House Planning: దేనికీ ప్లాన్‌!

రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో.. వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా భవనాల ప్లాన్ల వివరాలు సేకరిస్తున్నారు. విషయమేంటో స్పష్టంగా చెప్పకుండా ఉన్నట్టుండి ప్లాన్‌ కాపీలు ఎందుకు అడుగుతున్నారో తెలియక భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 02 Dec 2021 05:08 IST

నగరాలు, పట్టణాల్లో ఇళ్ల ప్రణాళికల వివరాల సేకరణ

విశాఖలో వాలంటీర్ల నుంచి సందేశాలు
ఈనాడు - అమరావతి

రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో.. వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా భవనాల ప్లాన్ల వివరాలు సేకరిస్తున్నారు. విషయమేంటో స్పష్టంగా చెప్పకుండా ఉన్నట్టుండి ప్లాన్‌ కాపీలు ఎందుకు అడుగుతున్నారో తెలియక భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానాన్ని మార్చి, కొత్తగా మూలధన విలువ ఆధారిత పన్ను విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పన్నులు భారీగా పెరుగుతాయని ప్రజలు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఇంటి ప్లాన్లు తీసుకుని ఇంకేం అదనపు భారాలు మోపుతారోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. ఇంటి ప్లాన్ల వివరాలు సేకరించడంపై విశాఖపట్నంలో ఇప్పటికే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జనసేన నాయకులు కూడా కమిషనర్‌ను కలిసి నిరసన తెలియజేశారు.

ప్లాన్‌ అతిక్రమిస్తే జరిమానా
అద్దె ఆధారిత విధానం నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారిత పన్ను విధానంలోకి మారినప్పుడు.. భవనాల కొలతలతో పాటు, ప్లాన్‌ వివరాల్నీ రికార్డుల్లో నమోదు చేయాలని, అందుకే ప్లాన్లు ఇవ్వాలని అడుగుతున్నట్లు కొందరు సిబ్బంది చెబుతున్నారు. ప్లాన్‌ అతిక్రమించిన నిర్మాణాలు చేపట్టినవారికి ఆస్తిపన్నులో కొంత మొత్తం జరిమానాగా విధించే విధానం ఎప్పటి నుంచో ఉంది. భారీ ఉల్లంఘనలు ఉంటే తప్ప ఇప్పటివరకు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అధికారులు అతిక్రమణలను చూసీచూడనట్టు పోయేవారు. కొత్త విధానంలో భవనం కొలతలు, ప్లాన్ల వివరాలు కార్యాలయంలో అందుబాటులో ఉంటే అధికారులే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్లాన్‌ అందుబాటులో లేకుంటే యజమానులను అడుగుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసినప్పుడు.. అతిక్రమణ ఉన్నట్టు తేలితే నిబంధనల మేరకు జరిమానా పడుతుంది. అనుమతి తీసుకోకుండానే భవనాలు నిర్మించినవారు, ప్లాన్‌ను అతిక్రమించినవారు బీపీఎస్‌లో క్రమబద్ధీకరణ చేసుకుని ఉండకపోతే, ఇప్పుడు జరిమానాలు కట్టాల్సి వస్తుంది. ఇంతకాలం ప్లాన్‌ అతిక్రమణలున్నా జరిమానా చెల్లించనివారు ఇప్పుడు కట్టాల్సి ఉంటుంది.

స్పందించని పురపాలకశాఖ అధికారులు
నగరాలు, పట్టణాల్లో భవనాల యజమానుల నుంచి ప్లాన్ల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారన్న అంశంపై పురపాలకశాఖ అధికారుల అధికారుల వివరణ తీసుకోడానికి ‘ఈనాడు’ ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. పురపాలకశాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్‌కు ఫోన్లు చేసినా, సందేశం పంపినా ఆయన స్పందించలేదు.


మీ ఇంటికి ప్లాన్‌ ఉందా? ఉంటే దాని కాపీ వార్డు సచివాలయంలో ఇవ్వండి. కాపీ ఇవ్వకపోతే మీ భవనాన్ని  అనధికార నిర్మాణంగా  పరిగణిస్తాం.

-విశాఖపట్నంలోని నివాస, వాణిజ్య భవనాల యజమానుల ఫోన్లకు వార్డు వాలంటీర్ల నుంచి వచ్చిన సంక్షిప్త సందేశమిదీ


మీ ఇంటి ప్లాను కాపీ  చూపించండి. మాకివ్వడం ఇష్టం లేకపోతే వార్డు సచివాలయంలో చూపించొచ్చు. ఇంటికి ప్లాన్‌ ఉందో లేదో నిర్ధారించుకోవడానికి,భవనాన్ని ఎప్పుడు నిర్మించారో తెలుసుకోవడానికే అడుగుతున్నాం.

-ఇది తూర్పుగోదావరి జిల్లా తునిలోని పలు వార్డుల్లో   సచివాలయ ఉద్యోగులు చెబుతున్న మాట.


చట్టాలు ఏం చెబుతున్నాయి?
* 1994 మార్చి 1కి ముందు నిర్మించిన భవనాలకు ప్లాన్‌ లేకపోయినా, ప్లాన్‌ను అతిక్రమించినా జరిమానాలు లేవు.
* 1994 మార్చి 1 నుంచి 2007 డిసెంబరు 14 మధ్య నిర్మించిన భవనాలకు 10 శాతం, 2007 డిసెంబరు 15 నుంచి 2013 ఆగస్టు 4 మధ్య నిర్మించిన భవనాలకు నిబంధనలు మీరితే 25 శాతం జరిమానా విధిస్తారు.
* 2013 ఆగస్టు తర్వాత నిర్మించిన భవనాలకు.. ప్లాన్‌లో అతిక్రమణలు 10 శాతం వరకు ఉంటే 25 శాతం, 10 శాతం దాటితే 50 శాతం, ప్లాన్‌ లేకపోతే 100 శాతం జరిమానా విధిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని