Updated : 15/11/2021 05:41 IST

Kuppam: కుప్పానికి భారీగా స్థానికేతరులు

ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, దొంగ ఓట్లేయడమే వారి పని

ఫొటోలు, వీడియోలను జత చేసి ఎస్‌ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తూ ప్రచార సమయం ముగిశాక సైతం వందల సంఖ్యలో స్థానికేతరులు కుప్పం పురపాలిక పరిధిలోకి వచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, పోలింగ్‌ రోజు దొంగ ఓట్లేయడమే లక్ష్యంగా వైకాపా నాయకులు వారికి స్థానికంగా ఆశ్రయమిచ్చారని మండిపడ్డారు. ‘‘ప్రచార గడువు ముగిసినా వైకాపా వారు స్థానికేతరులను కుప్పానికి తీసుకొస్తున్నారు. వారితో డబ్బు పంపిణీ చేయిస్తున్నారు. ఓటర్లను, తెదేపా నాయకులను బెదిరిస్తున్నారు. దీన్ని పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు’ అని ఆరోపించారు. ‘‘దొంగ ఓట్లు వేసేందుకు తీసుకొచ్చిన వారందరినీ వేర్వేరు చోట్ల ఉంచారు. దీనిపై మీకు, డీజీపీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం. వీటిపై సమాచారమిచ్చినా పోలీసులు స్పందించక ఎదురుకేసులు పెడుతున్నారు. దురుద్దేశంతో వస్తున్న స్థానికేతరులను అడ్డుకోకపోతే స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగే అవకాశం లేదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘కుప్పం 23, 24వ వార్డుల్లో ఓటర్లకు డబ్బు పంచుతున్న స్థానికేతరుల్ని తెదేపా పట్టణ అధ్యక్షుడు రాజకుమార్‌ అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోపు వైకాపావారు రాజ్‌కుమార్‌ను కులం పేరుతో దూషించారు. చాలాసేపటికి వచ్చిన పోలీసులు.. ఫిర్యాదునివ్వాలంటూ రాజ్‌కుమార్‌ను స్టేషన్‌కు రప్పించి తీరా అక్కడికెళ్లాక వైకాపావారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన్ని అరెస్టు చేశారు. స్థానిక వైకాపా నేతలతో కుమ్మక్కైన పోలీసుల తీరుకు ఇదో ఉదాహరణ. స్థానికేతరులను వాహనాల్లో తరలించిన ఫొటోలు, వీడియోలను లేఖకు జత చేస్తున్నాం. కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక పోలీసులను, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించండి’’ అని లేఖలో కోరారు. 

* కుప్పంలో డబ్బు పంచుతూ నోట్ల కట్టలతో పట్టుబడ్డ వైకాపా నేతలను అరెస్టు చేయకుండా పోలీసులు తమ పార్టీ నేతలను బెదిరించడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరులో తమ పార్టీ నేత కప్పిర శ్రీనివాసులును మంత్రి అనిల్‌కుమార్‌ వారం రోజులుగా పోలీసుస్టేషన్‌కు పిలిపించి వేధించడం వైకాపా దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. వేధింపులు తట్టుకోలేక శ్రీనివాసులు ఆత్మహత్యకు ప్రయత్నించారని, ఆయనకు ప్రాణహాని జరిగితే మంత్రి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

* కుప్పం పట్టణ తెదేపా అధ్యక్షుడు రాజశేఖర్‌, నెల్లూరులో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో ఉన్న తెదేపా నేత కప్పిర శ్రీనివాసులు, భార్య రేవతిని.. చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు.

నేడు కుప్పం వెళ్లనున్న చంద్రబాబు

చంద్రబాబు సోమవారం కుప్పం వెళ్లనున్నారు. కుప్పం పురపాలక సంఘానికి సోమవారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్తారు. ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తారు.


తెదేపాలోకి పులివెందుల నియోజకవర్గ వాసులు

చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన పులివెందుల నియోజకవర్గ వాసులు

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని నల్లపురెడ్డిపల్లె, వేంపల్లి, రావులకొలను పంచాయతీలకు చెందిన 25 కుటుంబాలవారు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీటెక్‌ రవి మాట్లాడుతూ.. ‘జగన్‌ సొంత నియోజకవర్గంనుంచి పలువురు యువకులు.. తెదేపాలో చేరేందుకు ముందుకు వచ్చారు. సొంత నియోజకవర్గంలోని వారే సీఎం పాలనపై విసిగిపోయారు’ అని పేర్కొన్నారు. ‘ఓటు హక్కు వచ్చినప్పటినుంచి మొదట్లో కాంగ్రెస్‌కు, తర్వాత వైకాపాకు ఏజెంట్‌గా పనిచేశాం. యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా నల్లపురెడ్డిపల్లెలో 500 మందివరకు నిరుద్యోగులు ఉపాధి లేకుండా ఉన్నారు. గిట్టుబాటు ధరలందక రైతులు కూడా స్వచ్ఛందంగా తెదేపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని పార్టీలో చేరిన కార్యకర్తలు చెప్పారు. ‘మొదట్నుంచి వైకాపాలో ఉన్నాం.. స్టేషన్ల చుట్టూ తిరిగాం.. ప్రతిపక్షంలో చేరితే అంతకంటే ఎక్కువ శిక్ష ఉంటుందని తెలిసినా తెగించాం. తెదేపాలో చేరాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం’ అని వివరించారు. మారుజోల్ల కులవర్ధన్‌రెడ్డి, హరీశ్‌ మేకల, అశోక్‌ మేకల, మహేశ్‌, రమేశ్‌, ఓబులేసు, చంటి మారుతి కలమల్ల, కలిబాబు, మునిస్వామి, భార్గవ్‌ గోగుల, నారాయణస్వామి, వీరయ్య, వినయ్‌, డేరంగుల శ్రీనివాస్‌, మేదర గంగన్న, ఉప్పు కుమార్‌, పఠాన్‌ అన్వర్‌, పామిశెట్టి మహేశ్‌, తమ్మిశెట్టి వెంకటయ్య, షేక్‌ రఫీ, అమీర్‌, శంకర్‌ తదితరులు పార్టీలో చేరారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని