Gajuwaka: గాజువాక ముక్కలు చెక్కలు!

విశాఖపట్నానికి ముఖద్వారంగా ఉన్న గాజువాక ప్రాంతంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. తాజా పరిణామాలతో

Updated : 28 Jan 2022 04:09 IST

ఉక్కు ప్రాంత పరిస్థితి ఏమౌనో?
పెందుర్తిపైనా సిద్ధమవుతున్న వినతులు

విశాఖపట్నం (గాజువాక), న్యూస్‌టుడే: విశాఖపట్నానికి ముఖద్వారంగా ఉన్న గాజువాక ప్రాంతంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. తాజా పరిణామాలతో గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు ఎక్కువగా ప్రభావం కానున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రభావం ముఖ్యంగా పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలపై ఉండనుంది. తాజా నిర్ణయంతో విశాఖవాసులు ఎక్కువగా ఉండే పెందుర్తి ప్రాంతం అనకాపల్లిలో కలవనుంది. పెందుర్తి నియోజకవర్గంలోని ఎన్‌టీపీసీ సింహాద్రి థర్మల్‌ విద్యుత్తుసంస్థ, కీలక విద్యాసంస్థలు, ఫార్మాసిటీ, మరికొన్ని పరిశ్రమలూ అనకాపల్లిలోకి వెళ్లనున్నాయి. గాజువాక, పెదగంట్యాడ మండలాల్లోని కొన్ని గ్రామాలు పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ అనకాపల్లి జిల్లాలో కలవబోతున్నాయి. దీంతో ఊళ్లు ఓ జిల్లాలో, అక్కడివారి భూములు మరో జిల్లాలో ఉంటాయని అయోమయానికి గురవుతున్నారు.

ఉక్కు... రెండు జిల్లాల్లో: విశాఖ ఉక్కుకర్మాగారం రెండు జిల్లాల పరిధిలో ఉండనుంది. స్టీల్‌ప్లాంటు మొత్తం విశాఖ జిల్లా పరిధిలో ఉంటుంది. కానీ ఉక్కునగరంలో సగభాగం అనకాపల్లి జిల్లా పరిధిలో ఉంది. ఉక్కునగర వాసులు తమ అవసరాలకు 12 కి.మీ. దూరంలోని విశాఖకు వస్తుంటారు. అనకాపల్లి జిల్లాలో చేరితే అధికారిక పనులకు దాదాపు 18 నుంచి 20 కి.మీ. దూరంలోని అనకాపల్లికి వెళ్లాలి.

సగం..సగం: పెదగంట్యాడ మండలంలో సగం పెందుర్తి నియోజకవర్గంలో ఉంది. అది అనకాపల్లి జిల్లాలో విలీనం కాబోతుండడంతో శివారు గ్రామాల్లో అలజడి మొదలైంది. 77వ వార్డులోని 32 చిన్న గ్రామాలు పెదగంట్యాడ (గాజువాక నియోజకవర్గం) మండల కార్యాలయం పరిధిలోనివి. అసెంబ్లీ నియోజకవర్గం పెందుర్తి కావడంతో అనకాపల్లి జిల్లాలో కలవనున్నాయి. దీన్ని అంగీకరించేది లేదంటూ పలువురు గళమెత్తుతున్నారు. ఇలా గాజువాకను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలు ముక్కలు, చెక్కలవుతున్నాయనే విషయం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు