సచివాలయాల ఉద్యోగుల ప్రాబేషన్‌ జూన్‌ నెలాఖరులోగా ఖరారు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ జూన్‌ నెలాఖరులోగా ఖరారు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు

Published : 28 Jan 2022 02:59 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఈనాడు-అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ జూన్‌ నెలాఖరులోగా ఖరారు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం సచివాలయాల వ్యవస్థపై నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి కోరారు. కొత్తగా ప్రారంభించిన ఏపీ సేవా పోర్టల్‌తో సచివాలయాల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,493 ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను త్వరలో చేపడతామని సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో మంత్రుల ధర్మాన కృష్ణదాస్‌, విశ్వరూప్‌, బాలినేని శ్రీనివాసరెడ్డి, సీదిరి అప్పలరాజు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు మరోసారి నిరాశ
ప్రొబేషన్‌ ఖరారులో జాప్యంపై సచివాలయాల ఉద్యోగులు ఇటీవల ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సంబంధిత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ జూన్‌ కంటే ఇంకా ముందే ప్రొబేషన్‌ ఖరారు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పడంతో వారంతా తిరిగి విధులకు హాజరయ్యారు. సీఎం గురువారం నిర్వహించిన సమీక్ష, సమన్వయ కమిటీ సమావేశంలో ప్రొబేషన్‌పై శుభవార్త వెలువడుతుందని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులు చివరకు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 2022 జూన్‌ నాటికి ప్రొబేషన్‌ ఖరారు చేస్తామని ఇదివరకు ప్రకటించిన విషయాన్నే పరోక్షంగా ఆయన వెల్లడించారు. సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మరింత స్పష్టత ఇచ్చారు. ఈ రెండు పరిణామాలతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని సచివాలయాల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి మరోసారి పరీక్షలు నిర్వహించాలని వార్డు, సచివాలయాలశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మొదట ప్రొబేషన్‌ ఖరారు చేయాలన్న ఉద్యోగుల విజ్ఞప్తి ఈ నిర్ణయంతో వెనక్కి వెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని