నర్సీపట్నాన్నే జిల్లా కేంద్రం చేయాలి

జిల్లా కేంద్రంగా నర్సీపట్నాన్నే చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్‌ మల్లికార్జునకు లేఖలు అందజేశారు. అప్పట్లో బ్రిటిష్‌ పాలకులు

Published : 28 Jan 2022 02:59 IST

వైకాపా ఎమ్మెల్యే గణేష్‌

న్యూస్‌టుడే బృందం: జిల్లా కేంద్రంగా నర్సీపట్నాన్నే చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్‌ మల్లికార్జునకు లేఖలు అందజేశారు. అప్పట్లో బ్రిటిష్‌ పాలకులు నర్సీపట్నం కేంద్రంగానే పాలించారని, అల్లూరి సీతారామరాజు పోరాట స్మృతులు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయని లేఖల్లో ప్రస్తావించారు. ఇక్కడున్న వసతులు, భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు నర్సీపట్నం అందుబాటును వివరించారు.

* నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు.

* రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుచేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణదొర, మొడియం శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆదివాసీ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అద్దంకిని ప్రకాశంలోనే కొనసాగించాలి
- శాప్‌ నెట్‌ ఛైర్మన్‌ కృష్ణచైతన్య
అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లా పరిధిలోనే కొనసాగించాలని వైకాపా అద్దంకి నియోజకవర్గ కన్వీనర్‌, శాప్‌ నెట్‌ ఛైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య కోరారు. దగ్గరలో ఉన్న ఒంగోలును కాదని వంద కి.మీ.దూరంలోని బాపట్లలో కలపడాన్ని నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. సాంకేతికంగా కుదరని పక్షంలో స్థానికంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుచేయాలన్నారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇన్‌ఛార్జి మంత్రి విశ్వరూప్‌ తదితరులకు సమస్యను వివరించనున్నట్లు తెలిపారు.

* కోనసీమ జిల్లాగా ప్రకటించిన అమలాపురం డివిజన్‌కు అంబేడ్కర్‌ జిల్లాగా నామకరణం చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్‌ చేశారు.

ఉదయగిరి జిల్లా సాధిద్దాం
నెల్లూరు జిల్లా ఉదయగిరిని జిల్లా కేంద్రం చేయాలనే ఎజెండాతో మేధావులు, నాయకులు, ప్రజలు పార్టీలకతీతంగా ఉద్యమించాలని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు డాక్టరు వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. ఉదయగిరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ కూడలిలో నిరసన నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయగిరి జిల్లా సాధన సమితి నాయకులు డి.రమేష్‌, చంద్రశేర్‌రెడ్డి, తెదేపా, భాజపా మండల కన్వీనర్లు, విశాంత్ర ఉద్యోగులు పాల్గొన్నారు.

* కర్నూలు జిల్లాలో వెనకబడిన ఆదోని ప్రాంత అభివృద్ధికి ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాయలసీమ సమన్వయ కమిటీ, సీమ విద్యార్థి సంఘం ఆందోళన నిర్వహించింది. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.

* చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని నియోజకవర్గ తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. నియోజకవర్గం తిరుపతి తుడా పరిధిలో ఉందని గుర్తుచేశారు.

ఎస్‌.కోటను విశాఖ జిల్లాలో కలపాలి
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాలంటూ వైకాపా నేతలు, ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండు చేశారు. వైకాపా నాయకులు గొర్లె రవికుమార్‌, పినిశెట్టి వెంకటరమణ, ఎల్‌.కోట ఎంపీపీ శ్రీను, డీసీసీబీ ఛైర్మన్‌ చినరామునాయుడు, జడ్పీటీసీ సభ్యుడు అప్పారావు, ఎస్‌.కోట సర్పంచి సంతోషికుమారిలు ఎస్‌.కోటలోని దేవిగుడి కూడలిలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎస్‌.కోటను విజయనగరం జిల్లాలోనే ఉంచడం దారుణమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్‌ అన్నారు. పట్టణంతోపాటు, వేపాడలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఇదే డిమాండ్‌తో వేపాడ భాజపా మండలాధ్యక్షుడు గోకేడ మహేష్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని