Sankranthi:పోరు‘బరి’లో దూసిన కత్తులు

ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా, ఇతర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఆదివారం కనుమ రోజు పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా వందలాది బరులు ఏర్పడ్డాయి. సంక్రాంతి 3రోజుల్లో వందల కోట్లు చేతులు మారాయి. గుండాటలు పెద్దఎత్తున జరిగాయి.

Updated : 17 Jan 2022 04:45 IST

జోరుగా కోడి పందేలు
చేతులు మారిన రూ.కోట్లు
కార్లు, బైక్‌లు కూడా పందేనికి..
జాతరను తలపించిన మైదానాలు

ముమ్మిడివరం, ఏలూరు గ్రామీణ, భీమవరం పట్టణం, పాలకోడేరు, న్యూస్‌టుడే: ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా, ఇతర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఆదివారం కనుమ రోజు పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా వందలాది బరులు ఏర్పడ్డాయి. సంక్రాంతి 3రోజుల్లో వందల కోట్లు చేతులు మారాయి. గుండాటలు పెద్దఎత్తున జరిగాయి. అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించింది. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దదైన కాట్రేనికోన మండలం పల్లంకుర్రు బరి వద్ద శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఉభయగోదావరి జిల్లాల మధ్య రోజుకు 20 చొప్పున 3రోజులపాటు ఒప్పంద పందేలు నిర్వహించేందుకు అవగాహనకు వచ్చారు. వాటిలో ఎక్కువ గెలిచిన వారికి ఇన్నోవా కారు బహుమతిగా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చిన వారికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నేతృత్వం వహించారు. బరిలోకి ప్రవేశించే సభ్యుల సంఖ్య విషయంలో ఆయనకు, తూర్పుగోదావరి జిల్లా తరఫున పుంజులను బరిలోకి దింపుతున్న వారికి మధ్య స్వల్పవివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రభాకర్‌ బరి నుంచి బయటకు వెళ్లడంతో ఒప్పంద పందేలకు బ్రేక్‌ పడింది. దీంతో బహుమతిగా ప్రకటించిన ఇన్నోవా కారు ఎవరికీ దక్కలేదు. అనంతరం సాధారణ పందేలు యథావిధిగా సాగాయి. యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో కోడిపందేల కోసం స్థలం దొరకక తొలుత గ్రామ శ్మశానంలో బరి ఏర్పాటుచేశారు. ఆదివారం గ్రామానికి చెందిన ఒకరు చనిపోవడంతో మరోచోటకు బరి మార్చారు.

పందెంగా బుల్లెట్‌
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఉండి, కాళ్ల, వీరవాసరం, ఉండ్రాజవరం తదితర మండలాల్లో పండుగ 3రోజులు రాత్రివేళ ఫ్లడ్‌లైట్ల వెలుగులోనూ పందేలు నిర్వహించారు. ఒక్క ఏలూరు మండలంలో 3రోజుల్లో రూ.కోటిన్నరపైగా చేతులు మారినట్లు అంచనా. బరుల ప్రాంతాలు జాతరను తలపించాయి. పాలకోడేరు మండలం పెన్నాడలో పందేల్లో శృంగవృక్షం గ్రామానికి చెందిన రైతు బుల్లెట్‌ బైక్‌ గెలుచుకున్నారు. కొందరు స్నేహితులు కలిసి సొమ్ము వేసుకొని కొత్త బుల్లెట్‌ వాహనాన్ని కొన్నారు. రెండు బృందాలుగా ఏర్పడి పోటీ పడగా మిత్రబృందంలో ఒకరికి బుల్లెట్‌ దక్కింది. కృష్ణా జిల్లాలో కోడి పందేలు, జూదం విచ్చలవిడిగా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు బరుల వద్ద నోటీసులంటించి ఉదాసీనంగా వ్యవహరించారు.

వరాహ సమరం
తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఎక్కడైనా కోళ్లు, ఎడ్ల పందేలు చూస్తుంటాం. పందుల పోటీలు చూడాలంటే మాత్రం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లాల్సిందే. సంక్రాంతిని పురస్కరించుకుని గూడెం మండలం కుంచనపల్లిలో ఏటా పందుల పోటీలు నిర్వహిస్తారు. ఈసారి కూడా మెట్ట ఉప్పరగూడెం, కోనాల గ్రామాలకు చెందిన పందులు తలపడగా మెట్ట ఉప్పరగూడేనికి చెందిన వరాహం గెలిచింది. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలవారు భారీగా హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని