెచ్చి ప్రముఖ రచయిత బేతవోలు రామబ్రహ్మం ఆయనకు ‘ధారణాబ్రహ్మ రాక్షసుడ’నే బిరుదు ఇచ్చారు. ఆయన ‘సాగరఘోష’ పుస్తకాన్ని రచించారు.


పోలియో బాధితులను నడిపించారు!

వైద్యరంగంలో డాక్టర్‌ ఆదినారాయణరావు సేవలు

భీమవరం, విశాఖపట్నం, న్యూస్‌టుడే: నలభై ఏళ్లుగా పోలియో బాధితులకు సేవలు అందిస్తున్న డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు(82) విశాఖలో ప్రముఖ వైద్యుడిగా పేరుగడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో సుంకర శేషమ్మ, కనకం దంపతులకు జన్మించారు. భీమవరంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. క్రీడల్లోనూ ప్రతిభ చూపారు. 1961-66లో ఏయూలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశాక, అక్కడే ఆర్థోపెడిక్‌ సర్జరీలో ఎమ్మెస్‌ చేశారు. జర్మనీలో శస్త్రచికిత్సలపై శిక్షణ పొందారు. ‘సర్జరీ ఆన్‌ పోలియో డిజెబిలిటీ’ పుస్తకం రాశారు. ఆదినారాయణరావు కేజీహెచ్‌లో ఎముకల విభాగాధిపతిగా, సూపరింటెండెంట్‌గా, ఆంధ్రవైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా, వైద్య విద్యాశాఖ సంచాలకుడిగా సేవలందించారు. ఆయన సతీమణి డాక్టర్‌ శశిప్రభ కేజీహెచ్‌ పర్యవేక్షకురాలిగా పనిచేస్తున్నారు. ప్రముఖ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ సుంకర బాలపరమేశ్వరరావు ఆయన సోదరుడు. దేశ, విదేశాల్లో వేలాది ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి లక్షల మంది పోలియో బాధితుల జీవితాల్లో కొత్త ఊపిరిలూదారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.


భద్రాద్రి రాముడికి నాదస్వర సుప్రభాత సేవకుడు

కళాకారుడు హసన్‌ సాహెబ్‌కు పద్మశ్రీ

గంపలగూడెం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామానికి చెందిన నాదస్వర విద్వాంసుడు దివంగత షేక్‌ హసన్‌సాహెబ్‌కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన 93 ఏళ్ల వయసులో 2021 జూన్‌లో మరణించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన సన్నాయి వాయిద్య కళను పుణికిపుచ్చుకొన్న హసన్‌.. కర్ణాటక సంగీతంలో విశేష అనుభవం సంపాదించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో షేక్‌ చినమౌలానా, ప్రకాశం జిల్లా కరువాదికి చెందిన షేక్‌ చినమౌలానా వద్ద శిక్షణ పొంది, 1954లో ఆలిండియా రేడియోలో నాదస్వర విద్వాంసుడిగా చేరారు. 1981లో భద్రాచలం ఆలయంలో నియమితులయ్యాక.. ‘కౌసల్యా సుప్రజారామా’ అంటూ నాదస్వర సుప్రభాత సేవతో భద్రాద్రి సీతారాముల వారికి సేవలందించారు. యాదాద్రి ఆలయంలోనూ పనిచేశారు. ఆలిండియా రేడియో నుంచి 1996లో హైగ్రేడ్‌ కళాకారునిగా రిటైర్‌ అయ్యాక, తిరువూరులో విశ్రాంత జీవనం గడిపారు. త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు కీర్తనలను నాదస్వర మంగళ వాయిద్యంపై వీనులవిందుగా ఆలపించేవారు.


కిన్నెర మోగింది..

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దర్శనం మొగిలయ్య నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన వారు.పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరితరం కళాకారుడు. గ్రామీణ నేపథ్యంలో దశాబ్దాలుగా ఈ కళను నమ్ముకొని జీవించడంతో పాటు దానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు యత్నిస్తున్నారు. ఇటీవలే బీమ్లానాయక్‌ చిత్రంలో పాట ద్వారా ఆయనకు విశేష గుర్తింపు లభించింది.


పద నర్తనకు పద్మశ్రీ

కూచిపూడి నృత్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డికి పద్మ పురస్కారం వరించింది. కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు. తండ్రి జీవీ రెడ్డి వైద్యుడు, తల్లి స్వరాజ్యలక్ష్మి గృహిణి. ఆమె నిజామాబాద్‌ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కేశ్‌పల్లి (గడ్డం) గంగారెడ్డి చిన్నకోడలు. ‘నృత్య విశారద, కల్కి కళాకార్‌, సంగీత నాటక అకాడమీ’ పురస్కారాలు అందుకున్నారు. 


కోయదొరల ఇలవేల్పు కథకుడు

కోయదొరల ఇలవేల్పు కథకుడు సకిని రామచంద్రయ్యను పద్మశ్రీ వరించింది. కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరానికి చెందిన ఆయన గిరిజన వన దేవతలైన సమ్మక్క-సారలమ్మల జీవిత చరితను డోలి (డోలు) సాయంతో కోయ భాషలో అద్భుతంగా వర్ణిస్తారు. దాన్ని తెలుగులో పాటగా అందంగా మారుస్తారు.రెండు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రలను తెలుగు, కోయ భాషల్లో పారాయణం చేయగలిగే చివరి వ్యక్తిగా రామచంద్రయ్య నిలుస్తారు. మేడారం జాతర సమయంలో అందరికీ గుర్తుకొస్తారీయన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని