gulab Compensation:మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

తుపాను ప్రభావంతో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5లక్షల చొప్పున పరిహారమివ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సహాయ శిబిరాలనుంచి బాధితులు వారి ఇళ్లకు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున ఆర్థికసాయం చేయాలని సూచించారు.

Updated : 06 Sep 2022 15:55 IST

సహాయ శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు
ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి సాయం
తుపాను సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్‌ సమీక్ష

ఈనాడు, అమరావతి: తుపాను ప్రభావంతో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5లక్షల చొప్పున పరిహారమివ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సహాయ శిబిరాలనుంచి బాధితులు వారి ఇళ్లకు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున ఆర్థికసాయం చేయాలని సూచించారు. గులాబ్‌ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి అరగంటకు దీనిపై సమాచారం తెప్పించుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ఉదారంగా సాయం చేయాలని చెప్పారు. అవసరమైనచోట సహాయ శిబిరాలు ఏర్పాటుచేయాలని, వాటిల్లో ఉండేవారికి నాణ్యమైన ఆహారం అందివ్వాలని సూచించారు. అందరికీ వైద్యం, రక్షిత తాగునీరు అందించాలని పేర్కొన్నారు. అవసరమైనచోట వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. విశాఖలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని బయటకు పంపే పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రక్షిత మంచినీటిని అందించేందుకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణం ఎన్యూమరేషన్‌ పూర్తి చేసి రైతులను ఉదారంగా ఆదుకోవాలని సూచించారు. ఒడిశాలో బాగా వర్షం కురుస్తున్నందున వంశధార, నాగావళి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిస్థితినిబట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. మానవ తప్పిదాలు ఎక్కడా ఉండరాదని చెప్పారు. దేవుడి దయ వల్ల హుద్‌హుద్‌, తిత్లీ స్థాయిలో తాజా తుపాను లేదని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 90కి.మీ.వేగంతో గాలులు వీచాయని, చెట్లు కూలిన చోట వెంటనే తొలగించామని శ్రీకాకుళం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ తెలిపారు. జాతీయ రహదారులతోసహా ప్రధాన మార్గాల్లో రవాణాకు ఆటంకం లేకుండా చూశామని చెప్పారు. విశాఖలో లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని