AP News: జిల్లా కేంద్రం ఎంత దగ్గరన్నదే ప్రాతిపదిక

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో... ఒక ప్రాంతం ప్రస్తుత జిల్లా కేంద్రానికి, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లా కేంద్రానికి ఎంత దూరంలో ఉంటుందన్న అంశంతోపాటు భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రత, అనుసంధానతలను ప్రధానంగా

Updated : 28 Jan 2022 04:14 IST

దూరం, విస్తీర్ణం, జనాభా, అభివృద్ధి వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాం
కొత్త జిల్లాలపై ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్‌ వివరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో... ఒక ప్రాంతం ప్రస్తుత జిల్లా కేంద్రానికి, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లా కేంద్రానికి ఎంత దూరంలో ఉంటుందన్న అంశంతోపాటు భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రత, అనుసంధానతలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రణాళికాశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ స్పష్టంచేశారు. ఒక ప్రాంతాన్ని విడదీసి కొత్త జిల్లాగా చేసినప్పుడు, ఆ ప్రాంతం ఆర్థికంగా ఎదగడానికి ఎలాంటి వసతులున్నాయో కూడా చూశామని, సమతుల, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే జిల్లాలను విభజించినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో... అక్కడి ప్రజలందరికీ డివిజన్‌ కేంద్రం వీలైనంత దగ్గర్లో ఉండేలా చూశామన్నారు. కొత్త జిల్లాలపై ఆయన గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాల్ని విభజించే క్రమంలో పరిశ్రమలు, అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాలూ పూర్తిగా ఒక జిల్లాలోకే వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అందువల్లే లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనుకున్నా... అవసరమైన చోట కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఒక శాసనసభ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉంచాలన్న నియమాన్ని పాటించామన్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు, అవసరాన్నిబట్టి మూడు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. విభజన తర్వాత... రెండు ఏజెన్సీ జిల్లాలను మినహాయిస్తే సగటున ప్రతి జిల్లాలో 18-20 లక్షల జనాభా ఉంటుందని ఆయన వివరించారు. సమావేశంలో ఆయన వెల్లడించిన అంశాల్లో కొన్ని ముఖ్యాంశాలు...

ఇలా చేశాం...
* విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే ఎచ్చెర్ల... శ్రీకాకుళం చుట్టూ ఉంది. శ్రీకాకుళం జిల్లాను దృష్టిలో ఉంచుకుని మంజూరు చేసిన వివిధ విద్యా సంస్థలన్నీ ఎచ్చెర్లలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎచ్చెర్లను వేరే జిల్లాలో కలిపితే శ్రీకాకుళం జిల్లాకు అన్యాయం చేసినట్టవుతుంది. అందుకే దాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచేశాం.

* విజయనగరం చిన్న జిల్లా. అందుకే రాజాంని విజయనగరంలోనే ఉంచి, విశాఖ లోక్‌సభ స్థానంలోని ఎస్‌.కోట నియోజకవర్గాన్నీ విజయనగరం జిల్లాలోకి తెచ్చాం. దానివల్ల రాజాంలోని వైద్య కళాశాలతోపాటు నెల్లిమర్ల ప్రాంతంలోని పరిశ్రమలు వంటివి విజయనగరం జిల్లా పరిధిలోకి వచ్చాయి.

* రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు శాసనసభ స్థానాల్ని... కొత్తగా రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి తెచ్చాం. దీనివల్ల ప్రస్తుతం ఏలూరుకి దగ్గరగా ఉన్న నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాలకు కొత్త జిల్లా కేంద్రం కొంత దూరమవుతుంది. అయితే... శాసనసభ నియోజకవర్గాన్ని విభజించకూడదన్న నియమంతో అలాగే ఉంచేశాం.

* ఏలూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే దూరం సమస్య వచ్చింది. నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ నియోజకవర్గాన్ని కర్నూలులో కలిపాం. కర్నూలు నుంచి పాణ్యం 55 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అలాగని ఆ నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలోకి తీసుకురాలేని పరిస్థితి ఉంది. కల్లూరు, ఓర్వకల్లు మండలాలు కూడా కర్నూలు పక్కనే ఉంటాయి. అందుకే కర్నూలు జిల్లాలోకి తెచ్చాం.

* హిందూపురం లోక్‌సభస్థానంలో రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్‌, రాప్తాడు, కూడేరు మండలాలు అనంతపురం నగరానికి దగ్గర్లో ఉంటాయి. చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి కొంచెం దూరంగా ఉంటాయి. నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేయలేం కాబట్టి పూర్తిగా అనంతపురం జిల్లా పరిధిలోకి తెచ్చాం.

* పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు విజయవాడ చుట్టూ ఉన్నాయి. భవిష్యత్తులో విజయవాడను గ్రేటర్‌ కార్పొరేషన్‌గా చేస్తే.... అవి రెండూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోకే వచ్చే అవకాశముంది. అయినప్పటికీ రెండు జిల్లాల్లోనూ అభివృద్ధిలో సమతుల్యత సాధించేందుకు వాటిని మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే కృష్ణా జిల్లాలో ఉంచేశాం. ఒకవేళ ఆ రెండు నియోజకవర్గాలను తీసేస్తే... మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లా మరీ చిన్నదవుతుంది.

* బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలును ఆనుకుని ఉండడంతో దాన్ని ప్రకాశం జిల్లాలోకి తెచ్చాం.

* కడప జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానం పొడవుగా ఉంటుంది. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే... తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరులకు 110-140 కి.మీ.ల దూరం ఉంటుంది. రాయచోటి మధ్యలో ఉంటుందనే దాన్ని జిల్లా కేంద్రం చేశాం.

* చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క పాకాల మండలం తప్ప మిగతా ప్రాంతమంతా తిరుపతిని ఆనుకుని ఉంది. చంద్రగిరిని చిత్తూరు జిల్లా పరిధిలోకి తెస్తే... జిల్లా కేంద్రం 70 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అందుకే తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీ బాలాజీ జిల్లా పరిధిలోకి తెచ్చాం.

* తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి నెల్లూరుకి చుట్టూ ఉండటంతో దాన్ని నెల్లూరు జిల్లా పరిధిలోకి తెచ్చాం.

* ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరుని నెల్లూరు జిల్లాలోకి తేవడంతో జిల్లా కేంద్రానికి దూరం పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది. కానీ ఇప్పటికే ఒంగోలు విస్తీర్ణం, జనాభా పరంగా పెద్ద జిల్లాగా ఉండటంతో... దాన్ని నెల్లూరు జిల్లాలోనే కలపాల్సి వచ్చింది.


హేతుబద్ధంగా ఉంటే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటాం

కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రజలకు అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా తెలియజేయవచ్చునని విజయకుమార్‌ వెల్లడించారు. వాటిలో హేతుబద్ధమైన వాటిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. జిల్లాలకు పేర్లు ఎప్పుడైనా పెట్టవచ్చని, వాటిపై ప్రజల నుంచి వచ్చే వినతులనూ ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నకు... వీలైనంత వరకు ఇప్పుడున్న వారిని సర్దుబాటు చేస్తారని, అవసరమైన చోట ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేస్తుందని బదులిచ్చారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కేడర్‌ పోస్టులు కాబట్టి, వాటిని కొత్తగా మంజూరు చేయడం ఉండదన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో ఒక కలెక్టరు, ముగ్గురు జేసీల చొప్పున... 52 మంది ఐఏఎస్‌ అధికారులు ఉన్నారని, కొత్త జిల్లాల్లో ఒక కలెక్టరు, ఒక జేసీ చొప్పున ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని