Vijayawada: విజయవాడలోనే ఉన్నాం.. ఉంటాం

కొత్త జిల్లాల ఏర్పాటు విజయవాడలో అంతర్భాగంగా ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ప్రజలకు శాపంగా మారింది. ఈ రెండు నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో కలపాలనే డిమాండు

Updated : 28 Jan 2022 04:08 IST

మచిలీపట్నంలో చేర్చడంపై గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో అసంతృప్తి
ఉద్యమ కార్యాచరణకు సన్నాహాలు

ఈనాడు, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు విజయవాడలో అంతర్భాగంగా ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ప్రజలకు శాపంగా మారింది. ఈ రెండు నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో కలపాలనే డిమాండు పెరుగుతోంది. గన్నవరంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. రోజంతా విజయవాడలోనే ఉండే తమను మచిలీపట్నంలో చేర్చడాన్ని ప్రశ్నిస్తున్నారు. రవాణా, విద్య, ఉపాధి, శాంతిభద్రతలు ఇతర అంశాల ప్రాతిపదికన గన్నవరం, పెనమలూరు విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలోనే కలపాలనే డిమాండు పెరుగుతోంది.

గన్నవరం అస్పష్టతే
గన్నవరం నియోజకవర్గం పూర్తిగా విజయవాడలో కలిసిపోయింది. భౌగోళికంగా విజయవాడ గ్రామీణ మండలం గన్నవరంలోనే ఉంది. ఈ మండలం విజయవాడ జిల్లాలో ఉన్నా.. లోక్‌సభ ప్రకారం కొత్త కృష్ణా జిల్లాలోకి వస్తుంది. దీనిపై గెజిట్‌లో స్పష్టత ఇవ్వలేదు. గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ పేరు మీదే ఉంది. గన్నవరం నుంచి బందరు వెళ్లాలంటే నేరుగా రహదారి లేదు. ఆర్టీసీ బస్సు లేదు.

పెనమలూరూ అంతే
కొన్ని ప్రాంతాలు చెబితే గానీ వేరే పంచాయతీలన్న సంగతి తెలియనంతగా పెనమలూరు నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు విజయవాడలో కలిసిపోయాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కంకిపాడు, ఉయ్యూరులను కలిపి పెనమలూరు ఏర్పాటుచేశారు. కానూరు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి నగరంలో భాగంగానే ఉంటాయి. నగరంలో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. తాడిగడప, పోరంకి, కంకిపాడు, ఉయ్యూరులలో ప్రముఖ విద్యాసంస్థలు వెలిశాయి. పెనమలూరు నుంచి ఏ చిన్నపనికైనా విజయవాడకే వస్తుంటారు.


లోక్‌సభ స్థానం ప్రాతిపదిక కాకూడదు

న్నవరాన్ని విజయవాడ జిల్లాలోనే ఉండాలి. గన్నవరం నుంచి విజయవాడకు అరగంట ప్రయాణం. బందరుకు మూడు గంటలు ప్రయాణం. ఈ విషయంలో అందరినీ కలుపుకొని వెళ్తాం.

- ఆళ్ల గోపాలకృష్ణ, అఖిలపక్ష పోరాట వేదిక కన్వీనర్‌


బెజవాడే సౌకర్యం

ప్రాతిపదికన చూసినా గన్నవరం విజయవాడ జిల్లాలోనే ఉంచాలి. ఇదే విషయాన్ని మా ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతున్నాం. మా స్థాయి వారంతా ఇదే కోరుతున్నాం.

- అవిర్నేని శేషగిరిరావు, వైకాపా రైతు విభాగం జిల్లా కన్వీనర్‌


నియోజకవర్గం: గన్నవరం

మండలాలు: విజయవాడ గ్రామీణం పాక్షికం (9 పంచాయతీలు), గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు

ప్రత్యేకతలు: అంతర్జాతీయ విమానాశ్రయం, మల్లవల్లి పారిశ్రామికవాడ, వీరపనేనిగూడెం పారిశ్రామిక పార్కులు, ఐటీ టవర్స్‌

దూరం: మచిలీపట్నం నుంచి 85 కిలోమీటర్లు

విజయవాడలో కలిసిపోయిన ప్రాంతాలు: రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, నున్న, గన్నవరం


నియోజకవర్గం: పెనమలూరు

మండలాలు: పెనమలూరు, కంకిపాడు, ఉయ్యారు

ప్రత్యేకతలు: విజయవాడలో కలిసిపోయింది. విద్యాసంస్థలు, కేసీపీ చక్కెర కర్మాగరం

దూరం: మచిలీపట్నానికి 64 కిలోమీటర్లు

నగరంతో కలిసిన ప్రాంతాలు: తాడిగడప మున్సిపాలిటీ (కానూరు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి), పెనమలూరు, కంకిపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని