Omicron Variant: మరింతగా పాకుతోంది

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ మరిన్ని దేశాలకు వ్యాపించింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో సోమవారం ఈ కేసులు వెలుగుచూశాయి. పోర్చుగీస్‌కు చెందిన 13 మంది ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు కొత్త వేరియంట్‌

Published : 30 Nov 2021 05:48 IST

ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు పలు దేశాల చర్యలు

ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్‌ నగరంలో కరోనా వ్యాక్సిన్‌ కోసం బారులు తీరిన ప్రజలు

దిల్లీ, ద హేగ్‌, టోక్యో, బ్రసెల్స్‌: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ మరిన్ని దేశాలకు వ్యాపించింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో సోమవారం ఈ కేసులు వెలుగుచూశాయి. పోర్చుగీస్‌కు చెందిన 13 మంది ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు కొత్త వేరియంట్‌ సోకింది! దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ తొలిసారి వెలుగుచూసిన ప్రాంతంలోనే వీరంతా ఇటీవల పర్యటించినట్టు పోర్చుగీస్‌ నేషనల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. దక్షిణాఫ్రికా నుంచి గత శుక్రవారం నెదర్లాండ్స్‌ చేరుకున్న వారిలో 61 మంది పాజిటివ్‌ వ్యక్తులు ఉండగా, వారిలో 13 మంది కొత్త వేరియంట్‌ బాధితులేనని నిర్ధారణ అయింది. ఫ్రాన్స్‌లో ఇలాంటి ఎనిమిది అనుమానిత కేసులు వెలుగు చూశాయి. స్కాట్లాండ్‌లో తాజాగా ఆరుగురు ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. దీంతో బ్రిటన్‌లో ఈ కేసుల సంఖ్య 11కు చేరింది. ఆస్ట్రేలియాలో 5, జర్మనీలో 3, కెనడాలో రెండు కేసులు నమోదయ్యాయి. బెల్జియం, డెన్మార్క్‌ల్లోనూ కొత్త వేరియంట్‌ ఉ((నికి బయటపడింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగం అందుకున్నట్టు భావించిన పలు దేశాలు... కట్టడి చర్యలను మరింత ముమ్మరం చేశాయి. జపాన్‌లో ఇప్పటివరకూ ఒక్క ఒమిక్రాన్‌ కేసు కూడా నమోదు కానప్పటికీ... తమ సరిహద్దులను మూసివేస్తున్నామని, మంగళవారం నుంచి విదేశీయుల రాకపై నిషేధం విధిస్తున్నామని ఆ దేశ ప్రధానమంత్రి ఫుమియో కిషిద ప్రకటించారు. భారత్‌లో ఇప్పటివరకూ కొత్త వేరియంట్‌ కారక కేసులు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

అప్పటివరకూ తప్పదు
అనేక మార్పుల ఫలితంగా ఉద్భవించిన ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని, బాధితుల్లో తీవ్రస్థాయి అనారోగ్యానికి దారితీయవచ్చని, టీకా తీసుకున్నవారికీ సోకవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో... అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డా.ఆంటోనీ ఫౌచీ సోమవారం స్పందించారు. కొత్త వేరియంట్‌ తీవ్రత, దాని తీరుతెన్నులపై మరో రెండు వారాల్లో నిర్దిష్ట సమాచారం లభించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా, మరికొన్ని ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయుల రాకను నిషేధిస్తున్నట్టు తెలిపారు. ‘‘దక్షిణాఫ్రికాలో తక్కువ సమయంలోనే కొత్త వేరియంట్‌ ఎక్కువమందికి వ్యాపించింది. అలాగని ఇది డెల్టాను మించిపోతుందని చెప్పలేం. కొవిడ్‌ జాగ్రత్తల గురించి విని జనం అలసిపోయారు. కానీ, వైరస్‌ అలసిపోదు’’ అని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ డా.ఫ్రాన్సిస్‌ కొలిన్స్‌ పేర్కొన్నారు. హాంకాంగ్‌లో ఒమిక్రాన్‌ సోకిన ఇద్దరు వ్యక్తులు ఫైజర్‌ టీకా తీసుకున్నవారే. వారికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి.


ఆంక్షలను ఎత్తివేయాలి: రామఫోసా

కొత్త వేరియంట్‌ ఉందని పలు దేశాలు తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గతంలో ఉద్ధృతులు తలెత్తినప్పుడు వ్యాక్సిన్ల లభ్యత అంతగా లేదు. ఇప్పడు మా దగ్గర 12 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత టీకాలు లభిస్తున్నాయి. మహమ్మారి ఇప్పటికిప్పుడు మానవాళిని వీడిపోయేది కాదు. సుమారు 20 దేశాలు తొందరపడి మాపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆర్థికంగా, సామాజికంగా ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వెంటనే నిషేధం ఎత్తివేయాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్‌వో బాసటగా నిలిచింది. ‘‘ఆఫ్రికన్‌ దేశాలకు మేము తోడున్నాం. ప్రయాణ ఆంక్షలు విధించడం వల్ల ఒమిక్రాన్‌ వ్యాప్తి ఆలస్యం కావచ్చు. కానీ, చాలామంది జీవితాలపైనా, జీవనోపాధులపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఆంక్షలను శాస్త్రీయ ఆధారంగానే విధించాలి తప్ప... అమర్యాదగా, అనుచితంగా కాదు’’ అని ఆ సంస్థ పేర్కొంది. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్‌ తలెత్తిన విషయాన్ని దాచిపెట్టకుండా ప్రపంచానికి వెల్లడించారని, తద్వారా చాలామంది ప్రాణాలను కాపాడారని యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ ప్రశంసించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని