తిరుపతిగానే కొనసాగించండి

జిల్లాల పునర్విభజనలో.. చిత్తూరు జిల్లా విషయమై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న తిరుపతికి శ్రీబాలాజీ పేరు పెట్టడం, మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంపై

Published : 28 Jan 2022 02:59 IST

శ్రీబాలాజీ జిల్లాపై స్థానికుల అభ్యంతరం

ఈనాడు, తిరుపతి: జిల్లాల పునర్విభజనలో.. చిత్తూరు జిల్లా విషయమై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న తిరుపతికి శ్రీబాలాజీ పేరు పెట్టడం, మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంపై ఆందోళన చేస్తున్నారు. ప్రపంచ ప్రాశస్త్యం కలిగిన తిరుపతి పేరు మార్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. తిరుమలకు తిరుపతికి అనుబంధం ఉందని, అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)గా పిలుస్తుంటారని చెబుతున్నారు. అలాంటిది తిరుపతికి శ్రీబాలాజీ జిల్లాగా పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీబాలాజీ అనే పేరు ఇక్కడి వారికి అలవాటు లేదని, తొలి నుంచి తిరుపతిగానే ప్రశస్తి చెందిందని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్‌ పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు తిరుమలకు వచ్చినా తాము తిరుపతికి వెళ్లామనే చెబుతారని, అందువల్ల అదే పేరును జిల్లా కేంద్రానికి కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నగరి నియోజకవర్గం తిరుపతికి ఆనుకుని ఉన్నందున దాన్ని ఈ జిల్లాలో ఉండేలా మార్చాలని అక్కడి తెదేపా నాయకులు కోరుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటుచేస్తామని చెప్పి, ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చారని తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని విమర్శించారు. తిరుపతి జిల్లా అనే పేరే సరైందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బాలాజీ అన్న పదం ఉత్తరాదివారే వాడుతారన్నారు. తిరుపతి పేరుతోనే జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తే మంచిదన్నారు. తిరుపతి పేరు ఒక చరిత్ర అని... తిరుమల, తిరుపతి కవలల్లాంటివని తిరుపతి జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కిరణ్‌రాయల్‌ పేర్కొన్నారు. బాలాజీ జిల్లాగా పేరు మార్చడం బాధ కలిగిస్తోందన్నారు. చరిత్రను చెరపవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవేంకటేశ్వర జిల్లా, శ్రీవారి జిల్లాగా పేరు పెట్టాలని స్థానికులు కొందరు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు