NeoCov:కొత్త వైరస్‌ నియోకొవ్‌

ఒమిక్రాన్‌ ఓ వైపు మానవాళిని గడగడలాడిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు మరో కరోనా వైరస్‌ను కనుగొన్నారు. పేరు నియోకొవ్‌. ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాప్తి చెందే వైరస్‌.

Updated : 29 Jan 2022 03:49 IST

గబ్బిలాల్లో వెలుగుచూసింది

భవిష్యత్తులో మానవులకూ ముప్పు!

చైనా వుహాన్‌ ప్రయోగశాల అధ్యయనంలో వెల్లడి

మరింత పరిశోధన అవసరం: డబ్ల్యూహెచ్‌వో

బీజింగ్‌: ఒమిక్రాన్‌ ఓ వైపు మానవాళిని గడగడలాడిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు మరో కరోనా వైరస్‌ను కనుగొన్నారు. పేరు నియోకొవ్‌. ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాప్తి చెందే వైరస్‌. అయితే.. భవిష్యత్తులో ఇందులో ఉత్పరివర్తనాలు జరిగితే మానవులకు ముప్పు కలిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ కొత్త వైరస్‌పై చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌.. వుహాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి అధ్యయనం చేశారు. వీరి పరిశోధన పత్రాన్ని ‘బయో ఆర్కైవ్‌’ ప్రచురించింది. దీనిపై ఇంకా సమీక్ష జరగలేదు. ఈ అధ్యయనం ప్రకారం.. దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ‘నియోకొవ్‌’ వైరస్‌ కనిపించింది. దీనికి.. 2012లో సౌదీ అరేబియాలో తొలిసారి గుర్తించిన మిడిల్‌ ఈస్ట్‌ రెసిపిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌)కు దగ్గర సంబంధం ఉంది.

మనుషులపై ప్రభావం చూపిస్తుందా?

చూపించదు. ఇది జంతువుల మధ్య మాత్రమే వ్యాప్తి చెందుతుంది. అయితే మానవులకు సోకే పీడీఎఫ్‌-2180-కొవ్‌తో నియోకొవ్‌కు దగ్గరి సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా ఉత్పరివర్తనాలు జరిగితే అప్పుడు మానవ రోగనిరోధక వ్యవస్థలోకి చొచ్చుకువెళ్లే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇది కొవిడ్‌-19 రకం కాదు. కాబట్టి ప్రస్తుతం వాడుతున్న టీకాలు అంత ప్రభావవంతంగా ఈ వైరస్‌ఫై పనిచేయవు. ఎందుకంటే ఇది సార్స్‌-కొవ్‌-2 కు భిన్నంగా ఏసీఈ-2 గ్రాహకంపై పనిచేస్తుంది. అయితే ఈ పరిశోధన పత్రంలోని అంశాలపై మరింత లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని.. అప్పుడుగానీ నిర్ధారణకు రాలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎంత ప్రమాదం?

నియోకొవ్‌.. మనుషులకు వ్యాపిస్తుందన్న దాఖలాలు లేవు. కాబట్టి దీంతో ఎలాంటి ప్రమాదం లేదు. మెర్స్‌కొవ్‌తో దీనికి సంబంధం ఉంది కాబట్టి శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం.. భవిష్యత్తులో ఉత్పరివర్తనాలు చెందితేనే ముప్పు. ఈ పరిశోధనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ‘‘చైనా శాస్త్రవేత్తలు చేసిన ఈ అధ్యయనం గురించి మాకు తెలుసు. దీనిపై మరింత పరిశోధన అవసరం’’ అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని