మార్కాపురం జిల్లాకు డిమాండ్లు

ప్రజల డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యం కోసమే పాలనా కేంద్రాల వికేంద్రీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంత పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. తేలిగ్గా వెళ్లగలిగేలా

Published : 28 Jan 2022 02:59 IST

ఈనాడు- అమరావతి, ఈనాడు డిజిటల్‌-ఒంగోలు: ప్రజల డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యం కోసమే పాలనా కేంద్రాల వికేంద్రీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంత పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. తేలిగ్గా వెళ్లగలిగేలా, దగ్గరగా ఉండేలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామంటున్నా అక్కడి ప్రజలు జిల్లా కేంద్రం ఒంగోలు వెళ్లాలంటే సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. రాకపోకలకే 8 గంటలకు పైగా పడుతోంది. లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాల ఏర్పాటు అనే అంశానికి చాలాచోట్ల మినహాయింపులు ఇచ్చినా.. జిల్లా కేంద్రానికి సరిపడా జనాభా, విస్తీర్ణం, అన్ని రకాల అనుకూలతలున్న పశ్చిమ ప్రాంతాన్ని విస్మరించారనే భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఏజెన్సీ జిల్లాల్లో మూడు, నాలుగు శాసనసభ నియోజకవర్గాలతో జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ప్రకాశం జిల్లాలో పూర్తిగా వెనకబడిన పశ్చిమ ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించి మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలతో ప్రత్యేక జిల్లాగా ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నిస్తున్నారు. వెనకబాటే ప్రామాణికం అనుకుంటే ఏజెన్సీ ప్రాంతాల కంటే వెనుకబడ్డాం.. దూరాభారం తీసుకున్నా జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే నాలుగైదు గంటలు పడుతుంది.. దశాబ్దాలుగా కరవులోనే బతుకుతున్నాం.. మరెందుకు మాకు ప్రత్యేక జిల్లా ఇవ్వరనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పశ్చిమ ప్రాంత ప్రజలు ప్రస్తుత జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాలంటే  తెల్లవారుజామున మొదటి బస్సెక్కితే పని పూర్తయి తిరిగివచ్చేసరికి ఏ అర్ధరాత్రో దాటుతుంది. ఒక మనిషి జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలంటే రూ.500 కావాలి.


మార్కాపురం జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం  
- పి.వి.కృష్ణారావు, మార్కాపురం జిల్లా సాధన ఐక్యవేదిక సభ్యుడు

మార్కాపురం ప్రాంత ప్రజలు పూర్తిగా వెనుకబాటుకు గురవుతున్నారు. ఒక్క పరిశ్రమ కూడా లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మార్కాపురం జిల్లా ప్రకటించే వరకు ఉద్యమం చేస్తాం.


డిమాండు:  మార్కాపురం కేంద్రంగా జిల్లా
నియోజకవర్గాలు: 5 యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, మార్కాపురం
విస్తీర్ణం   : 11,500 చ.కి.మీ
జనాభా   : 14.23 లక్షలు
ప్రయోజనం: ప్రత్యేకంగా జిల్లాగా ఏర్పాటు చేస్తే.. వెనకబడిన ప్రాంతమైన ఈ అయిదు నియోజకవర్గాల అభివృద్ధిపైనే అధికారులు దృష్టి పెట్టే వీలుంటుంది. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని