Updated : 02 Feb 2022 05:44 IST

ఆర్థికవ్యవస్థకు ఊతం.. అధికార పక్షం: సామాన్యులకు ద్రోహం..విపక్షం

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భారత్‌ను ఆత్మనిర్భర దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ పద్దు ఉపకరిస్తుందని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ బడ్జెట్‌ ద్వారా పేదలు, వేతన జీవులకు కేంద్రం నమ్మకద్రోహం చేసిందని ప్రతిపక్ష నేతలు విరుచుకుపడ్డారు.


ప్రభుత్వ దూరదృష్టికి ప్రతిబింబం
 అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి

భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని పెంచేలా.. మోదీ ప్రభుత్వానికున్న దూరదృష్టిని ఈ బడ్జెట్‌ చాటిచెప్పింది. కొవిడ్‌ అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొంటూ.. భారత్‌ను తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలపాలన్న వ్యూహం ఇందులో ఉంది. వందేళ్ల స్వాతంత్య్ర సంబరాల నాటికి స్వయం సమృద్ధ భారత్‌గా అవతరించేందుకు ఈ బడ్జెట్‌ పునాది.


దేశీయ రక్షణ పరిశ్రమలకు ఊపు
 రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి

కేంద్ర బడ్జెట్‌ అద్భుతంగా ఉంది. రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి నిధుల్లో 25% మొత్తాన్ని ఈ రంగంలోని స్టార్టప్‌లు, ప్రైవేటు సంస్థల కోసం కేటాయించడం గొప్ప ముందడుగు. దేశీయ పరిశ్రమల నుంచే 68% రక్షణ పరికరాలు సేకరిస్తామనడంలో స్థానికతకు ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమైంది.


ధనికులకే అనుకూలం
 మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ ప్రతిపక్ష నేత

బడ్జెట్‌ కేవలం ధనికులకు, వారి స్నేహితులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు.పేదలకు దీనితో ఏం సంబంధం లేదు.  ఇందులో క్రిప్టో కరెన్సీ గురించి కూడా ప్రస్తావించారు. దానిపై ఇప్పటివరకు ఎలాంటి చట్టం లేదు. కనీసం చర్చించనూ లేదు.


పెట్టుబడిదారుల పద్దు
  చిదంబరం, మాజీ ఆర్థిక మంత్రి

పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలంగా బడ్జెట్‌ రూపొందించారు. పేదలు, రైతులకు ఏమీ ఇవ్వకుండా.. ప్రయోజనాలన్నీ బడా పారిశ్రామికవేత్తలకే చెందేలా చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేనంత వేగంగా భారత్‌లో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయి. లోక్‌సభలో మందబలంతో ఈ బడ్జెట్‌ను ఆమోదింపజేసుకున్నా.. ప్రజలు తిరస్కరించడం ఖాయం.


మాటలే తప్ప చేతలేవీ?
 మమతా బెనర్జీ, బెంగాల్‌ ముఖ్యమంత్రి

నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో చితికిపోయిన సామాన్యులకు కేంద్ర బడ్జెట్‌తో ఎలాంటి ప్రయోజనం లేదు. భారీ ప్రకటనలు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఉపయోగపడే చర్యలేవీ లేవు. ఇది పెగాసస్‌ స్పిన్‌ బడ్జెట్‌. అంతా నిస్సారం.


సంపన్నులపై పన్నులు పెంచరెందుకు?
 సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

బడ్జెట్‌ ఎవరి కోసం? 10 శాతం మంది భారతీయుల దగ్గర 75 శాతం దేశ సంపద ఉంది. 60 శాతం మంది పేదల వద్ద కేవలం 5 శాతం సంపదే ఉంది. నిరుద్యోగం, పేదరికం, ఆకలి బాధలు పెరుగుతుంటే.. మహమ్మారి సమయంలో లాభాలు అర్జించిన వారిపై పన్నులు ఎందుకు పెంచరు?

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts