Salaries: పాత జీతాలే చెల్లించాలి

పాత జీతాలే చెల్లించాలని కోరుతూ డీడీవోలు, ట్రెజరీ అధికారులకు ఉద్యోగులు అభ్యర్థనలు సమర్పించాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. అభ్యర్థన పత్రం నమూనాను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు

Updated : 28 Jan 2022 04:03 IST

డీడీవో, ట్రెజరీ అధికారులకు లేఖలివ్వాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయం
మీ చుట్టూ తిరిగినప్పుడు మా పరిపక్వత తెలియదా?
డిమాండ్లపై సమాధానం లేనప్పుడు చర్చలకెందుకన్న ఉద్యోగ నేతలు

ఈనాడు, అమరావతి: పాత జీతాలే చెల్లించాలని కోరుతూ డీడీవోలు, ట్రెజరీ అధికారులకు ఉద్యోగులు అభ్యర్థనలు సమర్పించాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. అభ్యర్థన పత్రం నమూనాను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు పంపించింది. పీఆర్సీ ప్రకారం కొత్త జీతాల బిల్లులు చేయాలని ప్రభుత్వం డీడీవోలు, ఖజానా అధికారులపై ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించింది.  పీఆర్సీ అమలులో ఉద్యోగుల ఐచ్ఛికాలను తీసుకోవాలనే నిబంధనను అనుసరించి.. పంచాయతీరాజ్‌ శాఖలోని డీడీవోకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గురువారం అభ్యర్థన లేఖను సమర్పించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో గురువారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛన్‌దారులు ర్యాలీలు, రిలే దీక్షలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓరియంటల్‌ శిక్షణ తరగతులకు హాజరైన ఉపాధ్యాయులు భోజన సమయంలో తలకిందులుగా నిలబడి పీఆర్సీపై నిరసన తెలిపారు. పీఆర్సీ సాధన సమితి నేతలు ఒక్కో ప్రాంతానికి వెళ్లి, నిరసనల్లో పాల్గొన్నారు. రిలే దీక్షల్లో రోజువారీగా కూర్చొనేందుకు జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని, ఫిబ్రవరి 3న నిర్వహించే చలో విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలిరావాలని పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే చర్చలకు వెళ్తామని ప్రకటించింది.

ఇంకెన్ని సంఘాలను చీల్చుతారు?: బొప్పరాజు
‘పీఆర్సీపై ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ తిరిగినప్పుడు మాకు పరిపక్వత ఉందో లేదో తెలియదా? చర్చలకు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ తిరిగినప్పుడు ఆయన ఎక్కడికెళ్లారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులతో కలిసి సజ్జల సమక్షంలో చర్చించలేదా? అశుతోష్‌ మిశ్ర నివేదికపై చర్చిద్దామని సజ్జల చెప్పలేదా? పీఆర్సీలో కోత పెడుతూ ఇచ్చిన ఉత్తర్వులకు ఆయన సాక్షి కాదా? గ్రాట్యుటీ అమల్లో తేదీల మార్పు కారణంగా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు నష్టపోతున్నారు. 2019 నుంచి ఇచ్చిన మధ్యంతర భృతిని వెనక్కి తీసుకోవాలనుకోవడం వాస్తవం కాదా? ఇతర సంఘాలతో చర్చిస్తామని మంత్రుల కమిటీ చెబుతోంది.. అంటే ఇంకెన్ని సంఘాలను చీల్చుతారు? కొత్త జీతాలు చెల్లించేందుకు ఎందుకు తొందర? ప్రభుత్వం దగ్గర నిధులు ఎక్కువగా ఉంటే నవంబరు, డిసెంబరు సప్లిమెంటరీ బకాయిలు రూ.1,800 కోట్లు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన అడ్వాన్సులు, పదవీవిరమణ ప్రయోజనాలు రూ.2,100 కోట్లు చెల్లించాలి. సీఎంపై ఉన్న గౌరవంతో చర్చలకు వచ్చాం. ఫిట్‌మెంట్‌ మినహా మిగతా వాటిపై చర్చించకుండానే ఉత్తర్వులిచ్చేశారు. పీఆర్సీ ఉత్తర్వులతో ఉద్యోగులకు నష్టం కలుగుతుందని, వాటిని నిలిపేయాలని సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చినా, మంత్రుల కమిటీకి లిఖితపూర్వకంగా ఇచ్చినా జవాబు రాలేదు. చర్చల కోసం రోజూ సచివాలయానికి వస్తున్నా.. ఉద్యోగ సంఘాలు రావడం లేదని మంత్రుల కమిటీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ఉద్యోగుల కోసం సంఘాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చాం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై స్పష్టతివ్వాలి’ అని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

వారిపై ఒత్తిడి తొలగించేందుకే లేఖలు: వెంకట్రామిరెడ్డి
‘కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయాలని డీడీవో, ట్రెజరీ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. బిల్లులు చేయబోమంటే సమ్మె ఫిబ్రవరి ఆరు అర్ధరాత్రి నుంచి కదా.. ఇప్పుడెందుకు పని చేయరని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. డీడీవో, ట్రెజరీ అధికారులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు డీఏలతో కలిపి పాత జీతాలే ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించాం. చర్చలకు రమ్మని మంత్రుల కమిటీ పిలిస్తే స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధుల బృందాన్ని పంపించాం. ఆ బృందం మంత్రుల కమిటీని కలిసి గంటన్నరపాటు మాట్లాడింది. పీఆర్సీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదిక బయటపెట్టాలని, జనవరికి పాత జీతాలివ్వాలని కోరింది. మంత్రుల కమిటీ వీటిపై ఏ నిర్ణయం తీసుకోకుండా చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఉద్యోగ సంఘాలు రావడం లేదని చెప్పడం ఎంతవరకు సబబు? ప్రభుత్వం పీఆర్సీపై పునరాలోచిస్తోందని అనుకోవాలంటే జనవరికి పాత జీతాలివ్వాలి. చర్చలపై గతంలోనే మా అభిప్రాయం చెప్పాం. వేరే సంఘాలతో చర్చించాలనుకుంటే చర్చించుకోవచ్చు’ అని అన్నారు.

చలో విజయవాడకు లక్షలాదిగా తరలిరండి: బండి శ్రీనివాసరావు
‘ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై 12 పర్యాయాలు చర్చలు జరిపి, చివరికి మేం చెప్పిన అంశాలను పట్టించుకోకుండానే ఉత్తర్వులు ఇచ్చేశారు. పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధుల బృందం సమర్పించిన వినతిపై మంత్రుల కమిటీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పాత జీతాలు ఇస్తామనో.. అశుతోష్‌మిశ్ర నివేదిక బయటపెడతామనో చెప్పని కమిటీ మిగతావాటిపై ఏం చేస్తుంది? మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లినా ఏం ఉపయోగం లేదు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలకు సిద్ధం. అన్ని జిల్లాల్లో ఉద్యమకార్యాచరణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 3న నిర్వహించనున్న చలో విజయవాడకు ఉద్యోగులు లక్షలాదిగా తరలిరావాలి’ అని వెల్లడించారు.

ఏ పీఆర్సీ అమలు చేస్తున్నారు: సూర్యనారాయణ
‘ఉద్యోగుల జీతాల్లో రికవరీ చేస్తున్నారంటే తగ్గుతున్నట్లు కాదా? రెండున్నరేళ్లుగా ఉద్యోగ సంఘాలతో నాలుగు స్తంభాలాట ఆడారు. చర్చలపై నమ్మకం కలగాలంటే పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలి. ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఏ పీఆర్సీ అమలు చేస్తున్నారు? కేంద్ర పీఆర్సీనా? అశుతోష్‌మిశ్ర నివేదికా? లేక అధికారుల కమిటీ నివేదికనా? స్పష్టతివ్వాలి. కేంద్ర పీఆర్సీలో డీఏలు పెరిగినప్పుడు హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుందని తెలియదా? కేంద్రం 104 భత్యాలతో పీఆర్సీ అమలు చేస్తుంది.. మీరు అవన్నీ ఇస్తారా? ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో శాఖలవారీగా పేస్కేల్స్‌తో నివేదిక ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకివ్వలేదు? మాకు పరిపక్వత లేదని మంత్రుల కమిటీ చెప్పడాన్ని అగౌరవంగా భావిస్తున్నాం. డీఏలు పీఆర్సీలో భాగమని ఏ అధికారైనా చెబితే అంగీకరిస్తాం. ఆర్థికశాఖ అధికారుల లెక్కలు తప్పని నిరూపిస్తాం. దీనికి మాకున్న పరిపక్వత సరిపోతుంది’ అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని