నిధులూ రాలేదు.. సర్దుబాటూ లేదు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పి.తక్కెళ్లపాడులో ఏడాది క్రితం గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.40లక్షల అంచనా వ్యయంలో రూ.12 లక్షల పనులు

Updated : 29 Jan 2022 04:20 IST

నరేగాలో మెటీరియల్‌ పెండింగ్‌ బిల్లులు రూ.982 కోట్లు

భవన నిర్మాణాల పనులు నిలిపివేసిన గ్రామ పంచాయతీలు

ఈనాడు, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద రూ.9,871 కోట్లతో రాష్ట్రంలో చేపట్టిన వివిధ భవనాల నిర్మాణ పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇప్పటివరకు పూర్తిచేసిన రూ.982 కోట్ల పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో చాలా జిల్లాల్లో పనులు నిలిపివేశారు. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యమైనప్పుడు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసేది. కేంద్రం నుంచి నిధులొచ్చాక వాటిని జమ చేసుకునేవారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి అలాంటి ప్రతిపాదనలు వెళ్లినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ పెట్టుబడులు పెట్టిన గ్రామ పంచాయతీలు.. పనులు పూర్తి చేయడం తమవల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నాయి. మంజూరైన పనుల్లోనూ ఇంకా 6 వేలకుపైగా ప్రారంభం కావలసి ఉంది. వీటిపై ఇంజినీర్లు ఒత్తిడి తెస్తున్నా... పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే తప్ప కొత్త పనులు ప్రారంభించబోమని సర్పంచులు చెబుతున్నారు.

రోడ్లు లేవు... భవనాలే

నరేగాలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద రహదారులకూ ప్రాధాన్యం ఇచ్చేవారు. 2021-22లో దాదాపు రూ.10వేల కోట్ల అంచనాలతో 36,478 భవన నిర్మాణ పనులే ప్రారంభించారు. వీటిలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ గ్రంథాలయ భవనాలు ఉన్నాయి. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో భవన నిర్మాణ పనుల్లో జాప్యంపై ఇంజినీర్లపై కలెక్టర్లు ఆగ్రహించి సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించిన సందర్భాలున్నాయి. దీంతో ఇంజినీర్లు పనులు వేగవంతం చేయించారు. కానీ బిల్లుల చెల్లింపులపై ఎవరి నుంచీ సమాధానం లేదు.

భారీగా పెరిగిన అంచనా విలువలు

పనుల్లో జాప్యంతో అంచనా విలువలు భారీగా పెరిగాయని పంచాయతీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిమెంటు, ఇసుక, స్టీలు, ఇటుక, కూలీల ధరలు పెరగడంతో రూ.40లక్షల అంచనాలతో ప్రారంభించిన గ్రామ సచివాలయ భవన నిర్మాణ ఖర్చు రూ.46 లక్షలకు పెరిగింది.రూ.21.80 లక్షల రైతు భరోసా కేంద్రం అంచనా విలువ రూ.25.30 లక్షలకు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రం రూ.17.50 లక్షల నుంచి 24 లక్షలకు పెరిగినట్లు పలు జిల్లాల్లో ఇంజినీర్లు తాజా అంచనాలు వేశారు. బిల్లులు చెల్లించినా పాత ధరలతో పనులు పూర్తిచేయడం కష్టమని పలువురు సర్పంచులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని