New Districts: ఆరని నిరసన జ్వాలలు

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిరసన జ్వాలలు మరింతగా రగులుతున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలని, ఆయా జిల్లాల్లో తమ నియోజకవర్గాలను కలపకూడదంటూ.. తెరమీదకు కొత్త

Updated : 29 Jan 2022 04:09 IST

జిల్లాలు మార్చాలని పట్టు

రెవెన్యూ డివిజన్లపైనా అభ్యంతరాలు

ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తున్న ఆందోళన

ఈనాడు, అమరావతి: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిరసన జ్వాలలు మరింతగా రగులుతున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలని, ఆయా జిల్లాల్లో తమ నియోజకవర్గాలను కలపకూడదంటూ.. తెరమీదకు కొత్త డిమాండ్లు వస్తున్నాయి. రెవెన్యూ డివిజన్ల విషయాన్నీ కొందరు ప్రస్తావిస్తున్నారు. శుక్రవారం పలుచోట్ల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. విద్యార్థులు సైతం నిరసనల్లో తమ గళాన్ని వినిపిస్తున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఆందోళనలు మిన్నంటాయి. మరోవైపు రైల్వేకోడూరులోనూ నిరసనలు జరిగాయి. పోలీసు ఆంక్షలతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మదనపల్లె జిల్లా కోసం మొదలైన ఉద్యమం ఉద్రిక్తరూపం దాల్చింది. ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయాన్ని జిల్లా సాధన జేఏసీ నేతలు ముట్టడించారు. పోలీసులు వీరిని అరెస్టుచేశారు. తెదేపా, కాంగ్రెస్‌, జనసేన, మాలమహానాడు, సీపీఐ నాయకులు ఆందోళనల్లో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరాన్ని కాక నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ.. శుక్రవారం పట్టణ బంద్‌ పాటించారు. పాత కర్నూలు జిల్లాలో కొత్తగా ఆదోని జిల్లాను ఏర్పాటుచేయాలంటూ రాస్తారోకోలు చేశారు. పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 250 నుంచి 400 కిలోమీటర్ల దూరం ఉంటుందని, అందువల్ల రంపచోడవరాన్ని జిల్లాగా ప్రకటించాలని తూర్పుగోదావరి మన్యంలో ఆందోళనలు చేశారు. కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాకు తిరుపతి పేరునే ఖరారు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ డిమాండు చేశారు.

అధికార పార్టీ నుంచీ... అధికార పార్టీ నుంచి కూడా కొన్ని సమస్యలను ప్రస్తావించారు. నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండుతో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్‌ నేతృత్వంలో శుక్రవారం చర్చావేదిక ఏర్పాటైంది. శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఏర్పేడు మండలాన్ని.. తిరుపతి డివిజన్‌లోనే ఉంచాలని మండల ప్రజాపరిషత్‌ సమావేశంలో వైకాపా ఎంపీటీసీ సభ్యులు తీర్మానం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రంగా పిడుగురాళ్లను ప్రకటించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరగా, నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు అక్కడి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని