Jawad: ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు

ఉత్తరాంధ్రకు జవాద్‌ తుపాను ముప్పు తప్పింది. శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికి ఇది మరింత బలహీనపడి

Updated : 05 Dec 2021 06:35 IST

బలహీనపడిన ‘జవాద్‌’ తుపాను

తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశా దిశగా ప్రయాణం

ఉప్పాడ-కాకినాడ బీచ్‌ రోడ్డుపైకి చొచ్చుకొస్తున్న కెరటాలు

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం: ఉత్తరాంధ్రకు జవాద్‌ తుపాను ముప్పు తప్పింది. శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను బలహీనపడినా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాలపూర్‌ ఐఎండీ అధికారి ఉమాశంకర్‌దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. తుపాను బలహీనపడినా దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సంచాలకులు సునంద వెల్లడించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని చోట్ల గాలులు బలంగా వీస్తాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉందని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో నేలవాలిన వరి పంటను కాపాడుకుంటున్న రైతు

ఈదురుగాలులు.. ఓ మోస్తరు వానలు

జవాద్‌ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే వానలు మొదలయ్యాయి. శనివారం కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక వేగంతో ఈదురుగాలులు కూడా వీచాయి. ఒకటి రెండుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. శనివారం రాత్రి నుంచి ఆది, సోమ వారాల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని అధికారులు చెప్పారు. తుపాను ప్రభావంతో శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల మధ్య అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా గార మండలం తులుగులో 7.1, సోంపేట మండలం కొర్లాం, పలాసల్లో 5.5 సెం.మీ. సంతబొమ్మాళి 5.4, కవిటి మండలం రాజాపురంలో 5.1, పొలాకిలో 4.9 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా పలాసలో 3.2, సోంపేటలో 2.6, రణస్థలంలో 2.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావం విశాఖపై పెద్దగా లేనప్పటికీ శనివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. తీరం వెంట చలిగాలులు వీచాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లిలో సముద్రం 120 అడుగులు ముందుకొచ్చింది. శ్రీకాకుళంలో తీరం వెంట గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వానలకు పలు మండలాల్లో వరి పంట నీటమునిగింది. శ్రీకాకుళంలో 79 పునరావాస కేంద్రాలకు 780 మందిని, విజయనగరంలో 154 కేంద్రాలకు 3,260 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. భోగాపురంలోని ఉన్నత పాఠశాలలో సుమారు 45 మందికి శుక్రవారం ఆశ్రయం కల్పించారు. అక్కడ విద్యుత్తు సదుపాయం కూడా లేదు. శనివారం నాలుగు గంటల వరకు తాగునీరు అందించలేదు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అప్పటికప్పుడు భోజనాలు వండి వడ్డించారు. సహాయచర్యలపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు సమీక్షించారు. తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ- కాకినాడ బీచ్‌రోడ్డుపై అలల తీవ్రతకు నీరు నేరుగా రహదారిపై చొచ్చుకొచ్చింది. రక్షణగా వేసిన రాళ్లు ఎగిరిపడి, రహదారి ధ్వంసమైంది. దీంతో అదికారులు అటువైపు రాకపోకలను నిలిపేశారు. ఉప్పాడ, కోనపాపపేట, సూరాడపేట, జగ్గరాజుపేట తదితర గ్రామాలు కోతబారినపడ్డాయి. శనివారం సాయంత్రానికి సముద్రం సాధారణస్థితికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు.


కొబ్బరిచెట్టు కూలి యువతి దుర్మరణం

తుపాను గాలులకు శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరిచెట్టు కూలి పడి ఓ యువతి మృతి చెందింది. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం మెళియాపుట్టికి చెందిన గొరకల చంద్రయ్య కుటుంబం కొబ్బరితోటలోనే నివాసం ఉంటుంది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న వీరి రెండో కుమార్తె ఇందు (17)పై శనివారం ఉదయం కొబ్బరిచెట్టు కూలిపడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని