కలెక్టర్ల నివేదికలే కీలకం!

ప్రతిపాదిత జిల్లాల పునర్విభజనపై క్షేత్రస్థాయిలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఆకాంక్షలు, అభ్యంతరాలను వెల్లడిస్తున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి

Updated : 28 Jan 2022 09:11 IST

కొత్త జిల్లాలపై త్వరలో గెజిట్‌ నోటిఫికేషన్లు
పునర్విభజన భిన్న స్వరాలపై సూచనలకు ఆహ్వానం  

ఈనాడు, అమరావతి: ప్రతిపాదిత జిల్లాల పునర్విభజనపై క్షేత్రస్థాయిలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఆకాంక్షలు, అభ్యంతరాలను వెల్లడిస్తున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి అందించే నివేదికలు కీలకం కాబోతున్నాయి. ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల పేర్లను ప్రకటించింది. ఏడాది కిందటే కలెక్టర్లు జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేశారు. వారిచ్చిన సమాచారాన్ని అనుసరించి... ప్రిలిమనరీ నోటిఫికేషన్ల జారీకి ముందు కలెక్టర్లతో ప్రభుత్వం చర్చించింది. అప్పట్లో ఉన్న కలెక్టర్లు పలువురు ప్రస్తుతం లేరు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్లకు అనుగుణంగా కలెక్టర్లు విడివిడిగా జిల్లాల పేర్లతో రాజపత్రాన్ని (గెజిట్‌ నోటిఫికేషన్‌) విడుదల చేయనున్నారు. 1974 (ది ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిక్ట్స్‌ ఫార్మేషన్‌) చట్టాన్ని అనుసరించి ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై... గ్రామ/వార్డు సచివాలయాలు, తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ల ద్వారా ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై అభ్యంతరాలను వ్యక్తంచేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలకు అవకాశాన్ని కల్పిస్తారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్లకు అందే అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కీలకం కానున్నాయి. వీటిని కోడ్రీకరించి వారు ప్రభుత్వానికి నివేదికలు అందచేస్తారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది తెలియదు. ఈ ప్రక్రియ ముగిశాకే జిల్లాల వారీగా తుది నోటిఫికేషన్‌ వస్తుంది. అయితే... ప్రిలిమనరీ నోటిఫికేషన్‌లో రాజకీయ కారణాలతోనే మార్పులు, చేర్పులు జరగొచ్చని భావిస్తున్నారు.


కదిరి రెవెన్యూ డివిజన్‌పై పునఃపరిశీలన?

నంతపురం జిల్లాలోని కదిరిని మళ్లీ రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లావాసుల నుంచి వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో కొత్తగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడింది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో... పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీనికిముందు కదిరి, ధర్మవరం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లు ఉండగా... కొత్తగా పుట్టపర్తి వచ్చి కదిరి మాయమైంది. కదిరి డివిజన్‌ను యథావిధిగా కొనసాగించాలని గట్టి డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద తాలూకాల్లో ఒకటైన కదిరిలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలనే నినాదం చాలాకాలంపాటు వినిపించింది. చివరికి 2013లో నెరవేరింది. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 12 మండలాలతో కలిపి కదిరి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని