
పొరుగు రాష్ట్రం ఎంపీల్లా వైకాపా సభ్యులు పోరాడలేరా?
తెదేపా లోక్‌సభాపక్ష నేత రామ్మోహన్ నాయుడి ధ్వజం
ఈనాడు, దిల్లీ: ప్రత్యేక హోదా.. విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి హామీలపై వైకాపా ఎంపీలు పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించడం లేదు.. ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల భయంతో హామీలను తాకట్టు పెట్టారా? అని తెదేపా లోక్‌సభపక్షనేత కె.రామ్మోహన్నాయుడు ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌తో కలిసి దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా తెస్తానని, అది వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తాయని, ప్రకాశం జిల్లా హైదరాబాద్‌లా అవుతుందని నాడు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు. ఆయన మాటలు నమ్మి ప్రజలు వారి మాట నిలబెట్టుకున్నారు. మరి జగన్మోహన్రెడ్డి ఎందుకు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం లేదు. 22 లోక్‌సభ, ఆరుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉన్నా... ఎందుకు పార్లమెంటులో మాట్లాడడం లేదు? పొరుగు రాష్ట్రం తెలంగాణ ఎంపీలు ధాన్యం సమస్యపై వెల్‌లోకి వెళ్లి బైఠాయిస్తుంటే వైకాపా ఎంపీలకు ఎందుకు దమ్ము సరిపోవడం లేదు? ప్రత్యేకహోదా ముగిసిన అంశమని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మరో ఆలోచన లేదని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తుంటే ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు...’ అని ఆయన నిలదీశారు. పునర్విభజన చట్టం షెడ్యూల్ 9, 10లో రాష్ట్రానికి దక్కాల్సిన సంస్థలపై పోరాడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎంకు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని వివాహాల్లో కౌగిలించుకోవడానికి, కలిసి భోజనాలు చేయడానికి సమయం ఉంది కానీ ఉమ్మడి సంస్థల విభజనపై తేల్చుకోవడానికి లేదా? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రం నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు రూ.6 వేల కోట్లకుపైగా ఉంటే వాటిని వసూలు చేయలేక ఓటీఎస్ పేరుతో పేదవాడి జేబులో నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారని రామ్మోహన్నాయుడు ఆరోపించారు.
అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కనకమేడల
రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని పార్లమెంటులో వైకాపా సభ్యుడు భరత్ చెప్పారని, రాష్ట్రం దివాలా తీసేలా ఉందని మరో సభ్యుడు రఘురామకృష్ణరాజు చెప్పారని తెలిపారు. రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కనకమేడల డిమాండ్ చేశారు.