Updated : 18/11/2021 05:31 IST

PM Modi: అమృత కాలం.. కర్తవ్యమే మంత్రం

గడిచిన 75 ఏళ్లకు మించి రాబోయే పాతికేళ్లలో అభివృద్ధి
భారతీయ సమాజ సహజ స్వరూపం ప్రజాస్వామ్యం
అఖిల భారత స్పీకర్ల సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన

స్పీకర్ల సదస్సులో వీడియో ద్వారా మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఈనాడు, దిల్లీ: వచ్చే 25 ఏళ్లు దేశానికి అమృత కాలమని, లక్ష్యాల సాధనకు ప్రతిఒక్కరూ ‘కర్తవ్య మంత్రం’ పఠించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం శిమ్లాలో హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ వేదికగా ప్రారంభమైన 82వ అఖిల భారత సభాపతుల సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 2047 నాటికి దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి, అందులో చట్టసభల పాత్ర ఎలా ఉండాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించి దిశానిర్దేశం చేస్తే అదెంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సభాపతుల భేటీ పరంపర వందేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ‘ప్రజాస్వామ్యం ఒక వ్యవస్థ మాత్రమే కాదు. అది భారతీయ సహజ స్వభావ స్వరూపం. రాబోయే సంవత్సరాల్లో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలి. అది అందరి ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది. గత 75 ఏళ్లకు మించి రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేది కర్తవ్యమే అని గుర్తుంచుకోవాలి’ అని ప్రధాని చెప్పారు. ‘‘జీవితాన్ని పూర్తిగా సమాజ అభ్యున్నతి కోసం అంకితం చేసిన ప్రజా ప్రతినిధులు ప్రతి పార్టీలోనూ ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించి వారి అనుభవాలను పంచుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం మేలు’’ అన్నారు.

చర్చలకు విలువ జోడించాలి

‘‘చట్టసభల్లో చర్చలకు విలువను ఎలా జోడించాలి అన్నది చూడాలి. అన్ని పార్టీలూ చర్చలకు ప్రాధాన్యం ఇచ్చి సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొల్పాలి. ఇందులో సభాపతుల పాత్ర చాలా కీలకం. యువ సభ్యులకు, వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినవారికి, మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి. పార్లమెంటు కమిటీలనూ ప్రజావసరాలకు తగ్గట్టు నిర్వహించాలి.

దేశమంతటికీ ఒకే డిజిటల్‌ శాసన వేదిక!

దేశమంతటికీ ఒకే రేషన్‌ కార్డు, వేర్వేరు అవసరాలకు ఉమ్మడిగా వినియోగించుకునే రూపే కార్డు లాంటివి ప్రారంభించుకున్నాం. అలాగే ఇప్పుడు ‘ఒకే దేశం.. ఒకే శాసనవేదిక’ సాధ్యమా? అన్నది పరిశీలించాలి. శాసనవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, దేశంలోని అన్ని స్థానిక సంస్థలను కలిపేందుకు ఒక డిజిటల్‌ వ్యవస్థను రూపొందించాలి. చట్టసభలకు సంబంధించిన అన్ని వివరాలూ ఈ పోర్టల్‌లో లభించేలా చూడాలి. చట్టసభలు కాగిత రహితంగా పనిచేయాలి. పార్లమెంటు ఉభయ సభాపతుల ఆధ్వర్యంలో ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని శాసనసభల గ్రంథాలయాలనూ డిజిటల్‌ రూపంలో ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలి’’ అని మోదీ పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ- చట్టసభల హుందాతనాన్ని పెంచడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రజల హక్కుల్ని కాపాడేలా చట్టసభల నియమ నిబంధనల్ని సమీక్షించాలని సభాపతుల్ని కోరారు. చట్టసభలన్నింటికీ వర్తించేలా నిబంధనలపై ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేయాలన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని