Updated : 14/11/2021 05:40 IST

Kuppam: కుప్పంలో ప్రలోభాల పర్వం

సర్వే, ఓటరు స్లిప్పుల పేరిట డబ్బుల పంపిణీ

కుప్పం మోడల్‌ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మాట్లాడుతున్న ఎంపీ రెడ్డెప్ప

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, కుప్పం, గ్రామీణ, పట్టణం: కుప్పం పురపాలిక పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఎత్తుగడలో ప్రలోభాల పర్వం సాగుతోంది. ఒక్కో నాయకుడికి ఒక్కో వార్డు బాధ్యతలను సంబంధిత పార్టీ అప్పగించింది. ఓటర్లకు డబ్బుల పంపిణీ బాధ్యతలనూ స్థానికేతరులకు ఇచ్చింది. శనివారం ఉదయం నుంచే ఆ పార్టీ కార్యకర్తలు కొందరు సర్వేల పేరిట, ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడానికి ఇళ్లకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు పంపిణీ చేస్తున్నారని కుప్పం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మణి ఆరోపించారు. ఇప్పటికే కొంత (రూ.1500) పంపిణీ చేయగా, ఎన్నిక రేపు అనగా మరికొంత(రూ.1500), ఎన్నిక రోజున కొంత ఎక్కువగా (రూ.2వేలు) ఇవ్వనున్నట్లు సమాచారం. ఓ వార్డులోనైతే ఏకంగా రూ.15వేలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. స్వపక్షంలోనే ఉండి.. అసంతృప్తితో ఉన్న చోటా నాయకులకైతే రూ.25 వేలు- రూ.40వేలు, కొంత పెద్ద నేతలైతే రూ.లక్ష- రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప శనివారం మోడల్‌ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ప్రచారం చేశారు. అక్కడే ఓ మహిళా వాలంటీర్‌.. వైకాపా అభ్యర్థిని గెలిపించాలని కోరడం గమనార్హం. సోమవారం ఈ పాఠశాలలోనే పోలింగ్‌ నిర్వహించనున్నారు. అనిమిగానిపల్లిలో పోలింగ్‌  కేంద్రం తలుపులకు వైకాపా స్టిక్కర్లు అతికించారు.

ఓటుతో సమాధానం చెప్పండి: చంద్రబాబు

‘హలో.. నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నా..’ అంటూ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లకు శనివారం తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మాటలు రికార్డు చేసిన స్వరం సందేశంగా వచ్చింది. కుప్పంలో అలజడి సృష్టించేందుకు బయటివారు వచ్చారని, వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. వైకాపా దుష్టశక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుప్పంతో ఉన్న బంధాన్ని వేరు చేయలేరని చెప్పారు. తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించారు. వైకాపా ప్రభుత్వం తనపై ఉన్న కోపాన్ని కుప్పంపై చూపుతోందన్నారు. రెండున్నరేళ్లుగా కుప్పంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు.


రెండు ఓట్లను వేయించేలా...

ఈనాడు, తిరుపతి: కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ పార్టీ నేతలు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఇప్పటికే రెండు వార్డుల్లోనూ ఓటు ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న వారితో రెండు ప్రాంతాల్లోనూ వారితో ఓటు వేయించేలా కసరత్తు చేస్తున్నారు. తిరుపతి ఎన్నిక సమయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అమలు చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు.

* అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో కూడా కొందరు ఓటర్లకు డబ్బు, చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.


దొంగ ఓట్లకు యత్నిస్తున్నారు: తెదేపా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ నెల 15, 16తేదీల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిలీ గుర్తింపు కార్డుల సాయంతో బయటవ్యక్తులతో దొంగఓట్లు వేయించే కుట్ర జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా ఫిర్యాదు చేసింది. తిరుపతి ఉపఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అనుసరిస్తున్నారంటూ పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబు ఎస్‌ఈసీ నీలం సాహ్నీకి లేఖలు రాశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని