Updated : 29/09/2021 09:17 IST

gulab cyclone:తగ్గని వరద ఉద్ధృతి

నాగావళి నది ఉగ్రరూపం
ముంపులో 20 గ్రామాలు
1.91 లక్షల ఎకరాల్లో పంట మునక
గులాబ్‌ ధాటికి అన్నదాతకు కష్టాలు  
తెరిపిన పడుతున్న విశాఖ

ముంపు నుంచి బయటపడిన లోతట్టు ప్రాంతాలు

ఈనాడు - విశాఖపట్నం, విజయనగరం, ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు అన్నదాత వెన్నువిరిచాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.91 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉత్తరాంధ్రలోనే దాదాపు లక్ష ఎకరాల్లో పంట నీట మునిగింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, చెరకు నీటమునిగి అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పంట నష్టం ఎక్కువగా ఉంది. విశాఖ జిల్లాలోనూ దాదాపు 20 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరో రెండు రోజులు ముంపు ఇలాగే ఉంటే పంటలు పూర్తిగా పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుపాను ప్రభావం నుంచి విశాఖ నగరం తేరుకుంటోంది.

సోమవారం ఉదయం వరకు విశాఖలోని పలు ప్రాంతాల్లో 20 నుంచి 33 సెం.మీ.ల వరకు అతి భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. సోమవారం రోజంతా కలిసి 2.2 సెం.మీ., మంగళవారం ఉదయం 3.3 సెం.మీ. వర్షపాతమే నమోదవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీరంతా క్రమంగా సముద్రంలో కలిసిపోయింది. ఫలితంగా మంగళవారం సాయంత్రానికి విశాఖ నగర పరిధిలోని అన్ని ప్రాంతాలు ముంపు బారి నుంచి పూర్తిస్థాయిలో బయటపడగలిగాయి. జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. అయితే ఇప్పటికే అధ్వానంగా ఉన్న నగర రహదారులు వర్షాలకు మరింత దారుణంగా మారాయి. విశాఖ జిల్లాలో 355 కి.మీ.ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

శ్రీకాకుళంలో మూడోరోజూ వర్షాలు

గులాబ్‌ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి, శ్రీకాకుళం, గార సహా పలు మండలాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటి 48 గంటలు గడిచినా ఇప్పటికీ జిల్లాలోని కొన్ని గ్రామాలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కాలేదు. ఎక్కువ సంఖ్యలో స్తంభాలు కూలిపోవడంతో పునరుద్ధరణకు ఎక్కువ సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఒడిశాతో పాటు విజయనగరం జిల్లాలోనూ మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలకు వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. ఆ నీరంతా నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదుల్లోకి వస్తోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి పెద్దఎత్తున వరద నీరు నదిపై ఉన్న తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులకు వచ్చి చేరింది. ఎగువనున్న వెంగళ్రాయసాగర్‌, పెద్దగెడ్డ రిజర్వాయర్‌ నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నీటిని ఒకేసారి కిందికి విడిచిపెట్టడంతో ఇబ్బందులు తలెత్తాయి. సోమవారం అర్ధరాత్రి వంగర, రేగిడి, బూర్జ, ఆమదాలవలస తదితర మండలాల్లోని పొలాల మీదుగా వరద నీరు 20కి పైగా గ్రామాలను ముంచెత్తింది.

తూర్పులో రహదారులు చిధ్రం

గులాబ్‌ తుపాను కారణంగా కుండపోతగా కురిసిన వర్షాలకు తూర్పుగోదావరి మన్యంతోపాటు జిల్లావ్యాప్తంగా పలు రహదారులు ఛిద్రమయ్యాయి. తాళ్లరేవు తదితర మండలాల్లో రోడ్లకు భారీ గుంతలు పడి, వాటిలో వర్షపునీరు చేరడంతో దారి కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో తారు తేలిపోయి, కోతకు గురై వాహనచోదకులు నరకం చూశారు.

జాతీయ రహదారిని ముంచెత్తిన వరద

పశ్చిమ గోదావరి జిల్లా గుండేరు వాగులో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దెందులూరు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో సత్యనారాయణపురం వద్ద గుండేరు గట్టుకు గండి కొట్టారు. అండర్‌ టన్నెల్‌ వద్ద అడ్డుపడిన వ్యర్థాలను యంత్రాలతో తొలగించారు. నీరు రహదారిపైకి చేరడంతో వాహనాలను దారి మళ్లించారు.

 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని