Published : 05/12/2021 04:51 IST

షెకావత్‌పై చంద్రబాబు ఏజెంట్ల ప్రభావం పనిచేసిందేమో?

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: ‘అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంపై కేంద్ర మంత్రి షెకావత్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ఏజెంట్లు సీఎం రమేష్‌, సుజనా చౌదరి ప్రభావం షెకావత్‌పై పనిచేసిందేమో? లేదా రాష్ట్రంలో భాజపా బలోపేతం కావాలనుకుంటుందేమో! అందువల్లే ఏదో ఒక దాంట్లో అడ్వాంటేజ్‌ తీసుకోవాలనుకున్నారో...’అని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి పి.అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యం కంటే ఒకటిన్నరరెట్లు వరద వచ్చిందని ఆయనే(షెకావత్‌) చెప్పారు. మళ్లీ అందులోనే ప్రాజెక్టుకు ఉన్న ఐదు గేట్లలో ఒక్క గేటు తెరుచుకోకపోవడం వల్లే నష్టం జరిగిందనడంలో అర్థమేంటి? ఆ ఒక్క గేటూ పనిచేస్తే మాత్రం దాన్నించే నీరంతా వెళ్లేదా? ఉత్తరాఖండ్‌లో 170మందికిపైగా వరదల్లో కొట్టుకుపోయారే! మరి అది అక్కడి భాజపా ప్రభుత్వ వైఫల్యమా?కేంద్ర మంత్రి కాబట్టి షెకావత్‌ చెప్పిందే నిజమైపోతుందా? వారికి రాజకీయ ఆలోచనలు ఏమున్నాయో...’అని ధ్వజమెత్తారు. శనివారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర మంత్రి చెబితే అదే రబ్బరుస్టాంపు అన్నట్లుగా ఆ వ్యాఖ్యలను పట్టుకుని చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తప్పుదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగైతే చంద్రబాబుకు పోలవరం ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని మోదీ అన్నారు కదా! దాన్నీ చంద్రబాబు అంగీకరిస్తున్నారా? అసలు అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే మొత్తాన్ని మార్చాలని 2017లోనే డ్యాం సేఫ్టీ వారు నివేదిక ఇస్తే ఆయన పట్టించుకోలేదు. అప్పుడే కట్టి ఉంటే ఇప్పుడీ విపత్తు ఉండేది కాదు. ఇప్పుడు ఈ విపత్తుకు చంద్రబాబే కారణం. నవంబరు 18న రాత్రి నాలుగున్నర గంటల తర్వాత రెండు గంటల్లో అన్నమయ్య ప్రాజెక్టుకు 3.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన నిజాన్ని దాచేస్తున్నారు. నెల్లూరులోనూ జొన్నవాడ వద్ద సన్నటి మార్గంలో పెన్నా వెళ్లాల్సి రావడంతో అక్కడ కట్ట తెగింది. దాన్ని పట్టుకొచ్చి నెల్లూరు పట్టణంలో పొర్లు కట్టలకు లింకు పెట్టి మాట్లాడుతున్నారు. శవాలపై కట్టలు కడతారా అంటూ విషప్రచారం చేస్తున్నారు. అసలు ఆ కట్టలు గత ఏడాదే ప్రభుత్వం మంజూరు చేసింది. సోమవారం టెండర్లు తెరవనున్నాం. ఇవన్నీ తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు...’అని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు. పోలవరం ఏడాదిలోగా పూర్తవుతుందని ఆశిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని