TTD: తప్పిన పెనుముప్పు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారిలో బుధవారం ఉదయం బస్సు డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. కొండపైకి వెళ్లే మార్గంలో 13, 14, 15 కిలోమీటర్ల పరిధిలో భారీగా దుమ్ము, పొగ లేవడాన్ని గుర్తించిన డ్రైవర్‌ రవీంద్ర.. వెంటనే బస్సు ఆపి మెల్లిగా వెనక్కి నడిపించారు.

Updated : 02 Dec 2021 05:16 IST

తిరుమల రహదారిలో కొండచరియలు విరిగిపడి.. రోడ్లు, రక్షణ గోడ ధ్వంసం

తిరుమల రెండో కనుమ మార్గంలో ధ్వంసమైన రోడ్డు, ఆగిన వాహనాలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారిలో బుధవారం ఉదయం బస్సు డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. కొండపైకి వెళ్లే మార్గంలో 13, 14, 15 కిలోమీటర్ల పరిధిలో భారీగా దుమ్ము, పొగ లేవడాన్ని గుర్తించిన డ్రైవర్‌ రవీంద్ర.. వెంటనే బస్సు ఆపి మెల్లిగా వెనక్కి నడిపించారు. అంతలోనే కొండచరియలు విరిగిపడుతూ బండరాళ్లు, మట్టి రోడ్డుపైకి జారాయి. బస్సు ముందుకువెళ్లి ఉంటే.. భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు, ప్రయాణికులు ఆందోళన చెందారు. రోడ్డు ధ్వంసం కావడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. తితిదే భద్రత, అటవీ శాఖల సిబ్బంది వచ్చి ట్రాఫిక్‌ను మళ్లించారు.

ఘాట్‌ రోడ్డులోని రక్షణ గోడను పరిశీలిస్తున్న తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, చిత్రంలో జేఈవో వీరబ్రహ్మం, అధికారులు

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులతో కలిసి ప్రమాదస్థలిని పరిశీలించారు. ఇటీవలి వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయని, రెండో ఘాట్‌రోడ్డులో మరో ఐదారు చోట్ల ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ‘వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించాం. గురువారం దిల్లీ ఐఐటీ నిపుణుల బృందం వస్తుంది. కొండచరియలు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఇక్కడ మరమ్మతులు పూర్తయ్యేదాకా మొదటి ఘాట్‌ రోడ్డులోనే వాహనాల రాకపోకలకు అనుమతిస్తాం. నడకదారిలో వెళ్లే భక్తులకు ఇబ్బంది లేదు’ అని వివరించారు. జారిపడిన బండరాళ్లను తొలగించామని ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని