Andhra News: ఇక వేచి చూడం.. చర్చలకు ఉద్యోగులు పిలిస్తేనే వస్తాం

పీఆర్‌సీలో అభ్యంతరాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇక వారి కోసం వేచి చూడదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Updated : 29 Jan 2022 03:56 IST

చర్చలకు సిద్ధమని ఉద్యోగులు పిలిస్తేనే వస్తాం

కమిటీ సభ్యులు బొత్స, పేర్ని నాని, సజ్జల

ఈనాడు, అమరావతి: పీఆర్‌సీలో అభ్యంతరాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇక వారి కోసం వేచి చూడదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధమని ఉద్యోగులు పిలిస్తేనే వస్తామని వెల్లడించారు. సచివాలయంలో మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రతి రోజూ వచ్చి వారి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాలుగు రోజులుగా వచ్చి వెళ్తున్నాం. ఉద్యోగులు చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. మేం చర్చలకు రమ్మని పిలుస్తుంటే అలుసుగా తీసుకుంటున్నారు. జీతాలు పెరుగుతాయా? లేదా? అనేది ఒకటో తేదీన పే స్లిప్‌ చూస్తే తెలుస్తుంది. ఏ ఉద్యోగికీ ఒక్క రూపాయి కూడా జీతం తగ్గదు. ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణకు దిగొద్దు. మంత్రుల కమిటీకి చట్టబద్ధత లేదంటే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాంటి కమిటీతో చర్చలకు ముందుకు రాకుంటే ఎలా? యాజమాన్యంతో విభేదాలు వస్తాయి. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలా లేదా? చర్చలకు రాకుండా ఇదేదో కొత్త సంస్కృతిని ఉద్యోగ సంఘాలు తీసుకొస్తున్నట్లుంది. ఉద్యోగ సంఘాల నేతలు సజ్జల గురించి మాట్లాడినా.. మంత్రి నానిపై మాట్లాడినా... మేం దాన్ని పట్టించుకోం. మాకు ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చిందో.. దాన్ని గుర్తెరిగి ఈ సమస్యను పరిష్కరిద్దామని భావించాం. నాలుగు మెట్లు దిగే చెప్పాం. మేం ఇంట్లో కూర్చుంటాం.. వచ్చేది లేదని ఉద్యోగులు అంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు వ్యవహరించాలి...’’ అని బొత్స పేర్కొన్నారు. ఇప్పటికీ ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని పిలుస్తున్నామని, వాళ్లు అర్థం చేసుకోవడం లేదని సజ్జల చెప్పారు. ‘‘జనవరి నెల జీతాలను కొత్త పీఆర్‌సీ ప్రకారమే చెల్లిస్తాం. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘాల నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలకు వచ్చినట్లయితే జనవరిలో పాత జీతాలను వేసే అంశాన్ని ప్రభుత్వం కూడా పరిశీలించి ఉండేదేమో? కొత్త పే స్కేళ్లతో వేతన బిల్లులను రూపొందిస్తున్న ఖజానా సిబ్బందిని పనిచేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లతో నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే వారితో చర్చించడానికి సిద్ధమే...’’ అని సజ్జల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని