వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే

‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు’’ సహజమే అంటూ సోమవారం రాత్రి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో..

Updated : 28 Sep 2021 04:38 IST

పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌

ఈనాడు, అమరావతి: ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు’’ సహజమే అంటూ సోమవారం రాత్రి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు. దీంతో పాటు ‘హు లెట్‌ ది డాగ్స్‌ ఔట్‌’ అన్న పాటను ట్వీట్‌ చేస్తూ ఇది తనకు ఇష్టమైన వాటిలో ఒకటి అంటూ వ్యాఖ్యానించారు. ఆ పాట వీడియో ఆల్బమ్‌ను ట్వీట్‌కు జత చేశారు.

29న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 29న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరగనుంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ దాష్టీకాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ చేపట్టే కార్యక్రమాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొంటారు.

2న పవన్‌కల్యాణ్‌ శ్రమదానం
జనసేనాని పవన్‌కల్యాణ్‌ అక్టోబరు 2న పార్టీ శ్రమదాన కార్యక్రమంలో భాగంగా రెండు చోట్ల పాల్గొననున్నారు. తొలుత ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీపై దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. 2018లో తన పోరాటయాత్రలో భాగంగా ఈ రోడ్డుపైనే ఆయన కవాతు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. కొత్త చెరువు పంచాయతీ పరిధిలోని పుట్టకుర్తి-ధర్మవరం రోడ్డుకు శ్రమదానం చేసి మరమ్మతులు చేపడతారు. రాష్ట్రంలో ధ్వంసమైన రహదారుల పరిస్థితిని తెలియజేసేందుకు జనసేన సెప్టెంబరు 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాల వేదికగా కార్యక్రమం చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని